- Home
- Life
- Ghee Temple: నీటితో కాదు.. 40వేల కేజీల నెయ్యితో నిర్మించిన టెంపుల్... ఎండకు నెయ్యి బయటకు వస్తుందా?
Ghee Temple: నీటితో కాదు.. 40వేల కేజీల నెయ్యితో నిర్మించిన టెంపుల్... ఎండకు నెయ్యి బయటకు వస్తుందా?
Ghee Temple: మన దేశంలో నీటితో కాకుండా.. నెయ్యితో నిర్మించిన టెంపుల్ ఒకటి ఉందని మీకు తెలుసా? అంతేకాదు.. ఎండాకాలం ఎండలకు ఆ టెంపుల్ నుంచి నెయ్యి కూడా బయటకు వస్తుందా? ఈ వింత టెంపుల్ ఎక్కడ ఉంది?

Golden Ghee Temple
ఇల్లు, గుడి ఏది కట్టాలన్నా... ఇసుక, సిమెంట్, సున్నంతో పాటు నీళ్లు కూడా కావాల్సిందే. కానీ, చుక్క నీరు వాడకుండా.. నీటికి బదులు.. ఏకంగా వేల కిలోల స్వచ్ఛమైన నెయ్యిని ఉపయోగించి.. ఒక ఆలయాన్ని నిర్మించారు. వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. ఈ ఆలయం మన దేశంలోనే ఉంది. ఈ ఆలయం రాజస్థాన్ లో ఉంది. రాజస్థాన్ లోని ఎడారి నగరం అయిన బికనేర్ లో ఉంది. దాదాపు 550 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రాచీన జైన దేవాలయం ఇది. ఈ టెంపుల్ నిర్మాణం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. మరి, ఈ టెంపుల్ నిర్మాణంలో నీటిని బదులు నెయ్యిని ఎందుకు వాడారు? దాని వెనక కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం....
ఆలయ నిర్మాణం వెనక కథ...
ఈ ప్రాచీన నిర్మాణాన్ని ‘ భండానాథ్ జైన ఆలయం’ అని పిలుస్తారు. ఇది జైన మతంలో 5వ తీర్థంకరుడైన శ్రీ సుమతినాథ భగవానుడికి అంకితం చేస్తూ నిర్మించారు. 1468 లో బికనేర్ కి చెందిన ‘ భండాసా ఓస్వాల్’ అనే ఒక అత్యంత ధనిక వర్తకుడు ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ ఆలయ నిర్మాణానికి ముందు.. రాజస్థాన్ లో తీవ్రమైన కరువు, నీటి కొరత ఉండేది. ఒకసారి.. భండాసా ఓస్వాల్ నేలపై ఒలికిన ఒక్క నెయ్యి బొట్టును కూడా దాచి పెడుతుండటాన్ని స్థానికులు చూసి ఆయనను ఎద్దేవా చేశారట. ఆయన పరమ పిసినారి అంటూ కామెంట్ చేశారట. దీంతో.. ఆయన ఆ మాటలు విని చాలా బాధపడ్డారు. అందుకే.. తాను పిసినారి అని హేళన చేసిన వారికి బుద్ధి చెప్పడానికిచ భండాసా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆలయ నిర్మాణంలో సున్నపు మిశ్రమం తయారు చేయడానికి నీటికి బదులుగా నెయ్యిని మాత్రమే ఉపయోగిస్తాను అని శపథం చేశారు. ఆ శపథం ప్రకారమే.. ఆయన ఆలయ నిర్మాణంలో నీటికి బదులు 40 వేల లీటర్ల నెయ్యిని ఉపయోగించారు. తన మాటను కూడా నిలబెట్టుకున్నారు.
40వేల లీటర్ల నెయ్యి.. 86ఏళ్ల నిర్మాణం....
ఆలయ నిర్మాణంలో సున్నం కలిపేందుకు ఏకంగా 40,000 కిలోల స్వచ్ఛమైన నెయ్యిని ఉపయోగిస్తూ నిర్మాణం చేపట్టారు. ఈ ఆలయ నిర్మాణం పూర్తికావడానికి ఏకంగా 86 సంవత్సరాలు పట్టింది. 1514లో భండాసా మరణించినప్పటికీ, నిర్మాణం ఆగకుండా కొనసాగి చివరకు 1554లో పూర్తయింది.
ఆలయ గోడల నుంచి నెయ్యి కారుతుందా?
వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటినప్పుడు, ఆలయ రాతి నేలలు, గోడల నుండి చిన్నగా నెయ్యి జిడ్డు గీతలు బయటకు కనిపిస్తాయని స్థానికులు గట్టిగా నమ్ముతారు. నిర్మాణం సమయంలో వాడిన నెయ్యే ఇప్పటికీ అలా ఆవిర్భవిస్తుందని భక్తుల నమ్మకం!
రాజస్థానీ హస్త కళ...
ఈ ఆలయం మొత్తం మూడు అంతస్థులు ఉంటుంది. ఈ ఆలయం కేవలం నెయ్యి ప్రయోగానికే కాదు, తన అద్భుతమైన నిర్మాణ శైలికి కూడా ప్రసిద్ధి చెందింది. రాజస్థాని హస్త కళ మొత్తం ఈ ఆలయంపై క్లియర్ గా కనపడుతుంది. ఆలయ సీలింగ్స్, గోడలపై బంగారు పెయింటింగ్స్ కనువిందు చేస్తాయి. అంతేకాదు.. అద్దాలతో చేసిన అద్భుతమైన డిజైన్లు, జైన మతంలోని 24 మంది తీర్థంకరుల విగ్రహాలు కూడా చెక్కారు. ప్రస్తుతం ఈ అద్భుతమైన ఆలయాన్ని భారత పురావస్తు శాఖ రక్షిత వారసత్వం సంపదగా పర్యవేక్షిస్తుంది.





