Camphor: నార్మల్ కర్పూరానికీ, పచ్చ కర్పూరానికీ తేడా ఏంటి? దేనితో తయారు చేస్తారో తెలుసా?
Camphor: దేవుడి పూజలో మనం కర్పూరం వాడతాం. అంతేకాదు.. కొన్ని రకాల వంటల్లో, ముఖ్యంగా ప్రసాదాల్లో పచ్చ కర్పూరం వాడుతూ ఉంటారు. అసలు.. ఈ రెండింటికీ తేడా ఏంటి? దేనిని దేనితో తయారు చేస్తారు..?

నార్మల్ కర్పూరం, పచ్చ కర్పూరానికీ తేడా ఏంటి?
భారతీయ సంస్కృతిలో కర్పూరానికి ప్రత్యేక స్థానం ఉంది. పూజలో దేవుడికి హారతి ఇవ్వాలంటే కూడా కర్పూరం ఉండాల్సిందే. చాలా మంది ఇంట్లో మంచి సువాసన నింపడానికి కూడా కర్పూరం వాడుతూ ఉంటారు. అయితే, మార్కెట్లో మనకు రెండు రకాల కర్పూరాలు లభిస్తాయి. ఒకటి మనం రోజూ చూసే సాధారణ కర్పూరం, మరొకటి పచ్చ కర్పూరం. ఈ రెండింటినీ చాలా మంది ఒకేలా భావిస్తూ ఉంటారు. కానీ, ఈ రెండూ చూడటానికి మాత్రమే కాదు, అవి తయారయ్యే విధానంలోనూ చాలా తేడాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం...
నార్మల్ కర్పూరం..
పూజ కోసం దాదాపు అందరూ ఈ సాధారణ కర్పూరం వాడతారు. ఇది మార్కెట్లో బిళ్లలు లేదా చక్రాల రూపంలో దొరుకుతుంది. ఇది మనం చాలా పవిత్రం అనుకుంటాం. కానీ, దీనిని రసాయనాలతో తయారు చేస్తారు. టర్పెంటైన్ నూనెతో ఈ కర్పూరం బిళ్లలను తయారు చేస్తారు. చూడటానికి తెల్లగా ఉంటాయి. వాటి నుంచి ఘాటైన వాసన ఉంటుంది. దీనిని కేవలం పూజల్లో హారతి ఇవ్వడానికి, ఇంట్లో దూపం వేయడానికి, క్రిమి సంహారిణిగా మాత్రమే ఉపయోగించాలి. ఈ కర్పూరాన్ని అస్సలు తినకూడదు. ఇది కడుపులోకి వెళ్తే ఆరోగ్య సమస్యలు వస్తాయి.
2.పచ్చ కర్పూరం..
ఇది చాలా సహజమైనది. ‘సిన్న మోమమ్ క్యాంపోరా’ అనే చెట్టు కాండం, కలప రసం నుంచి ఈ పచ్చ కర్పూరాన్ని తయారు చేస్తారు. ఇది పొడి రూపంలో లేదా చిన్న చిన్న స్ఫటికాల (Crystals) ఆకారంలో, సహజమైన సువాసనతో ఉంటుంది. దీని పేరులో 'పచ్చ' అని ఉన్నప్పటికీ, ఇది లేత తెలుపు లేదా కొద్దిగా స్ఫటిక రంగులోనే కనిపిస్తుంది. దీనిని తినవచ్చు. ముఖ్యంగా ప్రసాదాలు, స్వీట్లలో దీనిని వాడతారు. ప్రసాదాలకు మంచి సువాసన ఇస్తుంది. ఆయుర్వేద మూలికా ఔషధాలలో కూడా పచ్చ కర్పూరాన్ని ఉపయోగిస్తారు.
పచ్చ కర్పూరంతో ఆరోగ్య ప్రయోజనాలు...
జీర్ణశక్తిని పెంచడంలో, గ్యాస్, కడుపు ఉబ్బరం తగ్గించడంలో సహాయపడుతుంది. స్వల్ప పరిమాణంలో తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది, పంటి నొప్పుల ఉపశమనానికి పనిచేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించి, మంచి నిద్ర పట్టేలా చేస్తుంది.
సాధారణ కర్పూరం ప్రయోజనాలు:
దీనిని వెలిగించడం వల్ల గాలిలోని బ్యాక్టీరియా, క్రిములు నశిస్తాయి. కొబ్బరినూనెలో కరిగించి రాస్తే చర్మంపై దద్దుర్లు, దురదలు తగ్గుతాయి.

