Monalisa Bhonsle: చదువుకుందామనుకున్నా సినిమాల్లోకి తీసుకొచ్చారు.. కుంభమేళా మోనాలిసా
Monalisa Bhonsle: కుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముతూ ఒకే ఒక్క ఫోటోతో వైరల్ అయిన అమ్మాయి మోనాలిసా భోంస్లే. ఇప్పుడు తెలుగు సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. హైదరాబాద్ వచ్చినప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చింది.

ఒక్క ఫోటోతో వైరల్
మోనాలిసా భోంస్లే.. ప్రయాగ్ రాజ్‌లో కుంభమేళాలో కనిపించిన అందమైన అమ్మాయి. ఒక ఫోటోగ్రాఫర్ అనుకోకుండా ఆమె ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే ఒక్కరోజులోనే దేశమంతా వైరల్ అయిపోయింది. ఉదయం లేచేసరికి ఆమె ఇంటి ముందు కెమెరాలతో మీడియా వారంతా ప్రత్యక్షమైపోయారు. అంతగా మోనాలిసా అందం దేశం మదిదోచింది. ఇక అప్పటినుంచి సినిమాల్లో అవకాశాలు ఇస్తామంటూ చాలామంది సంప్రదించారు. గోధుమ రంగులో మెరిసే ఆమె కళ్ళు, అందమైన నవ్వే ఎంతోమంది మోనాలిసాకు అభిమానులైపోయేలా చేసింది. మోనాలిసా ఇప్పుడు సినిమా హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పటికే ఎన్నో షాపుల ఓపెనింగ్ కూడా చేసేసింది.
మొదటి సినిమా ఆగిపోయింది
కుంభమేళాలో ఆమె కోసం కెమెరాలు పట్టుకుని తిరిగిన యూబ్యూబర్లు వందల్లో ఉన్నారు. దీంతో ఆమె అప్పటికప్పుడే కుంభమేళా నుంచి స్వగ్రామానికి వెళ్లిపోయిందట. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ డైరెక్టర్ సరోజ్ మిశ్రా ఆమె ఇల్లు వెతుక్కుంటూ వెళ్లి మరి సినిమా చేస్తానని చెప్పారు. ది డైరీ ఆఫ్ మణిపూర్ అని దానికి పేరు కూడా పెట్టారు. కానీ ఈ లోపే అతడు అరెస్ట్ కావడంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. కానీ ఈ లోపే మోనాలిసాకు క్రేజ్ వచ్చేసింది. దీంతో ఒక తెలుగు సినిమాలో ఆమెకు నటించే అవకాశం వచ్చింది. లైఫ్ అనే తెలుగు సినిమాలో సాయి చరణ్ పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ షూటింగ్ నిమిత్తం మోనాలిసా హైదరాబాద్ కు ప్రస్తుతం హైదరాబాదులోనే ఉంటుంది.
అల్లు అర్జున్ అంటే ఇష్టం
తన ఇష్టాయిష్టాల గురించి చెబుతూ తెలుగులో అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్ అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. అలాగే సల్మాన్ ఖాన్, జాకీ ఫ్రాఫ్ తో కలిసి పని చేయాలని ఉందని తెలిపింది. మొదట్లో తాను చదువుకోవాలని అనుకునేదాన్ని, సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ భావించలేదని చెప్పింది. తను ఒకసారి కాదు మూడుసార్లు వైరల్ అయినట్టు చెప్పింది. అయితే మూడోసారి వైరల్ అయినప్పుడు దేశమంతా గుర్తింపు వచ్చిందని.. అలా సినిమాల్లోకి రావాల్సి వచ్చిందని వివరించింది. మోనాలిసా ప్రయాగ్ రాజ్‌లో పూసలు అమ్మడానికి రావడం వెనుక ఒక కారణం ఉందని వివరించింది. దానికి ముందే తనను పాము కరిచిందని, తనను కాపాడేందుకు తన తల్లి రెండు మూడు లక్షల అప్పు చేసిందని ఆ అప్పు తీర్చడం కోసమే తాము ప్రయాగ్ రాజ్ కుంభమేళాకి వచ్చి పూసలు, రుద్రాక్షలు అమ్మే షాపు పెట్టామని చెప్పింది.
సినిమాలు ఇష్టం లేదు కానీ
ఇలా రుద్రాక్షలు, పూసలు అమ్ముతున్నప్పుడే రాజస్థాన్ కు చెందిన ఒక వ్యక్తి వచ్చి ఫోటో తీశాడని ఆ ఫోటో వైరల్ అవ్వడంతో తనకు దేశమంతా గుర్తింపు వచ్చినట్టు తెలిపింది. అంతకుముందు కూడా తాను రెండుసార్లు వైరల్ అయ్యానని, అప్పుడు సినిమా అవకాశాలు వచ్చినప్పుడు తాను చేయనని చెప్పినట్టు తెలిపింది. కానీ తన తల్లిదండ్రులు మాత్రం సినిమాలు చేయమని బతిమిలాడారని వివరించింది. కానీ తను బాగా చదువుకోవాలని కోరిక ఉండడంతో సినిమాలను వ్యతిరేకించానని చెప్పింది. కానీ మూడోసారి వచ్చిన విపరీతమైన గుర్తింపుతో ఇక సినిమాల్లోకి రావాల్సి వచ్చిందని, ఇప్పుడు ఈ ప్రొఫెషన్ ను ఇష్టంగానే చేస్తున్నానని వివరించింది. ఈ సందర్భంగా తన ఫోటో తీసిన రాజస్థాన్ యువకుడికి కృతజ్ఞతలు చెప్పింది మోనాలిసా.

