Taj Mahal: ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ కట్టిన కూలీల చేతులు ఎందుకు నరికేశారు?
Taj Mahal: ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడాలలో తాజ్ మహల్ ఒకటి. ప్రేమకు చిహ్నంగా నిలిచిన ఈ కట్టడం వెనుక ఎన్నో కథలు, గాధలు ఉన్నాయి. అలాంటి కథల్లో తాజ్ మహల్ కట్టిన కూలీల చేతులను నరికించారనేది కూడా ఒకటి. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం.

తాజ్ మహల్ వెనుక కథలు
ప్రేమ అనే పదం గుర్తొస్తే వెంటనే కళ్ళల్లో మెదిలేది తాజ్ మహల్. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థంగా ఈ అందమైన భవంతిని కట్టించాడు. ప్రేమకు చిహ్నంగా నిలిచిన తాజ్ మహల్ వెనక ఎన్నో కథలు ఉన్నాయని ఇప్పటికీ నమ్ముతారు. వేలాది మంది కూలీలు, శిల్పులు, కళాకారులు కష్టపడి పని చేస్తే రూపు తెచ్చుకున్నదే తాజ్ మహల్. 1632 లో ప్రారంభమైన ఈ తాజ్ మహల్ కట్టడం పూర్తయ్యేసరికి 20 ఏళ్లు పట్టిందని చెబుతారు. కేవలం భారతదేశం నుంచి వచ్చిన వారే కాదు ఇతర దేశాల నుంచి కూడా శిల్పులు వచ్చి తాజ్ మహల్ నిర్మాణంలో భాగమయ్యారని అంటారు.
కూలీల చేతులు నరికేశారా?
ఇలాంటి అద్భుతమైన కట్టడం వెనుక ఒక చీకటి నిజం దాగి ఉందని ఇప్పటికీ వాదనలు వినిపిస్తుంటాయి. అదేంటంటే తాజ్ మహల్ నిర్మాణం పూర్తయిన తర్వాత దాన్ని కట్టిన కూలీల చేతులు నరికించారని చెబుతారు. ఇంత అద్భుతమైన, అందమైన కట్టడం మళ్ళీ ఎక్కడ నిర్మాణం జరగకూడదనే ఉద్దేశంతోనే షాజహాన్ కూలీల చేతులు నరికించాడని ఒక కథ పూర్వం నుంచి ప్రచారంలో ఉంది. ఇక కొన్ని పుస్తకాలు, సినిమాల వల్ల ఈ నమ్మకం మరింత బలపడుతూ వచ్చింది.
అంతమందికి ఒకేసారి శిక్ష
కానీ చారిత్రకారులు చెప్పిన ప్రకారం ఈ కథకు ఎలాంటి ఆధారాలు లేవు. మొఘల్ కాలానికి చెందిన పత్రాలు, పుస్తకాలు, విదేశీ ప్రయాణికుల అనుభవాలు పరిశీలించినప్పుడు అందులో ఎక్కడా కూలీల చేతులు నరికించినట్టు నమోదు కాలేదు. అయినా అంత పెద్ద సంఖ్యలో కూలీలకు శిక్ష విధించడం కూడా చాలా కష్టం. ఒకవేళ విధించి ఉంటే అది కచ్చితంగా చరిత్రలో నిలిచిపోయి ఉండేది. యూరోపియన్ నుంచి వచ్చిన ప్రయాణికులు కూడా అప్పట్లో మొఘల్ పాలన గురించి ఎంతో రాశారు. కానీ ఈ కూలీల కథ గురించి మాత్రం ఎవరూ రాయలేదు. కాబట్టి దీన్ని అపోహగానే ఎంతోమంది చెప్పుకుంటారు.
మరీ వీటిని ఎవరు కట్టారు?
ముఖ్యంగా మొఘల్ పాలకులకు కళలు, కళాకారులు అంటే ఎంతో ఇష్టం. షాజహాన్ కాలంలోనే తాజ్ మహల్ తో పాటు ఎర్రకోట, జామా మసీదు వంటి అద్భుత కట్టడాలు కూడా నిర్మాణం సాగాయి. అందులో కూడా నిపుణులు, శిల్పులు ఎంతో కాలం పనిచేశారు. ఒకవేళ నిజంగానే తాజ్ మహల్ కట్టిన తర్వాత కూలీల చేతులు నరికేసి ఉంటే.. మరి ఎర్రకోట, జామా మసీదు వంటి గొప్ప నిర్మాణాలు కట్టేందుకు మళ్లీ కూలీలు ఎలా దొరికి ఉంటారు? అనే ప్రశ్న కూడా ఉంది. ఆధారాలు చెబుతున్న ప్రకారం శిల్పులకు మంచి జీతాలు, సౌకర్యాలు షాజహాన్ కల్పించినట్టు చారిత్రకారులు చెబుతున్నారు.
షాజహాన్ కూలీలతో ఒప్పందం
అయితే షాజహాన్ ఒక ఒప్పందం మాత్రం కూలీలతో చేసుకున్నట్టు కొన్ని వాదనలు ఉన్నాయి. తాజ్ మహల్ లాంటి కట్టడం మళ్ళీ ఎక్కడా కట్టొద్దని ఆ కూలీలతో ఒప్పందం చేసుకున్నాడని అని అంటారు. అయితే ఆ ఒప్పందాన్ని ఎవరైతే అతిక్రమించారో వారి చేతులు నరికించారనే కథలు చెప్పుకుంటారు. అయితే భారతీయ చరిత్రను ఒక్కోసారి క్రూరంగా చూపించేందుకు బ్రిటిష్ వారు ఇలాంటి కథలను పుట్టించారని కూడా చారిత్రకారులు చెబుతున్నారు. మొత్తంగా చూసుకుంటే తాజ్ మహల్ కట్టిన కూలీల చేతులు నరికించారు అనడానికి ఒక్క ఆధారం కూడా లేదు. అది ఒక అపోహగానే మిగిలిపోయింది. తాజమహల్ లాంటి గొప్ప కళాఖండాన్ని సృష్టించిన కూలీల చేతులు నరికే మనసు షాజహాన్ కు లేదని కూడా చెబుతున్నారు. ఎందుకంటే షాజహాన్ కు కళాకారులు అంటే విపరీతమైన గౌరవం కాబట్టి. ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లేని ఈ కథను కేవలం ఒక కల్పిత కథగానే భావించాలి.

