- Home
- Life
- Habib Ahmed: ఇందిరా గాంధీ, అబ్దుల్ కలాం హెయిర్ స్టైల్స్ ను తీర్చిదిద్దిన లెజెండరీ హెయిర్ స్టైలిస్ట్ ఈయనే
Habib Ahmed: ఇందిరా గాంధీ, అబ్దుల్ కలాం హెయిర్ స్టైల్స్ ను తీర్చిదిద్దిన లెజెండరీ హెయిర్ స్టైలిస్ట్ ఈయనే
ఇందిరాగాంధీ హెయిర్ స్టైల్ ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే అబ్దుల్ కలాం హెయిర్ స్టైల్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆ ఇద్దరికే కాదు.. ఎంతోమంది లెజెండరీ వ్యక్తులకు హెయిర్ స్టైల్ చేసిన వ్యక్తి హబీబ్ అహ్మద్ (Habib Ahmed). ఆయన 84 సంవత్సరాల వయసులో మరణించారు.

హబీబ్ అహ్మద్ మరణం
ముఖం ఎంత అందంగా ఉన్నా దానికి తగ్గట్టు హెయిర్ స్టైల్ ఉంటేనే అందం మరింతగా రెట్టింపు అవుతుంది. మన దేశంలో హెయిర్ స్టైలిస్ట్ కు ప్రత్యేకమైన గుర్తింపును, ఆ ఉద్యోగానికి విలువను పెంచిన వ్యక్తి హబీబ్ అహ్మద్. ఈయన వృత్తి రీత్యా క్షురకుడు. అందరిలాగా చిన్న సెలూన్ లో జుట్టు కత్తిరించుకుంటూ ఉండిపోలేదు. భారతదేశానికి పేరు తెచ్చిన హెయిర్ స్టైలిస్ట్ గా మారారు. అతని కొడుకే సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్. జావేద్ హబీబ్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక విచారకరమైన వార్తను సెప్టెంబర్ 25న పంచుకున్నారు. తన తండ్రి హబీబ్ అహ్మద్ మరణించినట్టు ఆయన తెలియజేశారు. భారత దేశంలోని ఎంతోమంది హబీబ్ అహ్మద్ కు నివాళులు అర్పించారు.
తండ్రి కూడా క్షురకుడే
హబీబ్ అహ్మద్ ముజఫర్ నగర్ లోని జలాలాబాద్ అనే చిన్న పట్టణంలో 1940 అక్టోబర్ 2న జన్మించారు. హబీబ్ తండ్రి కూడా క్షురకుడే. అతని తండ్రి నజీర్ అహ్మద్.. డాక్టర్ రాజేంద్రప్రసాద్ కు వ్యక్తిగత స్టైలిస్ట్ గా ఉండేవారు. అలాగే లార్డ్ మౌంట్ బాటెన్ వంటి బ్రిటిష్ ఇండియా వైస్రాయ్‌లకు కూడా క్షురకుడిగా ఉన్నారు. అందుకే హబీబ్ అహ్మద్ డిఎన్ఏలోనే హెయిర్ స్టైలిస్ట్ లక్షణాలు ఉన్నాయి. ఇతని మీద ‘హబీబ్: ది మాన్ హూ బిల్డ్ ఏ ఎంపైర్’ అనే పుస్తకాన్ని కూడా రచించారు. ఆ పుస్తకం ప్రకారం హబీబ్ అహ్మద్ లండన్లోని ప్రఖ్యాత మోరిస్ స్కూల్లో హెయిర్ స్టైల్ లో శిక్షణ కూడా తీసుకున్నారు. అతని శిక్షణ భారతదేశానికి ఎంతగానో ఉపయోగపడింది. హెయిర్ స్టైల్ విభాగంలో ఎంతో మంది నిపుణులను ఈయన అందించారు.
ఇందిరాగాంధీకి స్టైలిస్ట్
లండన్ నుంచి భారతదేశానికి వచ్చాక ఢిల్లీలో ఉన్న ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ తోనే అతను ఎక్కువ కాలం ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత 1983లో హబీబ్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభించాడు. అలాగే అకాడమీ కూడా మొదలుపెట్టారు. ఎంతోమంది హెయిర్ స్టైలిస్ట్ లకు శిక్షణ ఇచ్చేవారు. స్టీరియో టైప్ హెయిర్ స్టైల్స్ నుంచి బయటకు వచ్చి అందమైన జుట్టు ముడులను వేయడం ప్రారంభించారు. ఇందిరా గాంధీకి ప్రత్యేకతను తెచ్చింది. ఆమె హెయిర్ స్టైల్ ఏ సగం నలుపు, సగం తెలుపు రంగుతో ఉన్న ఆమె హెయిర్ స్టైల్ ఎంతో ప్రత్యేకమైన లుక్ ను అందించింది. దానికి కారణం హబీబ్ ఆమె జుట్టుకు రంగు వేయడమే కాదు.. ఆమె వ్యక్తిత్వాన్ని శక్తిని ప్రపంచానికి బలంగా చూపేలా చేశారు. అలాగే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రత్యేకమైన హెయిర్ స్టైల్ కూడా హబీబే కారణం. ఇతడికి ముగ్గురు కుమారులు ఉన్నారు. జావేద్, పర్వేజ్, అంజాద్. ఈ ముగ్గురు కూడా హెయిర్ స్టైలింగ్ వారసత్వాన్ని అందుకున్నారు. హబీబ్ కుటుంబంలో మూడు తరాల నుంచి హెయిర్ స్టైలిస్ట్ నిపుణులే ఉండడం గమనార్హం.
చరిత్రనే స్టైల్ చేసిన వ్యక్తి
హబీబ్ అహ్మద్ కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు. ఆయన మంచి విద్యావేత్త. అంతకుమించి మంచి గురువు. ఆత్మవిశ్వాసాన్ని కలిగిన ఒక స్టైలిస్ట్. ఆయన మరణించడం అనేది భారతదేశంలో హెయిర్ స్టైలింగ్ విభాగంలో ఒక శకానికి ముగింపు పలికినట్టే. సెలూన్లకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందంటే దానికి కారణం హబీబ్. హబీబ్ అహ్మద్ కేవలం జుట్టునే స్టైల్ చేయలేదు... ఒక చరిత్రనే స్టైల్ చేశాడు. జలాలాబాద్ లో పుట్టిన ఒక యువకుడు రాష్ట్రపతి భవన్ నుంచి వైస్రాయ్ ల వరకు ప్రధానమంత్రి నుంచి శాస్త్రవేత్తల వరకు ఎంతో మందికి వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్ గా ఉన్నారు. ఒక దువ్వెన కత్తెరతో చెరిగిపోని చరిత్రను రాసిన అద్భుతమైన వ్యక్తి హబీబ్ అహ్మద్.
మరణం
ఎనభై నాలుగేళ్ల వయసులో హబీబ్ అహ్మద్ సెప్టెంబర్ 25న మరణించారు. అందుకే అతని గురించి మనం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం. అతని కొడుకు అయినా జావేద్ హబీబ్ ఇప్పుడు భారతదేశంలోనే ప్రఖ్యాత హెయిర్ స్టైలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. తండ్రి వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.