- Home
- Life
- Flight Journey: ఒక్కసారైనా విమానం ఎక్కాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఫ్లైట్ జర్నీ చేసే మార్గాలివే!
Flight Journey: ఒక్కసారైనా విమానం ఎక్కాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఫ్లైట్ జర్నీ చేసే మార్గాలివే!
Flight Journey: ఒక్కసారైనా ఫ్లైట్ జర్నీ చేయాలని చాలామందికి ఉంటుంది. టికెట్ ధరలు ఎక్కువగా ఉంటాయని కొందరు వెనకడుగు వేస్తుంటారు. కానీ విమాన ప్రయాణం కోసం వేలు ఖర్చు చేయాల్సిన పనిలేదు. ఈ టిప్స్ పాటిస్తే బడ్జెట్లోనే ఫ్లైట్ జర్నీ చేయొచ్చు. ఎలాగో చూద్దాం.

తక్కువ ఖర్చులో ఫ్లైట్ జర్నీ చేసే చిట్కాలు
విమాన ప్రయాణం చేయాలని చాలామందికి కోరికగా ఉంటుంది. మేఘాల మధ్య నుంచి ప్రయాణించాలని, కిటికీలో నుంచి అందమైన దృశ్యాలను చూడాలని చాలామంది అనుకుంటారు. అయితే విమాన టికెట్ల ధరలు ఎక్కువగా ఉంటాయనే భయంతో కొందరు తమ కోరికను వాయిదా వేస్తుంటారు. కానీ కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే తక్కువ బడ్జెట్లోనూ విమాన ప్రయాణం చేయవచ్చు. మరి మొదటిసారి విమానం ఎక్కాలనుకునేవారు తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి పాటించాల్సిన మార్గాలేంటో తెలుసుకుందాం.
ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం
తక్కువ ధరకు విమాన టికెట్లు పొందాలంటే ముందస్తు ప్రణాళిక చాలా ముఖ్యం. ప్రయాణ తేదీ దగ్గరపడే కొద్దీ టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే వీలైనంత ముందుగా ప్రయాణ తేదీలను నిర్ణయించుకుని టికెట్లు బుక్ చేసుకోవాలి. సాధారణంగా కొన్ని వారాల ముందే ధరలను పరిశీలించడం మంచిది. టికెట్ ధరలను పోల్చి చూసి తక్కువ ధర ఉన్నదాన్ని ఎంచుకోవాలి. టికెట్ బుక్ చేసుకోవడానికి ఒకే వెబ్‌సైట్‌పై ఆధారపడకూడదు. ఏయిర్ లైన్స్ అధికారిక వెబ్సైట్లు, ఆన్లైన్ ట్రావెల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ధరలను పరిశీలించాలి. ఒకే విమానానికి వేర్వేరు ప్లాట్‌ఫామ్స్‌లో ధరలు కొంత మారవచ్చు. టికెట్ ధరతో పాటు అదనపు ఛార్జీలు, సీటు ఎంపిక ఖర్చు, బ్యాగేజీ ఛార్జీలు కూడా గమనించాలి.
ప్రయాణ తేదీల్లో వెసులుబాటు
మీరు తప్పనిసరిగా ఒకే తేదీన ప్రయాణించాలనే నిబంధన లేకపోతే కొన్ని రోజులు అటూ ఇటూ మార్చి ధరలను పరిశీలించాలి. వారాంతాలు, పండగలు, సెలవుల సమయంలో విమాన టికెట్లకు డిమాండ్ ఎక్కువగా ఉండవచ్చు. అందువల్ల వీలైతే రద్దీ తక్కువగా ఉండే రోజుల్లో ప్రయాణించేలా ప్లాన్ చేసుకోవాలి.
ఆఫర్లను అస్సలు మిస్ కావొద్దు
ఏయిర్ లైన్స్ తరచూ ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. పండగల సమయంలో, ప్రత్యేక సందర్భాల్లో, కొత్త రూట్ల ప్రారంభం సందర్భంగా తక్కువ ధరకు టికెట్లు అందించే అవకాశం ఉంటుంది. అలాగే బ్యాంక్ కార్డులతో చెల్లింపులు చేసేటప్పుడు అదనపు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా లభించవచ్చు. అందుకే ఏయిర్ లైన్స్ వెబ్సైట్లు, ట్రావెల్ యాప్‌లలో వచ్చే ఆఫర్లను గమనిస్తూ ఉండాలి.
లో-కాస్ట్ ఎయిర్‌లైన్స్
ప్రస్తుతం దేశీయంగా తక్కువ ధరలకు విమాన ప్రయాణ సదుపాయం కల్పించే సంస్థలు ఉన్నాయి. వీటిని సాధారణంగా లో-కాస్ట్ ఎయిర్‌లైన్స్ అంటారు. వీటిలో టికెట్ ధరలు కొన్ని సందర్భాల్లో తక్కువగా ఉంటాయి. అయితే ఉచితంగా లభించే బ్యాగేజీ పరిమితి, ఫుడ్, సీటు ఎంపిక వంటి సదుపాయాలు ఇతర విమానాలతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉండవచ్చు.
కనెక్టింగ్ ఫ్లైట్స్
నాన్‌స్టాప్ విమానాలతో పోలిస్తే మధ్యలో ఒకచోట ఆగే కనెక్టింగ్ ఫ్లైట్స్ కొన్నిసార్లు తక్కువ ధరకు లభిస్తాయి. ప్రయాణానికి ఎక్కువ సమయం కేటాయించగలిగితే ఇలాంటి విమానాలను పరిశీలించవచ్చు. అయితే కనెక్టింగ్ ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడు రెండు విమానాల మధ్య తగినంత సమయం ఉందో లేదో చూసుకోవాలి.
లగేజీ విషయంలో..
విమాన ప్రయాణంలో లగేజీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. టికెట్‌తో పాటు నిర్ణీత పరిమితి వరకు మాత్రమే ఉచితంగా బ్యాగేజీ తీసుకెళ్లేందుకు అనుమతి ఉండవచ్చు. అదనపు బరువు ఉంటే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. అందుకే ప్రయాణానికి అవసరమైన దుస్తులు, వస్తువులను మాత్రమే తీసుకెళ్లాలి.
ప్రైస్ అలర్ట్స్
మీరు వెళ్లాలనుకునే ప్రాంతానికి విమాన టికెట్ ధరలు ఎప్పుడు తగ్గుతున్నాయో తెలుసుకోవడానికి ప్రైస్ అలర్ట్స్ ఉపయోగపడతాయి. కొన్ని ట్రావెల్ వెబ్సైట్లు, యాప్‌లు టికెట్ ధరల్లో మార్పులు వచ్చినప్పుడు నోటిఫికేషన్లు పంపిస్తాయి. వాటిని ఆన్ చేసుకుంటే ధరలు తగ్గినప్పుడు వెంటనే తెలుసుకోవచ్చు.













