- Home
- Life
- Food
- Tribal Style Fish Fry: ఎప్పుడూ తినే చేపల వేపుడు కాదు..ఉసిరితో చేసే ఈ రెసిపీ తింటే మైమరిచిపోతారు
Tribal Style Fish Fry: ఎప్పుడూ తినే చేపల వేపుడు కాదు..ఉసిరితో చేసే ఈ రెసిపీ తింటే మైమరిచిపోతారు
Tribal Style Fish Fry: ఫిష్ ఫ్రై అంటే ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. కానీ ఆదివాసీలు చేసుకునే ఉసిరికాయ ఫిష్ ఫ్రై ఎప్పుడైనా ట్రై చేశారా? ఇందులో మరో ముఖ్యమైన పదార్థం కూడా ఉంది. దానివల్ల అద్భుతమైన రుచిని ఇస్తుంది. రెసిపీ చూద్దాం.

ఆదివాసీ స్టైల్ ఫిష్ ఫ్రై
చేపల వేపుడు అనగానే సాధారణంగా కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం లేదా చింతపండుతో చేసే మసాలా గుర్తుకొస్తుంది. కానీ ఈ ఆదివాసీలు చేసుకునే ఫిష్ ఫ్రై మాత్రం కాస్త వెరైటీగా ఉంటుంది. ఇందులో ఎండిన ఉసిరికాయలు, మిరియాలు, మెంతులు, వెల్లుల్లి, కొబ్బరి నూనెతో ప్రత్యేకమైన మసాలా తయారుచేస్తారు. ఈ మసాలాలో చేప ముక్కలను నానబెట్టి పెనం మీద నెమ్మదిగా కాల్చితే.. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే రుచికరమైన ఫిష్ ఫ్రై రెడీ అవుతుంది.
ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు
750 గ్రాముల చేప ముక్కలు, మూడో వంతు కప్పు ఎండిన ఉసిరికాయలు, రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు, పావు టీ స్పూన్ మెంతులు, 12 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, కరివేపాకు, ఉప్పు తీసుకోవాలి. మరింత కారం కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా వాడుకోవచ్చు.
ఫిష్ ఫ్రై తయారీ విధానం
ముందుగా ఎండిన ఉసిరికాయలను ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి కనీసం గంట నుంచి రెండు గంటల పాటు నానబెట్టాలి. వీలైతే రాత్రంతా నానబెట్టుకోవచ్చు. అవి మెత్తగా అయ్యాక నీటిని వంపేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులో మిరియాలు, కొద్దిగా ఉప్పు వేసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. కారం ఎక్కువగా కావాలనుకునేవారు ఇదే సమయంలో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు.
ఇప్పుడు ఒక చిన్న పాన్‌లో మెంతులు వేసి మీడియం మంటపై ముదురు రంగు వచ్చే వరకు వేయించాలి. అవి చల్లారిన తర్వాత మెత్తని పొడిలా దంచుకోవాలి. మరో పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసి వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు వేసి లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
వెల్లుల్లి వేగిన తర్వాత ముందుగా తయారుచేసుకున్న ఉసిరికాయల పేస్ట్‌ను అందులో వేసి నిమిషం పాటు వేయించాలి. ఆ తర్వాత మెంతుల పొడి, మూడో వంతు కప్పు నీళ్లు, కరివేపాకు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం కొద్దిగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
వేడివేడిగా స్టార్టర్‌గా అదిరిపోతుంది
ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఈ మసాలాలో వేసి ప్రతి ముక్కకూ మసాలా పట్టేలా కలపాలి. కనీసం 30 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల చేప ముక్కలకు ఉసిరి, మిరియాలు, మెంతులు, వెల్లుల్లి రుచులు బాగా పడతాయి.
తర్వాత పెనం మీద ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసి వేడిచేయాలి. మసాలా పట్టిన చేప ముక్కలను పెనం మీద ఒకదానికొకటి తగలకుండా అమర్చాలి. మీడియం మంటపై మూత పెట్టి సుమారు 12 నుంచి 15 నిమిషాల పాటు కాల్చాలి. ఆ తర్వాత మూత తీసి చేప ముక్కలు విరిగిపోకుండా జాగ్రత్తగా మరోవైపు తిప్పాలి.
పైన కొద్దిగా కరివేపాకు చల్లి, అవసరమైతే మరికొంత నూనె వేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. చేప ముక్కలు బయటకు క్రిస్పీగా, లోపల మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ప్రత్యేకమైన ఉసిరి మసాలాతో తయారైన ఆదివాసీల ఫిష్ ఫ్రై రెడీ. వేడివేడిగా స్టార్టర్‌గా లేదా అన్నంలోకి సైడ్ డిష్‌గా కూడా తీసుకోవచ్చు.





