Tea and Coffee: పిల్లలకు టీ, కాఫీలు ఇచ్చే తల్లిదండ్రులకు ఇదిగో వార్నింగ్
Tea and Coffee: పిల్లలకు రోజూ టీ, కాఫీలు తాగే అలవాటు ఉందా? అయితే వెంటనే మార్చుకోండి. చిన్న వయసులో ఇవి తాగితే పిల్లల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

పిల్లలకు టీ, కాఫీలు
మనలో చాలామందికి పొద్దున్నే లేవగానే ఒక కప్పు టీ లేదా కాఫీ పడకపోతే రోజు గడవదు. కొందరికి బెడ్ కాఫీ, ఇంకొందరికి టిఫిన్ తో పాటు కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్లు చేస్తుంటే చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు. అందరూ తాగుతుంటే దాని టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలని పిల్లలకి కూడా ఉంటుంది. కొన్ని ఇళ్లలో అయితే తల్లిదండ్రులే స్వయంగా పిల్లలకు టీ, కాఫీలు ఇచ్చి అలవాటు చేస్తారు.ఇలా చిన్న వయసులోనే టీ, కాఫీలు తాగడం వాళ్ల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే, ఇందులో ఉండే 'టానిన్' (Tannin) అనే పదార్థం పిల్లల శరీరానికి కావాల్సిన క్యాల్షియం, ఐరన్ అందకుండా అడ్డుకుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పిల్లలు ఎందుకు తాగకూడదు?
రోగనిరోధక శక్తి తగ్గుతుంది: పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్లలో రోగనిరోధక శక్తి చాలా ముఖ్యం. పోషకాలు ఉండే ఆహారం తింటేనే ఈ శక్తి వస్తుంది. కానీ, టీ, కాఫీలు తాగినప్పుడు వాళ్ల ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు వచ్చి, లోపలి నుంచే శరీరం దెబ్బతింటుంది.
క్యాల్షియం, ఐరన్ లోపం: టీ, కాఫీల్లో ఉండే టానిన్.. శరీరంలో క్యాల్షియం, ఐరన్ చేరకుండా ఆపుతుంది. దీనివల్ల పిల్లల్లో రక్తహీనత రావచ్చు. ఎముకలు బలహీనపడి, చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, కాళ్లు చేతుల నొప్పులు మొదలవుతాయి.
మెదడు ఆరోగ్యంపై ప్రభావం
టీ, కాఫీల్లో 'కెఫిన్' (Caffeine) ఉంటుంది. ఇది మనల్ని చురుగ్గా ఉంచేందుకు సాయపడుతుంది. అందుకే రాత్రిళ్లు మేల్కొని పనిచేసేవాళ్లు దీన్ని ఎక్కువగా తాగుతారు. కానీ, ఈ కెఫిన్ పిల్లల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇది తాగినప్పుడు పిల్లల్లో నిద్రలేమి, కోపం, చిరాకు లాంటి మానసిక మార్పులు వస్తాయి. దీనివల్ల వాళ్ల శారీరక, మానసిక ఎదుగుదల ఆగిపోతుంది.
ఎసిడిటీ సమస్య: మోతాదుకు మించి టీ, కాఫీలు తాగితే పళ్లు పుచ్చిపోవడంతో పాటు కడుపుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఆకలి వేయదు. ఆకలి లేకపోతే పిల్లలు సరిగ్గా తినరు. దీంతో ఎసిడిటీ సమస్య వచ్చి, శరీరానికి కావాల్సిన పోషకాలు అందక వాళ్ల ఎదుగుదల దెబ్బతింటుంది.

