Ancestral property: పిత్రార్జిత ఆస్తి అంటే ఏమిటి? దానిలో ఎవరెవరికి హక్కులు ఉంటాయి?
ఆస్తి తగాదాలు ఈ కాలంలో అధికంగానే ఉన్నాయి. ముఖ్యంగా పిత్రార్జిత ఆస్తులపై (ancestral property) వారసుల పోరాటం ఎన్నో కేసుల్లో జరుగుతూనే ఉంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టులలో ఎన్నో తీర్పులు ఇచ్చాయి. అసలు పిత్రార్జిత ఆస్తి అంటే ఏమిటో తెలుసుకుందాం.

పిత్రార్జిత ఆస్తికి ఎవరికి?
ఢిల్లీ హైకోర్టు ఓసారి ఆస్తి కేసులో తీర్పునిచ్చింది. తండ్రికి చెందిన ఆస్తి మొత్తం కేవలం కొడుకుకు మాత్రమే దక్కదని చెప్పింది. కూతురికి కూడా ఆస్తిలో హక్కు ఉంటుందని.. అలాగే ఆ తండ్రికి చెందిన తల్లి బతికి ఉన్నప్పుడు ఆ తల్లికి కూడా హక్కు లభిస్తుందని తెలిపింది. అతని భార్య బతికుంటే భార్యకు కూడా హక్కు వస్తుందని చెబుతోంది. చట్ట ప్రకారం చనిపోయిన వ్యక్తి ఆస్తిలో సగభాగాన్ని భార్యకు ఇవ్వాలని ఇక మిగతా సగభాగాన్ని పిల్లలు, అతని తల్లి పంచుకోవాలని వివరించింది. వారసత్వ చట్టం ప్రకారం కొడుకుకి ఎంత హక్కు ఉంటుందో మరణించిన తండ్రి ఆస్తిలో కూతురుకి కూడా అంతే హక్కు ఉంటుంది. ఇక అతని భార్య సజీవంగా ఉంటే ఆమెకు కూడా ఆస్తిపై సమాన హక్కు ఉంటుందని ఢిల్లీ న్యాయస్థానం చెప్పింది.
చట్ట సవరణ జరిగిన తరువాత
సాధారణంగా పూర్వం నుంచి మన సమాజంలో తండ్రికి వారసుడిగా కొడుకుని భావిస్తారు. ఇప్పటికీ హిందూ కుటుంబాల్లో కొడుకును మాత్రమే ఆస్తిలో భాగం చేస్తారు. అయితే 2005లో చట్ట సవరణ జరిగింది. తండ్రి ఆస్తిపై కొడుకు, కూతురు ఇద్దరికీ సమాన హక్కులు ఉంటాయని చెప్పారు. 2004 డిసెంబర్ 20కి ముందు పిత్రార్జిత ఆస్తి పంపకాలు జరిగిపోయి ఉంటే అందులో అమ్మాయిలకు ఎలాంటి హక్కు ఉండదు. కానీ ఆ తర్వాత జరిగి ఉంటే మాత్రం ఆ పంపకాలు రద్దుచేసి కూతురికి ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని ఢిల్లీ కోర్టు చెప్పింది.
పిత్రార్జిత ఆస్తి అంటే
ఒక వ్యక్తికి తన తండ్రి తాత ముత్తాతల నుంచి వారసత్వంగా ఆస్తి లభిస్తుంది. అలా లభించిన ఆస్తిని పిత్రార్జితం అంటారు. ఆ వ్యక్తికి మగ బిడ్డ పుడితే అతడు ఆ పిత్రార్జిత ఆస్తికి హక్కుదారుడు అవుతాడు. అయితే ఆ వ్యక్తి తాను కష్టపడి ఆస్తిని సంపాదిస్తే దాన్ని స్వార్జితం అంటారు. తన సంపాదనతో కొన్న ఆస్తిని స్వార్జితంగా భావిస్తారు.
రెండో భార్య పిల్లలకు వాటా
పిత్రార్జిత ఆస్తిలో పిల్లలకు, భార్యకు కూడా సమాన హక్కులు ఉంటాయి. స్వార్జిత ఆస్తి మాత్రం ఆ వ్యక్తి ఎవరికైనా రాసి ఇచ్చుకునే అవకాశం ఉంది. మొదటి భార్య ఉండగా రెండో వివాహం చేసుకున్న వ్యక్తులు కూడా ఎంతోమంది ఉంటారు. అలా రెండో భార్యకు పుట్టిన పిల్లలకు కూడా ఆస్తిలో వాటా వస్తుంది. కానీ పిత్రార్జిత ఆస్తిలో మాత్రం వాళ్లకు ఎలాంటి హక్కులు ఉండవు. స్వార్జిత ఆస్తిలో మాత్రం వారికి భాగం ఇవ్వాల్సి వస్తుంది.