Corn Husk మొక్కజొన్న తొక్కలతో ఇలా అందమైన కళాఖండాలు చేసేయండి!
corn husk: మొక్కజొన్నలను కాల్చి తినడం లేదా స్వీట్ కార్న్ అంటే మనలో చాలామందికి ఇష్టం. వాటిని తినేముందు మొక్కజొన్న పై పొరల (తొక్కలు)ను ఒలిచి చెత్తలో పడేస్తుంటాం. కానీ వీటితో అందమైన వస్తువులు తయారు చేసుకోవచ్చనే విషయం మీకు తెలుసా? ఇంటి అలంకరణ, పిల్లల స్కూల్ ప్రాజెక్టులకు కూడా వీటిని ముడిసరుకుగా మార్చుకోవచ్చు. అయితే పదండి.. అందమైన DIY క్రాఫ్ట్ హోమ్ డెకార్ చేయడంలో నిపుణులం అయిపోదాం.

మొక్కజొన్న తొక్కలతో అలంకరణ
మొక్కజొన్నలను కాల్చుకుని లేదా వాటితో రకరకాల వంటలు చేసుకుంటాం. అప్పుడు తొక్కలను తీసేసి చెత్తలో పడేస్తాం. కానీ ఈ తొక్కలతో అద్భుతమైన క్రాఫ్ట్ చేయవచ్చు. పిల్లల స్కూల్ ప్రాజెక్టుల నుంచి ఇంటి అలంకరణ వరకు ఎన్నెన్నో స్రుష్టించవచ్చు.
మొక్కజొన్న తొక్కల పెయింటింగ్
తొక్కలపై అందమైన పెయింటింగ్స్ వేయండి. ముందు ఎండిన తొక్కలను ప్రెస్ చేసి వెడల్పుగా సరిచేయండి. వాటిపై వాటర్ కలర్స్ లేదా అక్రిలిక్ కలర్స్ తో ట్రెడిషనల్ లేదా ఫ్లోరల్ డిజైన్స్ వేయండి. వాటికి ఫ్రేమ్ కట్టించి గోడకు వేలాడదీస్తే ఇల్లు అందంగా మారడం ఖాయం. పెయింటింగ్ ముందు తొక్కలను తడి చేసి ప్రెస్ చేయాలి.
గోడ అలంకరణ
గోడ అలంకరణ: తొక్కలను రంగులు వేసి లేదా అలాగే మడిచి మండల, సూర్యకాంతం పువ్వు లేదా రౌండ్ లేయర్డ్ వాల్ ఆర్ట్ తయారు చేయండి. చెక్క బోర్డు లేదా కార్డ్ బోర్డ్ కు అతికించి గోడకు వేలాడదీయండి. మధ్యలో అద్దం లేదా పూసలు అతికించి మరింత అందంగా తీర్చిదిద్దండి.
క్యాండిల్ హోల్డర్
క్యాండిల్ హోల్డర్: పాత గాజు జార్లకు బయట తొక్కలను అతికించి, రిబ్బన్ లేదా పూసలతో అలంకరించి క్యాండిల్ హోల్డర్ తయారు చేయండి. లివింగ్ రూమ్ లేదా డైనింగ్ టేబుల్ అలంకరణకు అనువైనది. సువాసన క్యాండిల్ వాడితే మరింత బాగుంటుంది.
పువ్వుల తయారీ
పువ్వులు: తొక్కలను చిన్న ముక్కలుగా కత్తిరించి, మడిచి గులాబీ, డైసీ వంటి పువ్వులు తయారు చేయండి. వీటిని పూలకుండీలో పెట్టండి లేదా రాఖీ, తోరణం, గిఫ్ట్ ప్యాకింగ్ లో వాడండి. లేత రంగు కోసం తొక్కలను టీ లేదా పసుపు నీటిలో ముంచండి.
పూలకుండీ తయారీ
పూలకుండీ: పాత బాటిల్ లేదా డబ్బాకు బయట తొక్కలను అతికించి, పైన రిబ్బన్ లేదా లేస్ అతికించండి. ఈ కుండీలో కృత్రిమ పువ్వులు లేదా మీరు తయారు చేసిన మొక్కజొన్న తొక్కల పువ్వులు పెట్టండి. కుండీని పెయింట్ చేసి లేదా మోడ్ పాడ్జ్ తో సీల్ చేసి వాటర్ ప్రూఫ్ చేయండి.
బొమ్మల తయారీ
బొమ్మలు: తొక్కలను మడిచి, దారంతో కట్టి బొమ్మలు తయారు చేయండి. పిల్లల ఆటలు, స్కూల్ ప్రాజెక్టులు లేదా అలంకరణకు వాడండి. జూట్ లేదా దారంతో జుట్టు తయారు చేసి, ఇంట్లో వాడకుండా ఉన్న గుడ్డ ముక్కలను దుస్తులుగా మలచండి.