Walking: రోజూ 10వేలు కాదు 7 వేల అడుగులు వేస్తే ఏమౌతుంది? శరీరంలో వచ్చే మార్పులు ఇవే
Walking: నడక అనేది ఒక గొప్ప వ్యాయామం. ప్రతిరోజూ కొద్దిసేపు నడవడం వల్ల పెద్ద తేడా వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజుకు 7,000 అడుగులు నడవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని హార్వర్డ్ అధ్యయనం కనుగొంది.

Walking..
మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే... శరీరానికి వ్యాయామం చాలా అవసరం. వ్యాయామం చేయడం అంటే... జిమ్ కి వెళ్లి కసరత్తులు చేయాల్సిన అవసరం లేదు. రోజూ వాకింగ్ చేసినా సరిపోతుంది. నడక మన శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. అయితే.. ప్రతిరోజూ వాకింగ్ చేస్తే మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? మరీ ముఖ్యంగా ప్రతిరోజూ 7 వేల అడుగులు నడిస్తే ఏమౌతుంది..? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం....
హార్వర్డ్ అధ్యయనం ఏం చెబుతోంది...?
హార్వర్డ్ హెల్త్ పబ్లిష్ చేసిన ఒక ముఖ్యమైన అధ్యయనం ప్రకారం, రోజుకు 7,000 అడుగులు నడవడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల (Cardiovascular Diseases - CVD) ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాక, అన్ని కారణాల వల్ల కలిగే ముందస్తు మరణాల ప్రమాదాన్ని కూడా ఇది తగ్గిస్తుందని కనుగొన్నారు. అంటే కేవలం నడకను అలవాటు చేసుకోవడం ద్వారా మన జీవిత కాలం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
గుండెపై నడక ప్రభావం
నడక ఒక రకమైన ఏరోబిక్ వ్యాయామం. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా నడవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. ఇన్సులిన్ సున్నితత్వం మెరుగవుతుంది, దీని వలన మధుమేహ నియంత్రణలో సాయం చేస్తుంది. సిస్టోలిక్ , డయాస్టొలిక్ రక్తపోటు రెండూ క్రమంగా తగ్గి గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు సమతుల్యం అవుతాయి – HDL (మంచి కొలెస్ట్రాల్) పెరుగుతుంది, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. దీని వల్ల గుండెపోటు (Heart Attack), ఇస్కీమిక్ స్ట్రోక్ (Ischemic Stroke) వంటి ప్రమాదాలను గణనీయంగా తగ్గుతాయి.
మానసిక ఆరోగ్య ప్రయోజనాలు...
వాకింగ్ చేయడం వల్ల శారీరకంగా మాత్రమే కాదు.. మానసికంగా కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మనసుకు శాంతి కలుగుతుంది. ఒత్తిడి తగ్గిస్తుంది. నిరాశ తగ్గుతుంది. మంచిగా నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. దీని వలన గుండెకు సంబంధించిన రిస్క్ మరింత తగ్గుతుంది. హార్వర్డ్ పరిశోధకులు చెబుతున్నదేమిటంటే, నిద్ర సరిగా పోకపోవడం, మానసిక ఒత్తిడి గుండె వ్యాధులకు ప్రధాన కారణం అవుతాయి. క్రమం తప్పకుండా నడవడం ద్వారా ఈ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.
బరువు తగ్గడానికి ఉపయోగపడే నడక..
ప్రతిరోజూ నడవడం వల్ల అధిక బరువు తగ్గించుకోవచ్చు. వాకింగ్ చేయడం వల్ల శరీరంలో కేలరీలు ఖర్చు అవుతాయి. ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది. దీని వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గడంతో గుండెపై ఉండే అదనపు ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలోని చక్కెర, కొవ్వు స్థాయిలు క్రమబద్ధంగా మారతాయి.
రోజుకి 7 వేల అడుగులు ఎందుకు వేయాలి..?
బరువు తగ్గడానికి, మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజూ కనీసం పదివేల అడుగులు వేయాలి అని చాలా మంది చెప్పడం మీరు వినే ఉంటారు. కానీ.. తాజా అధ్యయనాలు మాత్రం రోజుకి కనీసం 7 వేల అడుగులు వేస్తే సరిపోతుంది. ఎక్కువ నడిచినా పర్వాలేదు. కానీ... కనీసం 7వేల అడుగులు వేస్తే.. ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది.
ఫైనల్ గా…
నడక అనేది అత్యంత సులభమైన వ్యాయామం అయినప్పటికీ దీని ప్రయోజనాలు మాత్రం అమోఘం. రోజుకు 7,000 అడుగులు నడవడం ద్వారా గుండెపోటు, స్ట్రోక్, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యల ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాదు, నడక మానసిక ప్రశాంతత, మంచి నిద్ర, బరువు నియంత్రణకు కూడా తోడ్పడుతుంది.

