Samosa capital: మనదేశంలో సమోసాల రాజధాని అని ఏ నగరాన్ని పిలుస్తారో తెలుసా?
Samosa capital: సాయంత్రం వేళ వేడి ఛాయ్‌తో సమోసా తింటే ఆ మజానే వేరు. సమోసా అంటే ఉల్లి, ఆలూ, స్వీట్ కార్న్ మాత్రమే మనకు తెలుసు. కానీ ప్రాంతంలో వందల రకాల సమోసా వెరైటీలు దొరుకుతాయి. అందుకే దీన్ని సమోసా క్యాపిటల్ అని పిలుస్తారు. ఇంతకీ ఆ నగరమేదో తెలుసా?

వేడి వేడి టీతో అదిరిపోయే సమోసా..
సాయంత్రం వేళ వేడివేడి ఛాయ్‌తో పాటు సమోసా తినాలంటే చాలా మంది బాగా ఇష్టం. బయట కరకరలాడుతూ, లోపల ఆలూ మసాలాతో నోరూరించే ఈ సమోసా దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్. అయితే కొన్ని నగరాల్లో సమోసాకు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు. అక్కడ ఆలూ సమోసాలతో పాటు కొత్త కొత్త రుచుల్లోనూ తయారు చేస్తుంటారు. మరి ఇన్ని రకాల సమోసాలు దొరికే ఆ నగరం ఏది? దానిని సమోసాల రాజధాని అని ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం.
సమోసాల రాజధాని ఢిల్లీ
భారతదేశ రాజధాని ఢిల్లీకి రాజకీయాలతో పాటు ఆహార సంస్కృతిలోనూ ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా వీధి ఆహారానికి ఈ నగరం పెట్టింది పేరు. అందులో సమోసాకు ప్రత్యేక స్థానం ఉంది. చాందినీ చౌక్‌లోని రద్దీ వీధుల నుంచి చిన్న చిన్న స్వీట్ షాపులు, కాలేజీ క్యాంటీన్ల వరకు ఎక్కడ చూసినా సమోసాలు కనిపిస్తాయి.
ఉదయం టిఫిన్‌గా, సాయంత్రం స్నాక్‌గా, పండుగల సమయంలో ప్రత్యేక వంటకంగా వీటిని ఆస్వాదిస్తుంటారు. ఢిల్లీలో సమోసాలకు ఇంతటి క్రేజ్ రావడానికి ప్రధాన కారణం అక్కడ లభించే వెరైటీలే. సాధారణ ఆలూ సమోసా నుంచి వెరైటీ ఫ్యూజన్ సమోసాల వరకు ఎన్నో రుచులు అందుబాటులో ఉంటాయి.
ఢిల్లీలో దొరికే సమోసాల రకాలివే..
సాధారణంగా మనకు ఆలూ సమోసా మాత్రమే ఎక్కువగా గుర్తొస్తుంది. కానీ ఢిల్లీలో మాత్రం సమోసాల్లోనూ ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు.
పంజాబీ ఆలూ సమోసా: బంగాళాదుంపలు, బఠానీలు, ఘాటైన మసాలాలతో తయారుచేసే సంప్రదాయ సమోసా.
పనీర్ సమోసా: మసాలాలు కలిపిన పనీర్‌తో తయారుచేసే ఈ సమోసా పనీర్ ప్రియులకు నచ్చుతుంది.
కీమా సమోసా: మాంసాహార ప్రియుల కోసం మటన్ లేదా చికెన్ కీమాతో తయారుచేసే వెరైటీ.
కార్న్ అండ్ చీజ్ సమోసా: స్వీట్ కార్న్, చీజ్ కలిపి తయారుచేసే ఆధునిక రకం.
చౌమీన్ సమోసా: నూడుల్స్‌తో తయారుచేసే ఈ సమోసా ఫ్యూజన్ ఫుడ్ ఇష్టపడేవారిని ఆకట్టుకుంటుంది.
డ్రై ఫ్రూట్స్ సమోసా: పండుగల సమయంలో ప్రత్యేకంగా తయారుచేసే ఈ రకంలో నట్స్, డ్రై ఫ్రూట్స్‌తో పాటు తీపి పదార్థాలను ఉపయోగిస్తారు.
ఇవే కాకుండా పిజ్జా, పాస్తా, చాక్లెట్ రుచుల్లోనూ సమోసాలు లభిస్తాయి. ఇలా ఒకే చిరుతిండిలో ఇన్ని రకాల రుచులను పరిచయం చేయడం ఢిల్లీ ప్రత్యేకత.
ఢిల్లీ సమోసాల్లో ఇంకో ప్రత్యేకత
ఢిల్లీ సమోసాలు వాటి కరకరలాడే పొర, ఘాటైన మసాలాతో చాలా బాగుంటాయి. ముఖ్యంగా పంజాబీ స్టైల్ సమోసాలు పెద్దగా ఉండటమే కాకుండా, లోపల బంగాళాదుంపలు, బఠానీలు, మసాలాలతో నింపేస్తారు.
పుదీనా చట్నీతో అదిరిపోద్ది
సమోసాలను పుదీనా చట్నీ, చింతపండు చట్నీతో తింటే రుచే వేరు. కొందరు సమోసాలను నేరుగా తింటే, మరికొందరు పెరుగు, చట్నీలు, మసాలాలు కలిపి సమోసా చాట్లా ఆస్వాదిస్తారు. అందుకే ఢిల్లీలో రోజంతా సమోసా దుకాణాల దగ్గర రద్దీ కనిపిస్తుంటుంది.
ఇతర నగరాల్లోనూ సమోసాలకు క్రేజ్
లక్నో, ఇండోర్, జైపూర్ వంటి నగరాల్లోనూ సమోసాలకు మంచి ఆదరణ ఉంది. అక్కడ కూడా ప్రత్యేకమైన తయారీ విధానాలు, రుచులు కనిపిస్తాయి. అయితే ఢిల్లీలో సంప్రదాయ రుచులతో పాటు కొత్త కొత్త ప్రయోగాలు కూడా విస్తృతంగా కనిపిస్తాయి. అందుకే ఈ నగరాన్ని సమోసాల రాజధానిగా గుర్తిస్తారు.





