Cracked Heels: పాదాలు పగిలి నొప్పి పెడుతున్నాయా? ఇదే బెస్ట్ సొల్యూషన్
Cracked Heels: పాదాల పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా? ఏం రాసినా ఈ పగుళ్లు తగ్గడం లేదా? అయితే, కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే… మీ పాదాలను మళ్లీ మృదువుగా మార్చుకోవచ్చు.

పాదాల పగుళ్లు
వర్షాకాలం, చలికాలం రాగానే చాలా మంది పాదాలు పగిలిపోతూ ఉంటాయి. అలా పాదాలు పగిలినప్పుడు నడవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. దాని కోసం చాలా మంది ఏవేవో క్రీములు రాస్తూ ఉంటారు. కానీ.. ఆ క్రీములు అన్నీ పాదాల పగుళ్లను నయం చేయలేవు. అలా అని ఏమీ రాయకుండా వదిలేస్తే... అది చాలా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్లు, రక్తస్రావం జరిగే అవకాశం కూడా ఉంది. అయితే... మీరు ఈ సమస్యకు కొన్ని సింపుల్ చిట్కాలతో గుడ్ బై చెప్పేయవచ్చు. మనకు ఈజీగా దొరికే కొన్నింటితో వీటికి చెక్ పెట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...
పాదాలు ఎందుకు పగులుతాయి..?
నిరంతరం దుమ్ము, తడి ఉండే ప్రదేశాల్లో చెప్పులు లేకుండా నడిచే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అధిక బరువు, చర్మం పొడిబారడం, మధుమేహం వంటి సమస్యలు ఉన్నవారికి కూడా పాదాలు ఎక్కువగా పగులుతుంటాయి. నేలపై నడుస్తూ.. ఇంటి పనులు చేసే మహిళలు కూడా ఈ సమస్యను ఫేస్ చేస్తూ ఉంటారు.
మొదట ఇవి చిన్న పగుళ్లుగా కనిపిస్తాయి, కానీ వీటిని పట్టించుకోకపోతే చర్మం లోతుగా పగిలి రక్తస్రావం అవుతుంది. ఇది నొప్పితో పాటు ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. బాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మజీవులు ఈ పగుళ్లలోకి ప్రవేశించి, చర్మాన్ని మరింత దెబ్బతీసే ప్రమాదం ఉంది.
పాదాల పగుళ్లను నివారించాలంటే ఏం చేయాలి?
పాదాల శుభ్రత: రోజూ సాయంత్రం వేళ గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి పాదాలను 10 నిమిషాల పాటు నానబెట్టాలి.
మాయిశ్చరైజింగ్: తర్వాత పాదాలను తుడిచి, కొబ్బరి నూనె, నెయ్యి, లేదా ఫుట్ క్రీమ్ రాయాలి. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.
రాత్రి సంరక్షణ: నిద్ర పోవడానికి ముందు పాదాలకు క్రీమ్ రాసి కాటన్ సాక్స్ వేసుకుంటే, చర్మంలో తేమ ఉంటుంది.
ఆహారం: నీటిని రోజూ 2-3 లీటర్లు త్రాగడం, విటమిన్ E, C, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్న ఆహారాలు (బాదం, అవకాడో, చేపలు) తినడం చర్మానికి మేలు చేస్తుంది.
గుడ్డు పెంకులతో పాదాల పగుళ్ల సమస్యకు చెక్...
చాలా మందిలో చెత్తలో పడేసే గుడ్డు పెంకులతో పాదాల పగుళ్లకు చెక్ పెట్టొచ్చు. దీని కోసం మీరు కోడి గుడ్డు పెంకులను ఎండ పెట్టి... మిక్సీలో వేసి మెత్తని పొడి చేసుకోవాలి.
ఇప్పుడు ఈ గుడ్డు పెంకుల పొడిలో కొంచెం తేనె, పెరుగు వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాదాలు పగిలిన చోట రాసి.. స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల పాదాలు మృదువుగా మారతాయి.
మిగిలిన పొడిలో కొబ్బరి నూనె, ఆముదం నూనె కలిపి క్రీమ్‌గా తయారు చేయాలి. రాత్రి పడుకునే ముందు పాదాలపై రాసి, సాక్స్ వేసుకోవాలి. రోజూ రాయడం వల్ల పాదాలు మళ్లీ మృదువుగా మారతాయి.
ఇతర సహజ చిట్కాలు
అరటిపండు మాస్క్: అరటిపండు ముద్ద చేసుకుని మడమలపై రాసి 15 నిమిషాల తర్వాత కడిగితే చర్మం మృదువుగా మారుతుంది.
నెయ్యి + పసుపు: ఈ మిశ్రమం చర్మంలో ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుంది.
ఆలొవెరా జెల్: చల్లదనం కలిగించి చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది.