Cloves for Cough: లవంగాలను తింటే దగ్గు తగ్గిపోతుందా? ఇందులో నిజమెంత..?
Cloves for Cough: జలుబు, దగ్గు వచ్చినప్పుడు చాలామందికి వంటింట్లో ఉండే లవంగాలు గుర్తొస్తాయి. లవంగాలను బుగ్గన పెట్టుకోవడం, కషాయం తాగడం ద్వారా దగ్గుకు చెక్ పెట్టవచ్చని చాలామంది నమ్ముతారు. మరి లవంగాలు తింటే నిజంగానే దగ్గు తగ్గుతుందో లేదో తెలుసుకుందాం.

దగ్గు తగ్గడానికి లవంగాలు పనిచేస్తాయా?
వాతావరణ మార్పుల వల్ల చాలామంది జలుబు, గొంతు గరగర, దగ్గు వంటి సమస్యల బారిన పడుతుంటారు. ముఖ్యంగా రాత్రిపూట దగ్గు కంటిన్యూగా వస్తే నిద్ర చెడిపోతుంది. అలసట పెరిగిపోతుంది. అయితే ఈ దగ్గుకు చెక్ పెట్టేందుకు చాలామంది వంటింటి చిట్కాలను ఫాలో అవుతుంటారు. అందులో ఒకటే లవంగాలు నమలడం, లేదా లవంగాల కషాయం తాగడం . అయితే దగ్గు తగ్గడానికి నిజంగానే లవంగాలు పనిచేస్తాయో లేదో ఇక్కడ తెలుసుకుందాం.
లవంగాల్లో ఉండే యూజినాల్ ఏం చేస్తుందంటే?
లవంగాలకు ప్రత్యేకమైన వాసన రావడానికి కారణం అందులో ఉండే సుగంధ తైలాలే. వాటిలో ముఖ్యమైంది యూజినాల్. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా, శరీరంలో ఏర్పడే ఇన్ఫ్లమేషన్ (వాపు) ను తగ్గించడానికి యూజినాల్ సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
లవంగాలు తింటే దగ్గు తగ్గుతుందా?
గొంతు లేదా శ్వాసనాళాల్లో మంట, ఇన్ఫెక్షన్ వంటి కారణాల వల్ల ఏర్పడే సహజమైన రక్షణ చర్యే దగ్గు. లవంగాల్లోని యూజినాల్కు ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల, దగ్గుకు సంబంధించిన ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలపై ఇది ప్రభావం చూపుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు.. లవంగాలు సహజసిద్ధమైన ఎక్స్పెక్టోరెంట్ గా పనిచేసి, గొంతులో గడ్డకట్టిన కఫాన్ని పల్చగా చేసి బయటకు రావడానికి సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
లవంగాలను ఎలా వాడాలి?
లవంగాన్ని నేరుగా బుగ్గకింద పెట్టుకోవడం లేదా నమలడం ద్వారా కొంత ఉపశమనం కలగవచ్చు. అలాగే 3 లేదా 4 లవంగాలను నీటిలో బాగా మరిగించి, ఆ నీటిలో కొంచెం తేనె లేదా అల్లం రసం కలుపుకుని తాగితే గొంతు నొప్పి, దగ్గు నుంచి ఉపశమనం కలగవచ్చు. కానీ దగ్గును తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఎక్కువ మొత్తంలో లవంగాలను తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
చిన్న పిల్లలకు వైద్యుల సలహా లేకుండా లవంగాలను ఇవ్వకూడదు. అలాగే అలెర్జీలు లేదా నోటి పూత ఉన్నవారు జాగ్రత్త వహించాలి. ఇప్పటికే మందులు వాడుతున్న వారు లవంగాలు లేదా లవంగాల కషాయం తాగే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. దగ్గు తగ్గకుండా కొనసాగినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి లేదా కఫంలో రక్తం పడినా వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది.













