- Home
- Life
- Dosa: ఇదొక్కటి కలిపితే...పులిసిపోయిన దోశ పిండిని మళ్లీ రుచిగా మార్చేయచ్చు.. హోటల్ స్టైల్ దోశ పక్కా
Dosa: ఇదొక్కటి కలిపితే...పులిసిపోయిన దోశ పిండిని మళ్లీ రుచిగా మార్చేయచ్చు.. హోటల్ స్టైల్ దోశ పక్కా
Dosa: దోశ పిండి తొందగా పులిసిపోతోందా? పిండి పుల్లగా మారిపోతే.. దోశలు తినడానికి రుచిగా ఉండటం లేదా? ఆ పిండిలో కేవలం కొన్నింటిని కలపడం వల్ల పిండి పులుపు తగ్గడమే కాదు,మరింత రుచిగా మార్చవచ్చు.

Dosa Batter
ఉదయాన్నే వేడి వేడిగా, కరకరలాడే దోశలు తింటుంటే వచ్చే మజానే వేరు. కానీ, బయట ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల...దోశ పిండి రెండు రోజులకే పులిసిపోతోంది. పిండి బాగా పులిసిపోయి, ఘాటైన వాసన రాగానే ఆ పిండితో దోశలు వేసుకొని తినలేక.. ఆ పిండిని పారేస్తూ ఉంటాం. కానీ, నిమిషాల్లో పులిసిపోయిన పిండిని మళ్లీ ఫ్రెష్ గా మార్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం....
1.కాచిన పాలు..
మీ దగ్గర దోశ పిండి తక్కువ క్వాంటిటీలో ఉంటే.. అది పులిసిపోయినప్పుడు.. దాంట్లో బాగా కాచిన పాలు కలిపితే సరిపోతుంది. అంటే.. మీ దగ్గర ఒక పావు కేజీ దోశ పిండి ఉంటే.. దాంట్లో ఒక పావు కప్పు కాచి చల్లార్చిన పాలు కలపాలి. ఈ పాలు కలిపిన తర్వాత... ఆ పిండిలో ఒక చిటికెడు ఉప్పు కలుపుకుంటే... పిండి రుచిగా మారుతుంది. దీని తర్వాత, దోశలు వేసుకుంటే.. చాలా రుచిగా వస్తాయి.
2.అటుకుల పేస్టు..
చాలా మంది దోశల పిండి తయారు చేసుకొనేటప్పుడు కూడా... పిండిలో అటుకులు వేస్తూ ఉంటారు. అయితే.. పిండి పులిసిపోయినప్పుడు దానిని మళ్లీ రుచిగా మార్చుకోవడానికి మీరు అటుకులు వాడుకోవచ్చు. మీ దగ్గర ఎక్కువ దోశ పిండి పులిసిపోయి ఉంటే.. అందులో అటుకులు వాడుకోవాలి. సుమారు 200 గ్రాముల అటుకులను నీటిలో శుభ్రంగా కడిగి కొద్దిసేపు నానపెట్టాలి. నానిన అటుకులను కొద్దిగా ఉప్పు వేసి.. మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్టును పుల్లటి దోశ పిండిలో వేసి బాగా కలిపి, 5 నిమిషాలు పక్కన పెట్టేయాలని. ఆ తర్వాత దోశలు వేసుకుంటే చాలా రుచిగా వస్తాయి.
బొంబాయి రవ్వ + పంచదార కాంబో
దోశలకి మంచి ఎర్రటి రంగు, క్రిస్పీ టెక్స్చర్ రావాలంటే బొంబాయి రవ్వ, పంచదారల కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. అర కిలో పిండికి సుమారు 200 గ్రాముల బొంబాయి రవ్వను కొంతసేపు నీటిలో నానబెట్టండి. నానిన రవ్వతో పాటు చిటికెడు ఉప్పు, అర టీస్పూన్ పంచదార వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని పులిసిన పిండిలో కలిపి దోశలు వేస్తే.. పులుపు తగ్గడమే కాకుండా, హోటల్లో లభించే కరకరలాడే గోల్డెన్ బ్రౌన్ కలర్ దోశలు సిద్ధమవుతాయి. చాలా రుచిగా కూడా ఉంటాయి.

