Green Peas: పచ్చి బఠానీలు ఇలా నిల్వ చేస్తే ఆరునెలలు తాజాగా ఉంటాయి
Green Peas: పచ్చి బఠానీలు చలికాలంలోనే అధికంగా దొరుకుతాయి. కాబట్టి వీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవాలి. అలా చేస్తే వేసవి కాలంలో వీటిని వాడుకోవచ్చు. వీటిని కొన్ని పద్ధతులు పాటించడం ద్వారా వాటిని ఆరు నెలల పాటూ తాజాగా నిల్వ ఉంచుకోవచ్చు.

పచ్చి బఠానీలు నిల్వ ఎలా?
పచ్చిబఠానీలు చలికాలంలోనే అధికంగా దొరుకుతాయి. ఇవి మార్కెట్లో ఈ సీజన్లోనే ఎక్కువ లభిస్తాయి. వీటిని సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే ఒకటి రెండు రోజుల్లోనే రుచి కోల్పోతాయి. కొన్ని చిట్కాలతో బఠాణీలను 6 నెలల నుండి ఏడాది వరకు తాజాగా నిల్వ ఉంచుకోవచ్చు. వాటిని సరైన పద్ధతిలో నిల్వ చేసే చిట్కాలను తెలుసుకోవాలి.
సరిగా శుభ్రం చేసి
పచ్చి బఠానీలు అధికంగా కొని పెట్టుకోండి. వాటిని నిల్వ చేయడానికి సరిగా శుభ్రం చేయాలి. తడి లేకుండా తుడిచి గింజలు తీయాలి. కొంతమంది గింజలను కడుగుతారు. అలా చేస్తే త్వరగా బూజు పట్టేస్తుంది. అందుకే గింజలను కడగకుండా, పొడి గుడ్డతో తుడిచేయాలి. వాటిని ఒక గంట సేపు గాలికి ఆరబెట్టాలి. దీని వల్ల గింజల్లో ఉన్న తేమ పోతుంది. ఇవి పూర్తిగా పొడిగా మారిన తరువాత ఒక కవర్లో వేసి ముడి వేసేయాలి. లోపల ఉన్న గాలిని తీసేందుకు చిన్న సూదితో రంధ్రం చేయాలి. లోపల మొత్తం గాలిని తీసేసి డీ ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవాలి. ఇలా ఉంచితే ఆరు నెలల పాటూ తాజాగా ఉంటాయి.
బ్లాంచింగ్ పద్ధతి
పచ్చి బఠానీలు ఎక్కువ రోజుల పాటూ తాజాగా ఉండాలంటే బ్లాంచింగ్ పద్ధతి ఉత్తమమైనది. ఒక గిన్నెలో నీటిని వేడి చేయాలి. స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు అందులో పచ్చి బఠానీలను వేసి రెండు మూడు నిమిషాలు ఉంచాలి. తరువాత వెంటనే తీసి ఐస్ క్యూబ్స్ వేసి నీటిలో వేయాలి. ఇలా చేయడం వల్ల రంగు, రుచి, పోషకాలు ఉంటాయి. తరువాత వాటిని తీసి గాలికి ఆరబెట్టాలి. తడి లేకుండా చూసుకోవాలి.
ఫ్రీజర్‌లో నిల్వ
ఇప్పుడు ఆ బఠానీలను ఫ్రీజర్ సేఫ్ పౌచ్ లేదా డబ్బాలో బఠానీలను వేయాలి. గాలి మాత్రం పూర్తిగా తీసేయాలి. గాలి ఉంటే ఐస్ ఏర్పడి రుచి పాడవుతుంది. ఈ పద్ధతితో బఠానీలు 12 నెలలు తాజాగా ఉంటాయి.
ఉప్పులో నిల్వ చేయడం
మీ దగ్గర ఫ్రీజర్ లేకపోయినా కూడా బఠానీలను నిల్వ చేసుకోవచ్చు. పొడి ఉప్పులో బఠానీలను నిల్వ చేయవచ్చు. శుభ్రమైన గాజు సీసాలో అడుగున ఉప్పు వేసి దానిపై గింజలు వేయాలి. బఠానీలపై పొరలుగా ఉప్పును వేయాలి. ఉప్పు తేమను పీల్చుకుని బఠానీలు పాడవకుండా ఉంటాయి.
బఠానీలు ఎక్కువగాఉంటే వాటిని పేస్ట్ రూపంలో కూడా ఫ్రీజ్ చేయవచ్చు. బ్లాంచ్ చేసిన బఠాణీలను మిక్సీలో రుబ్బి, కొద్దిగా ఉప్పు కలిపి, గాలి చొరబడని పౌచ్‌లలో నింపి ఫ్రీజ్ చేయాలి. ఈ పేస్ట్‌ను పరాఠా, కట్లెట్, ఉప్మా, పులావ్ లేదా గ్రేవీలలో వాడుకోవచ్చు. రుచి అద్భుతంగా ఉంటుంది.

