Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఇలాంటి వ్యక్తితో కలిసి జీవించడం కంటే వదిలేయడం మేలు!
జీవితంలో ప్రతి బంధం చివరి వరకు కొనసాగుతుందని చెప్పలేము. కొన్నిసార్లు అనుకోని కారణాలు, ఇబ్బందులు, బాధల వల్ల బంధాలు మధ్యలోనే తెగిపోతుంటాయి. కానీ ఎలాంటి వ్యక్తితో జీవించడం కంటే విడిపోవడం మేలు? చాణక్య నీతి ఏం చెబుతోందో ఇక్కడ చూద్దాం.

చాణక్య నీతి
ఆచార్య చాణక్యుడు రాజకీయ వ్యూహకర్త మాత్రమే కాదు. మానవ స్వభావాన్ని, సంబంధాలను, జీవిత సత్యాలను సూక్ష్మంగా విశ్లేషించిన మహా తత్త్వవేత్త. ఆయన నీతి సూత్రాలు ఇప్పటికీ ఆచరణనీయం. చాణక్య నీతి ప్రకారం ప్రతి బంధం చివరివరకు నిలబడాలని లేదు. కొన్నిసార్లు మన జీవితం ప్రశాంతంగా, సార్థకంగా సాగాలంటే కొన్ని బంధాలను వదిలేయడం తప్పనిసరి. మరి ఎలాంటి వ్యక్తులతో జీవితం కొనసాగించకూడదో ఇక్కడ చూద్దాం.
అభివృద్ధికి అడ్డుగా నిలిచే వ్యక్తి
మనతో ఉన్న వ్యక్తి మన అభివృద్ధికి అడ్డుగా నిలుస్తుంటే, మన మనస్సుకు నిరంతరం బాధను కలిగిస్తుంటే అలాంటి వ్యక్తితో కలిసి జీవించడం కన్నా ఒంటరిగా ఉండడం మేలని చాణక్య నీతి చెబుతోంది. ఎందుకంటే చెడు సహవాసం మన శక్తిని క్రమంగా హరిస్తుంది. నీతి, ఆత్మగౌరవం, మానసిక శాంతిని కోల్పోయేలా చేస్తుంది. ఒక వ్యక్తి మనపై అసూయతో ఉన్నా, మన విజయాన్ని సహించలేకపోతున్నా.. అలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిదని చాణక్య నీతి చెబుతోంది.
చెడు సహవాసం చేస్తే..
సాధారణంగా మనతో ఎక్కువగా ఉండే వారి లక్షణాలు మనకూ వస్తాయి. అబద్ధాలు చెప్పే వారితో ఉంటే మనలో నిజాయతీ తగ్గుతుంది. అలసత్వం కలిగిన వారితో ఉంటే మనలో కృషి తగ్గుతుంది. నెగెటివ్ ఆలోచనలు కలిగిన వారితో ఉంటే మన మనస్సు కూడా నెమ్మదిగా నిరుత్సాహానికి లోనవుతుంది. అందుకే మన సహవాసాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలని చాణక్యుడు పేర్కొన్నాడు.
బంధం ఎలా ఉండాలంటే..
చాణక్యుడి దృష్టిలో బంధం అనేది బాధను మోయడానికి కాదు, బలాన్ని పెంచుకునేలా ఉండాలి. ఒక వ్యక్తి మనల్ని అర్థం చేసుకోకుండా, మన భావాలను నిర్లక్ష్యం చేస్తూ, మన అవసరాలను తక్కువగా చూస్తుంటే, అలాంటి బంధం పేరుకు మాత్రమే బంధంగా ఉంటుంది. అది మన జీవితాన్ని ముందుకు నడిపించదు. పైగా వెనక్కి లాగుతుంది. చాణక్య నీతి ప్రకారం అలా ప్రవర్తించే వ్యక్తిని వదిలేయడం మంచిది.
హాని చేసే బంధాలను
మనలో చాలామంది సంబంధాలు తెంచుకోవడాన్ని తప్పుగా భావిస్తారు. కానీ మనకు హాని చేసే సంబంధాన్ని కొనసాగించడం మూర్ఖత్వమని చాణక్య నీతి చెబుతోంది. ఒక వ్యక్తి మన జీవితంలో ఉండటం వల్ల మనకు బాధ మాత్రమే మిగులుతుంటే, ఆ బంధం విలువ కోల్పోయినట్లే. మన జీవితాన్ని సంతోషాలతో నింపుకోవడం, బాధలతో నింపుకోవడం మన చేతుల్లోనే ఉంటుందని చాణక్య నీతి చెబుతోంది.
భయంతో బంధం కొనసాగించవద్దు..
చాణక్యుడి ప్రకారం భయంతో సంబంధాలను కొనసాగించకూడదు. ఇతరులు ఏమనుకుంటారో అనే ఆలోచనలు మన నిర్ణయాలను బలహీనపరుస్తాయి. కానీ ధైర్యంగా, వివేకంతో ఆలోచించి తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తును కాపాడుతాయి. ఒక చెడ్డ వ్యక్తిని వదిలేయడం వల్ల మొదట కొంత బాధ కలగవచ్చు. కానీ కాలక్రమేణా అది మనకు శాంతిని, స్వేచ్ఛను, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని చాణక్యుడు తన నీతి సూత్రాల్లో పేర్కొన్నాడు.

