Women Psychology: ఆడవాళ్లు నిజంగానే సీక్రెట్స్ దాచుకోలేరా? సైకాలజీ ఏం చెప్తోంది?
ఆడవాళ్ల నోట్లో ఏది దాగదు. అన్నీ బయటకు చెప్పేస్తారు. వీళ్లకు సీక్రెట్స్ చెప్పకపోవడమే మంచిది అని చాలామంది అంటుంటారు. ఇది నిజమా? లేక తరతరాలుగా మన మనసుల్లో నాటుకుపోయిన అభిప్రాయామా? ఈ విషయం గురించి సైకాలజీ ఏం చెబుతోందో ఇక్కడ చూద్దాం.

Women Psychology
చిన్న గాసిప్ నుంచి వ్యక్తిగత విషయాల వరకు, ఆడవాళ్లు మనసులో ఏం దాచుకోరు. అన్నీ సీక్రెట్స్ బయటపెడతారనే భావన చాలా మందిలో పాతుకుపోయింది. కానీ ఇది నిజమా? లేక శతాబ్దాలుగా మనం నమ్ముకుంటూ వచ్చిన అపోహనా? సైకాలజీ ఈ విషయంపై ఏం చెబుతోందో చూస్తే.. ఈ అభిప్రాయానికి ఉన్న మూలాలు, కారణాలు, అలాగే వాస్తవం ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది.
సీక్రెట్ దాచుకునే సామర్థ్యం
సైకాలజీ ప్రకారం.. సీక్రెట్ దాచుకునే సామర్థ్యానికి జెండర్ కి సంబంధం లేదు. రహస్యాన్ని కాపాడటం అనేది వ్యక్తిత్వ లక్షణాలు, భావోద్వేగ నియంత్రణ, నైతిక విలువలు, పరిస్థితులు, అలాగే ఆ సీక్రెట్ ప్రాముఖ్యతపై ఆధారపడి ఉంటుంది. సైకాలజీ విశ్లేషణల ప్రకారం పురుషులు, మహిళలు ఇద్దరూ సమానంగా సీక్రెట్స్ దాచగలరు లేదా బయటపెట్టగలరు. కానీ తేడా ఏంటంటే, వారు ఆ రహస్యాన్ని ఎలా ప్రాసెస్ చేస్తారు, ఎలా వ్యక్తపరుస్తారు అనే దానిలో ఉంటుంది.
మానసిక ఒత్తిడి తగ్గడానికి..
మహిళలు సాధారణంగా భావోద్వేగాల్ని మాటల ద్వారా వ్యక్తపరుస్తుంటారు. మహిళలు తమ భావాలు, ఆలోచనలు, అనుభవాలను ఇతరులతో పంచుకోవడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటారు. ఈ ప్రవర్తన వల్లే, వారు ఏదైనా విషయం చెప్పినప్పుడు అది సీక్రెట్ అయినా కూడా, “వాళ్లు దాచుకోలేరు” అనే అభిప్రాయం ఏర్పడింది. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వారు చెప్పేది నమ్మకమైన వ్యక్తికే, ఎమోషనల్ సపోర్ట్ కోసం మాత్రమే. అది బాధ్యతా రాహిత్యంగా సీక్రెట్‌ను లీక్ చేయడం కాదు.
పురుషులు సీక్రెట్స్ ఎప్పుడు బయటపెడతారంటే?
మరోవైపు, పురుషులు తమ భావాలను లోపలే దాచుకోవడం, ఎమోషన్స్ ని చూపించకపోవడం, మౌనంగా ఉండడం వంటివి చిన్నప్పటి నుంచే నేర్చుకుంటారు. సమాజం కూడా వారిని అలాగే ప్రోత్సహిస్తుంది. అందువల్ల వారు తక్కువగా మాట్లాడతారు, కానీ ఇది వాళ్లు సీక్రెట్స్ బాగా దాచగలరన్న అర్థం కాదు. చాలాసార్లు పురుషులు కూడా రహస్యాలను బయటపెడతారు. కానీ అది కోపం, మందు ప్రభావం, లేదా సామాజిక ఒత్తిడి వల్ల జరుగుతుంది.
నెగిటివ్ లక్షణం కాదు..
మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మహిళలు సామాజిక బంధాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. రిలేషన్‌షిప్స్‌ను మెయింటైన్ చేయడం, కనెక్షన్ ఫీల్ కావడం వాళ్లకు చాలా ముఖ్యం. అందుకే వారు కొన్నిసార్లు రహస్యాన్ని పంచుకోవడం ద్వారా నమ్మకం పెరుగుతుందని భావిస్తారు. దీన్ని “సోషల్ బాండింగ్” అంటారు. ఇది నెగటివ్ లక్షణం కాదు, నిజానికి ఇది ఎంపతి, అండర్‌స్టాండింగ్ లాంటి పాజిటివ్ లక్షణాలతో సంబంధం కలిగి ఉంటుంది. కానీ బయటికి మాత్రం అది గాసిప్‌లా, సీక్రెట్ బ్రేక్ చేసినట్టుగా కనిపిస్తుంది.
చిన్న తప్పును కూడా..
సైకాలజీ ప్రకారం, మనం ఏ జెండర్ గురించి నెగిటివ్ నమ్మకం పెట్టుకుంటామో, వాళ్లు చేసిన చిన్న తప్పును కూడా పెద్దదిగా చూస్తాం. దీన్ని “కన్ఫర్మేషన్ బయాస్” అంటారు. ఒక మహిళ సీక్రెట్ చెప్తే, “చూశావా, ఆడవాళ్లు దాచుకోలేరు” అంటారు. అదే ఒక పురుషుడు ఆ పని చేస్తే, దాన్ని వ్యక్తిగత తప్పుగా చూస్తారు. జెండర్ కి లింక్ చేయరు. ఈ రెండు రకాల ఆలోచనలే ఈ అపోహకు మరింత బలాన్నిస్తున్నాయి. కాబట్టి జెండర్ ని బట్టి కాకుండా వ్యక్తిని అర్థం చేసుకోవడమే నిజమైన మానసిక పరిపక్వత అని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు.

