చర్మం సహజంగా మెరవాలంటే ప్రతిరోజూ ఈ జ్యూసులు తాగండి
చర్మాన్ని సహజంగా కాంతివంతంగా మెరవాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. రకరకాల క్రీమ్ లు రాయడం వల్ల చర్మానికి హాని కలగవచ్చు. కాబట్టి కొన్ని జ్యూసులు రోజూ తాగడం ద్వారా చర్మాన్ని మెరిసేలా చేయవచ్చు.

మెరిసే చర్మం కోసం
మహిళలు ఏ వయసు వారైనా అందంగా ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం రకరకాల క్రీములు వాడుతూ ఉంటారు. ముఖం కాంతివంతంగా, ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటారు. నిజానికి శరీరం ఆరోగ్యంగా ఉంటేనే ముఖంలో కాంతి సహజంగా వస్తుంది. క్రీములు రాయడం వల్ల తాత్కాలిక అందమే మీకు దక్కుతుంది. మీ ముఖ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహాయపడే కొన్ని జ్యూసులు కొన్ని ఉన్నాయి. వాటిలో ఏదో ఒకదాన్ని ప్రతిరోజూ జ్యూసు తాగడం వల్ల ముఖానికి కాంతి వస్తుంది. ముఖాన్ని సహజంగా కాంతివంతంగా మార్చడానికి సహాయపడే కొన్ని పానీయాల గురించి తెలుసుకుందాం.
నిమ్మరసం
నిమ్మరసంలో శరీరంలో సహజంగానే రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి అధికంగా ఉంటుంది. నిమ్మరసం శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. చర్మం అధికంగా సెబమ్ అంటే అదనపు నూనెను ఉత్పత్తి చేయకుండా చర్మాన్ని కాంతివంతంగా ఉంచడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి నిమ్మ పానీయం ఉత్తమంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ నిమ్మరసం తాగడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. ముఖ చర్మంపై మొటిమలు, నల్ల మచ్చలు, నల్లటి వలయాలు రాకుండా ఇది అడ్డుకుంటుంది.
ఆపిల్ జ్యూస్
ప్రతిరోజూ ఒక ఆపిల్ తింటే చాలు వైద్యుల అవసరమే రాదని చెబుతారు. ఫైబర్ అధికంగా ఉండే ఆపిల్ జ్యూస్ చర్మానికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ ఆపిల్ రసం తాగితే మలబద్ధకం సమస్య రాదు. ఇప్పటికే మలబద్ధకం సమస్య ఉన్నవారికి మొటిమలు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు ఆపిల్ జ్యూస్ తాగేందుకు ప్రయత్నిస్తే చర్మం కొన్ని రోజులకే మెరవడం మొదలవుతుంది. దీనివల్ల మొటిమల సమస్య కూడా తగ్గుతుంది. ఆపిల్ పండులోని ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పొడి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ముఖ చర్మంపై వచ్చే ముడతలను తొలగిస్తాయి.
క్యారెట్ జ్యూస్
క్యారెట్లలో మన శరీరానికి అవసరం అయ్యే విటమిన్లు అధికంగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఎ అధికంగా ఉండే క్యారెట్ జ్యూస్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగితే రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. దీనివల్ల చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇలా తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది. క్యారెట్ జ్యూస్ తో పాటూ బీట్రూట్ జ్యూస్ కూడా తాగితే మంచిది. ఇది కూడా చర్మానికి అవసరమైన పోషకాలను ఎన్నో అందిస్తుంది.
దానిమ్మ రసం
దానిమ్మ గింజలు ప్రతిరోజూ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రతి రోజూ దానిమ్మ గింజలు తినడం లేదా దానిమ్మ రసం తాగడం వంటివి చేయాలి. దీని వల్ల శరీరం నుండి విషాలు, వ్యర్థాలు బయటకు పోతాయి. ప్రతిరోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తాగడం వల్ల శరీరం పూర్తిగా శుభ్రపడుతుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మారేలా చేస్తుంది. కాబట్టి ప్రతిరోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తాగండి. లేదా ఒక దానిమ్మ పండు తినండి.
దోసకాయ జ్యూస్
దోసకాయలు పచ్చివే తింటూ ఉంటారు. కీరాదోసకాయను వేసవిలో అధికంగా తింటారు. ఇది చర్మాన్ని పొడిబారకుండా తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మానికి తేమను అందించే లక్షణాలు కీరాదోసకాయలో ఉన్నాయి. ప్రతిరోజూ ఒక గ్లాసు దోసకాయ రసం తాగితే చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. దీన్ని ప్రతిరోజూ తాగడం వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది.