చాలామంది చిన్న కష్టం రాగానే కుంగిపోతూ ఉంటారు. అక్కడితో జీవితం అయిపోయిందని బాధపడుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే ఆ కష్టాలతో పోరాడతారు. పడతారు, లేస్తారు. కానీ చివరకు గెలిచే తీరుతారు. అలాంటి కథే తమిళనాడుకు చెందిన కోకిలది.

కష్టాలు అందరికీ వస్తాయి. కానీ వాటిని ఎదుర్కొని, తట్టుకొని నిలబడ్డప్పుడే మన శక్తి, సామర్థ్యాలు ప్రపంచానికి తెలుస్తాయి. అలా కష్టాలతో పోరాడి ఎదిగిన వారే తమిళనాడుకి చెందిన కోకిల. అనారోగ్యంతో భర్త చనిపోయినా కోకిల ఎక్కడా వెనకడుగు వేయలేదు. కుటుంబాన్ని పోషించడమే కాకుండా, సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్ గా కూడా ఎదిగారు. నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇంతకీ ఆమె స్టోరీ ఏంటో ఒకసారి తెలుసుకోండి.

పరిస్థితులు కుంగదీసినా..

తమిళనాడులోని వాళ్ళజాపేటలో ఉంటున్న కోకిల ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందింది. కోకిల బీఎస్సీ చేసి, ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. ఆమె పెళ్లి ఒక ప్రైవేటు ఉద్యోగితో జరిగింది. 35 ఏళ్ళ వయసులో ఆమె భర్తకు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య వచ్చింది. దాదాపు ఏడేళ్ళపాటు చికిత్స తీసుకున్నా తర్వాత ఆయన చనిపోయారు. దీంతో కోకిలపై కుటుంబ భారం పడింది. ముగ్గురు పిల్లల పోషణతో పాటు భర్త వైద్యానికి అయిన ఖర్చు ఆమెను ఆర్థికంగా ఎంతగానో కుంగదీసింది.

పగలు ఉద్యోగం, రాత్రి బిజినెస్

భర్త చనిపోయాక కోకిలకి ఒక్కదాని జీతం సరిపోలేదు. ముగ్గురు కొడుకుల చదువు, కుటుంబ ఖర్చుల కోసం ఆమె అదనపు ఆదాయం కోసం ఆలోచించారు. ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నారు. అనుకున్నట్టుగానే చెక్క పెట్టెల సరఫరా వ్యాపారం మొదలుపెట్టారు. అది ఆమెకు కొత్తది. పగలు ఉద్యోగం, రాత్రి బిజినెస్ చేస్తూ కష్టాలు వెల్లదీసే ప్రయత్నం చేశారు.

బిజినెస్ ఎదుగుదల

ఏళ్ళ తరబడి కష్టపడిన తర్వాత కోకిల కొడుకు కూడా ఆమెకు తోడయ్యాడు. ఉద్యోగాన్ని సైతం వదిలి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నాడు. అది వారికి టర్నింగ్ పాయింట్ అయింది. ఒకరోజు మార్కెట్ లో నాసిరకం ప్లాస్టిక్ బొమ్మలు చూసిన కోకిల.. అవి పర్యావరణం, పిల్లల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తాయని అనుకుంది. వాటికి బదులు చెక్క బొమ్మలు అయితే బాగుంటాయని అనుకుంది. చెక్క బొమ్మల వ్యాపారం మొదలుపెట్టాలని నిర్ణయించుకుంది.

'వుడ్బీ టాయ్స్' ప్రారంభం

చెక్క బొమ్మలు తయారు చేయడం అంత సులభం కాదు. మార్కెట్ లో ప్లాస్టిక్ బొమ్మలే ఎక్కువగా ఉండేవి. ఎక్కువమంది వాటినే కొనేవారు. అవి రేటు కూడా తక్కువ. అయితే కోకిల, ఆమె కుటుంబం పర్యావరణహితమైన, మన్నికైన బొమ్మలపై దృష్టి పెట్టారు. పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించి సామాజిక మార్పు తీసుకురావాలని చూశారు. మొదట్లో కష్టాలు ఎదురైనా, క్రమంగా వారి వ్యాపారం అభివృద్ధి చెందింది.

ప్రస్తుతం 'వుడ్బీ టాయ్స్' టర్నోవర్?

ప్రస్తుతం 'వుడ్బీ టాయ్స్' 110 రకాల చెక్క బొమ్మలు తయారు చేస్తోంది. నెలకు రూ. 20- 30 లక్షల రూపాయల టర్నోవర్ సాధిస్తోంది. పిల్లల భద్రత దృష్ట్యా కంపెనీ విషరహిత, సహజ రంగులను ఉపయోగిస్తుంది.