Arranged Marriage: అరేంజ్ట్ మ్యారేజీలో ఈ విషయాలే గొడవలకు కారణం
Arranged Marriage: అరేంజ్డ్ మ్యారేజ్‌లో పెళ్లికి ముందు ఎన్నో చూస్తారు. కుటుంబం, ఉద్యోగం, ఆస్తిపాస్తులపై ఆరా తీస్తారు. కానీ పెళ్లి తర్వాత భాగస్వామి ఏం కోరుకుంటారనేది పెద్దగా పట్టించుకోరు. అవే దంపతుల గొడవలకు కారణం. పెళ్లికి ముందు ఈ క్లారిటీ ఉండాలి.

ఈ ఐదు కోరికలే విభేదాలకు కారణం
పెళ్లికి ముందు ఇద్దరి కుటుంబాలు, అభిరుచులు, ఉద్యోగాలు, ఆర్థిక స్థితిగతులు.. ఇలా ఎన్నో విషయాలు చూసుకుంటారు. కానీ పెళ్లి తర్వాత ఒకరి నుంచి మరొకరు ఎలాంటి ఎక్స్ పర్ట్ చేస్తారన్నది చాలామంది పట్టించుకోరు. ముఖ్యంగా అరేంజ్డ్ మ్యారేజీల్లో ఈ ఐదు కోరికలే క్రమంగా భార్యాభర్తల మధ్య విభేదాలకు కారణం కావొచ్చు.
చెప్పకుండానే మనసులోని భావాలను అర్థం చేసుకోవాలి!
భాగస్వామి తన మనసులో ఏమనుకుంటున్నారో చెప్పకుండానే అర్థం చేసుకోవాలని చాలామంది ఆశిస్తుంటారు. ముఖ్యంగా ఏదైనా విషయంలో బాధపడినప్పుడు, ఎదుటివారే గుర్తించి మాట్లాడాలని కోరుకుంటారు. కానీ అవతలి వ్యక్తికి అసలు సమస్య ఏమిటో తెలియకపోతే ఎలా స్పందించాలో అర్థం కాదు. దీంతో చిన్న అపార్థాలు కూడా పెద్ద గొడవలకు దారితీస్తాయి. అందుకే మనసులోని భావాలను భాగస్వామితో నేరుగా పంచుకోవాలి. ఎదుటివారు తమ ఆలోచనలను చదవాలని ఆశించడం కంటే, ఓపెన్‌గా మాట్లాడటం ముఖ్యం.
ప్రతిసారీ భార్య లేదా భర్తే సర్దుకుపోవాలి!
పెళ్లి తర్వాత కొత్త కుటుంబానికి అలవాటు పడటం సహజం. అయితే ప్రతి విషయంలో ఒకరే సర్దుకుపోవాలని ఆశించడం సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా మహిళలు తమ ఇంటిని, కుటుంబాన్ని, స్నేహితులను వదిలి భర్త ఇంటికి వెళ్లి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా మారాలని కొందరు భావిస్తుంటారు. తమ అలవాట్లు, ఇష్టాలు, వ్యక్తిగత ప్రణాళికలను పక్కన పెట్టాలని ఆశిస్తారు. కానీ ఇదే విధంగా అవతలి వ్యక్తి కూడా కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలి. ఇద్దరిలో ఒకరే నిరంతరం రాజీపడుతుంటే కొంతకాలానికి అసంతృప్తి పెరుగుతుంది. వివాహ బంధంలో సర్దుబాటు అనేది ఇద్దరి వైపు నుంచి ఉండాలి.
కుటుంబ నిర్ణయాల్లో తల్లిదండ్రుల మాటే ఫైనల్!
అరేంజ్డ్ మ్యారేజీల్లో మొదటి నుంచి కుటుంబ సభ్యుల ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. అయితే పెళ్లి తర్వాత కూడా ప్రతి నిర్ణయాన్ని తల్లిదండ్రులే తీసుకోవాలని ఆశిస్తే భార్యాభర్తల మధ్య సమస్యలు రావొచ్చు. ఎక్కడ ఉండాలి? డబ్బును ఎలా ఖర్చు చేయాలి? పొదుపు ఎంత చేయాలి? పిల్లలను ఎప్పుడు కనాలి? వంటి వ్యక్తిగత విషయాల్లో కూడా తల్లిదండ్రుల నిర్ణయాలకే ప్రాధాన్యం ఇస్తే భాగస్వామికి అసంతృప్తి కలగవచ్చు. పెద్దల సలహాలు తీసుకోవడం మంచిదే. కానీ తమ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాల్లో భార్యాభర్తలిద్దరికీ సమాన ప్రాధాన్యం ఉండాలి.
ఇంటి పనులన్నీ భార్యే చూసుకోవాలి!
ఉద్యోగం చేస్తున్న మహిళలు కూడా ఇంటి బాధ్యతలన్నీ నిర్వహించాలనే అంచనా కొన్ని కుటుంబాల్లో కనిపిస్తుంది. వంట చేయడం, ఇంటిని శుభ్రం చేయడం, కుటుంబ సభ్యుల అవసరాలు చూసుకోవడం వంటి పనులన్నీ భార్యే చేయాలని ఆశిస్తుంటారు. భర్త ఉద్యోగం చేస్తున్నాడనే కారణంతో ఇంటి పనుల నుంచి పూర్తిగా దూరంగా ఉండాలని భావిస్తారు. కానీ ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇంటి బాధ్యతలు కూడా ఇద్దరూ పంచుకోవాలి. లేదంటే ఒకరిపై పని భారం పెరిగి, మరొకరిపై అసంతృప్తి ఏర్పడుతుంది. ఇది క్రమంగా దాంపత్య జీవితంపై ప్రభావం చూపుతుంది.
పెళ్లయిన వెంటనే ప్రేమ పెరిగిపోవాలి!
అరేంజ్డ్ మ్యారేజ్‌లో పెళ్లికి ముందు పెద్దగా పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా జీవిత భాగస్వాములవుతారు. అలాంటప్పుడు పెళ్లయిన వెంటనే ఇద్దరి మధ్య ఎంతో ప్రేమ, చనువు ఏర్పడాలని ఆశిస్తుంటారు. కానీ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం అవసరం. అలవాట్లు, వ్యక్తిత్వం, భావోద్వేగ అవసరాలు తెలుసుకోవడానికి కొంత సమయం పట్టొచ్చు. మొదట్లో ఎక్కువగా మాట్లాడకపోయినా, వెంటనే తమ భావాలను వ్యక్తపరచకపోయినా ప్రేమ లేదని అర్థం కాదు. ఒకరికొకరు సమయం ఇవ్వకుండా వెంటనే అనుబంధం ఏర్పడాలని ఒత్తిడి చేస్తే బంధంలో అనవసరమైన సమస్యలు తలెత్తవచ్చు.
పెళ్లికి ముందే ఈ విషయాలపై మాట్లాడుకోవాలి!
అరేంజ్డ్ మ్యారేజ్‌లో పెళ్లి చూపులు, కుటుంబ నేపథ్యం, ఉద్యోగం, ఆర్థిక స్థితిగతుల గురించి చర్చించడం ఎంత ముఖ్యమో.. పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య ఉండాల్సిన అంచనాల గురించి మాట్లాడుకోవడం కూడా అంతే ముఖ్యం. కుటుంబ బాధ్యతలు, ఇంటి పనుల పంపకం, ఆర్థిక నిర్ణయాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, భవిష్యత్తు ప్రణాళికలపై ముందుగానే స్పష్టత తెచ్చుకోవాలి. ఎందుకంటే పెళ్లి బంధం నిలబడటానికి కుటుంబాల అంగీకారంతో పాటు భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన, గౌరవం, నమ్మకం కూడా అవసరం.





