Morning Bath Vs Night Bath: చర్మం బాగుండాలంటే స్నానం ఉదయం చేయాలా? రాత్రి చేయాలా?
Morning Bath Vs Night Bath: సాధారణంగా కొందరు ఉదయం స్నానం చేయడానికి ఇష్టపడితే, మరికొందరు రాత్రి పూట స్నానం చేస్తుంటారు. అయితే స్నానం చేసే టైం కూడా చర్మ సంరక్షణలో ముఖ్యమని మీకు తెలుసా? నిపుణుల ప్రకారం ఏ టైంలో స్నానం చేయడం వల్ల చర్మానికి లాభామో చూద్దాం.

స్నానం చేయడానికి ఏ టైం బెస్ట్?
రోజూ స్నానం చేయడం వ్యక్తిగత శుభ్రతలో చాలా ముఖ్యం. అయితే ఉదయం స్నానం చేయడం మంచిదా లేక రాత్రి పూట స్నానం చేస్తే శరీరానికి ఎక్కువ లాభాలు ఉంటాయా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. మరి నిపుణుల ప్రకారం ఏ టైంలో స్నానం చేస్తే చర్మ ఆరోగ్యానికి మేలు జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
ఉదయం స్నానం చేస్తే కలిగే లాభాలు
ఉదయం స్నానం చేయడం వల్ల నిద్ర మత్తు వదిలి, ఫ్రెష్‌గా రోజువారీ పనులు మొదలుపెట్టవచ్చు. రాత్రి పూట చర్మంపై పేరుకుపోయే చెమట, నూనె, డెడ్ సెల్స్‌ను క్లీన్ చేయడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా ఉదయం ఆఫీస్‌కు వెళ్లేవారు, స్కూల్ లేదా కాలేజీకి వెళ్లేవారు, బయట ఎక్కువ సమయం గడిపేవారికి ఉదయం స్నానం చాలా కంఫర్ట్‌గా ఉంటుంది.
ఉదయం స్నానం చేయడం వల్ల శరీరం, మనసు రెండూ యాక్టివ్‌గా మారతాయి. నిద్ర మత్తులో ఉన్నవారికి ఇది మంచి రిఫ్రెషింగ్ అలవాటుగా మారుతుంది. అలాగే జుట్టును సెట్ చేసుకోవడానికి, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడటానికి ముందు చర్మాన్ని క్లీన్ చేసుకోవడానికి ఉదయం స్నానం బాగా ఉపయోగపడుతుంది.
రాత్రి పూట స్నానం చేస్తే కలిగే లాభాలు
ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట పనిచేసేవారు, ఎండలో ప్రయాణించేవారు, వ్యాయామం చేసేవారు, ఎక్కువగా చెమట పట్టేవారు రాత్రి పూట స్నానం చేయడం మంచిది. దీనివల్ల శరీరంపై ఉన్న చెమట, దుమ్ము, మురికి తొలగిపోతాయి. దీంతో శుభ్రమైన శరీరంతో నిద్రపోవచ్చు. ముఖ్యంగా సన్‌స్క్రీన్ లేదా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడేవారు వాటిని క్లీన్ చేసుకోవడానికి రాత్రి స్నానం బాగా హెల్ప్ చేస్తుంది.
రాత్రి పూట గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల మనసు, శరీరం రిలాక్స్ అవుతాయి. ఇది త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. స్నానం చేసిన తర్వాత శరీర ఉష్ణోగ్రతలో వచ్చే మార్పులు కూడా నిద్రకు మేలు చేస్తాయి.
వేడి నీటితో స్నానం చేయడం మంచిదేనా?
చలికాలంలో వేడి నీటితో స్నానం చేయడం హాయిగా అనిపించవచ్చు. కానీ మరీ వేడిగా ఉన్న నీటితో స్నానం చేస్తే చర్మంలోని సహజ నూనెలు తగ్గిపోయి పొడిబారడం, దురద, మంట వంటి సమస్యలు వస్తాయి. ఇప్పటికే పొడి చర్మం ఉన్నవారు దీనివల్ల మరింత ఇబ్బంది పడతారు. కాబట్టి స్నానానికి గోరువెచ్చని నీరు వాడటం మంచిది. అలాగే 5 నుంచి 10 నిమిషాల్లోపు స్నానం ముగించడం ఉత్తమం.
స్నానం చేసిన వెంటనే టవల్‌తో చర్మాన్ని గట్టిగా రుద్దకూడదు. మెల్లగా అద్దుతూ తడిని తుడుచుకోవాలి. చర్మం కాస్త తడిగా ఉన్నప్పుడే మంచి మాయిశ్చరైజర్ లేదా లోషన్ రాసుకోవాలి. ఇది చర్మంలో తేమను నిలిపి ఉంచడానికి సహాయపడుతుంది. పొడి లేదా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు మైల్డ్ క్లెన్సర్లను ఎంచుకోవడం మంచిది.
రోజుకు రెండుసార్లు స్నానం చేయవచ్చా?
ఎండ ఎక్కువగా ఉన్న రోజుల్లో లేదా వ్యాయామం, కఠినమైన శారీరక శ్రమ వల్ల ఎక్కువ చెమట పడితే రెండోసారి స్నానం చేయడం అవసరం కావచ్చు. కానీ ప్రతిసారీ ఎక్కువ సబ్బు వాడితే చర్మం పొడిబారుతుంది. కాబట్టి అవసరమైన మేర వాడటం మంచిది. చర్మ స్వభావాన్ని బట్టి స్నానం చేసే విధానాన్ని మార్చుకోవడం ఉత్తమం.
ఏ టైం బెస్ట్?
ఉదయం స్నానం చేయడం వల్ల రోజును ఫ్రెష్‌గా మొదలుపెట్టవచ్చు. రాత్రి స్నానం చేయడం వల్ల రోజంతా పట్టిన చెమట, మురికి తొలగిపోయి శుభ్రంగా నిద్రపోవచ్చు. అయితే మన రోజువారీ పనులు, శారీరక శ్రమ, చెమట, చర్మ స్వభావం, నిద్రపోయే సమయాన్ని బట్టి స్నానం చేసే టైమ్‌ను డిసైడ్ చేసుకోవడం మంచిది.

