చేపలు తినేప్పుడు ఈ తప్పులు చేస్తే చర్మ సమస్యలు రావడం ఖాయం..
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైద్యులు సైతం చేపలను కచ్చితంగా తీసుకోవాలని సూచిస్తుంటారు. అయితే ఆరోగ్యానికి మంచి చేసే చేపలు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులను కూడా కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు..
చేపల్లో ఉండే ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుండె సంబంధిత సమస్యలు మొదలు ఎన్నో వ్యాధులకు చేపలు బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. అయితే చేపలు తీసుకున్న వెంటనే పాల ఉత్పత్తుల్ను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడడం ఖాయమని చెబుతున్నారు.
ముఖ్యంగా పాలు, చేపల కాంబినేషన్ తినడం ఆరోగ్యానికి చాలా హానికరమని చెబుతున్నారు. చేపలు తిన్న వెంటనే పాలు తాగితే చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అందుకే చేపలు తినగానే పాలు తీసుకోకూడని సూచిస్తున్నారు.
ఇక మనలో కొందరు చేపల కూరలో పెరుగు కలుపుకొని తింటుంటారు. ఇది కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా తీసుకుంటే కడుపుబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని అంటున్నారు. చర్మ సమస్యలు కూడా తప్పవని అంటున్నారు. ఆయుర్వేదం ప్రకారం కూడా చేపలు వేడి చేస్తే పాలు, పెరుగు చలవా చేస్తాయి. ఇలాంటి రెండు విభిన్న లక్షణాలున్న ఆహార పదార్థాలను ఒకేసారి తీసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి.
వేడి, చల్లని ఆహారాలు రెండు విరుద్ద ప్రభావాలను చూపిస్తుంటాయి. అందుకే చేపలను, పాలు లేదా పెరుగును కలిపి తీసుకోకూడదు. దీనివల్ల జీర్ణ సమస్యలతో పాటు చర్మ సంబంధిత సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు.
చేపలు, పాలు కలిపి తీసుకుంటే శరీరంలో విషం ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల చర్మంపై తెల్లటి మచ్చలు, దురద, అర్టికేరియా వంటి చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక చేపలు, పాలు రెండు హెవీ ఫుడ్. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే జీర్ణ వ్యవస్థపై ఒక్కసారిగా ఒత్తిడి పెరుగుతుంది. ఇది అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఈ కారణంగా కడుపు నొప్పి కూడా దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే చేపల కూరలో పెరుగు కలుపుకొని తిన్నా, లేదా చేపలు తిన్న తర్వాత పెరుగుతో అన్నం తిన్నా జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అలాగే చర్మంపై బొబ్బలు, దద్దుర్లు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.