Soaking Nuts: నానబెట్టిన నట్స్ తింటున్నారా..హెల్తీగానా? అన్ హెల్తీగానా?
Soaking Nuts: ఆరోగ్యం కోసం నానబెట్టిన నట్స్, సీడ్స్ తింటున్నాం. మరి గింజలను ఎలా నానబెట్టాలి, ఎంతసేపు నానబెట్టాలి అన్నదానిపైనే అసలు మ్యాజిక్ ఉంది. సోక్ చేసే టైమింగ్ పాటించకపోతే...హెల్తీ ఫుడ్ కాస్తా అన్ హెల్తీ అవుతుంది.

నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా?
ఆరోగ్యం కోసం చాలామంది అలవాట్లు మార్చుకుంటున్నారు. డైట్ ఫాలో అవుతారు, వ్యాయామం చేస్తారు, జంక్ ఫుడ్ దూరంగా పెడతారు. రోజు మొదలయ్యే క్షణం నుంచే ఏం తినాలి, ఎప్పుడు తినాలి అన్నది ముందే ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఉదయం నానబెట్టిన నట్స్, సీడ్స్ తినడం చాలామందికి రోజువారీ అలవాటుగా మారింది. హెల్త్ కోసం అని ఖర్చు ఎక్కువైనా కొనేస్తారు. ఎంత బిజీగా ఉన్నా టైం కేటాయించి మరీ తింటారు. కొన్నిసార్లు నానబెట్టడం మర్చిపోతే పచ్చిగానే తినేస్తారు. కానీ అలా తినడం నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా అన్న సందేహం చాలా మందికి ఉంటుంది.
నానబెట్టి తింటే సులువుగా జిర్ణమవుతుంది
నట్స్, సీడ్స్ నానబెట్టడం అనేది కొత్తగా వచ్చిన ట్రెండ్ కాదు. మన వంటల్లో ఎప్పటినుంచో ఉన్న అలవాటు. గింజలు, విత్తనాలు, ధాన్యాలు సహజంగానే కొన్ని పొరలు కలిగిఉంటాయి. వాటిని నేరుగా తింటే జీర్ణక్రియకు ఇబ్బందిగా మారుతాయి. అందుకే పప్పులు వండేటప్పుడు ముందుగా నానబెడతారు. ఇలా నానబెట్టడం వల్ల గ్యాస్‌కు కారణమయ్యే పదార్థాలు తగ్గి, ఆహారం మెత్తబడుతుంది. దాంతో కడుపుకు భారంగా కాకుండా సులువుగా జీర్ణమవుతుంది.
ఎంత సేపు సోక్ చేయాలి?
అయితే నట్స్ అండ్ సీడ్స్ నానబెట్టినప్పుడు దాని టైమింగ్ కూడా చాలా ముఖ్యం. కచ్చితంగా సోక్ చేశాకే తినాలి. బాదం రాత్రంతా నానబెట్టాలి. అప్పుడు దాని స్కిన్ సులువుగా వచ్చేస్తుంది. త్వరగా జీర్ణం అవుతుంది. వాల్నట్స్ మాత్రం 4-6 గంటలు సోక్ చేయాలి. ఎక్కువ సేపు ఉంచితే చేదుగా మారతాయి. జీడిపప్పు 2-4 గంటలు నానబెట్టాలి. వేరుశెనగలను 6-8 గంటలు సోక్ చేయాలి. తర్వాత తప్పనిసరిగా ఉడికించాలి, అప్పుడే కడుపుకు భారంగా ఉండదు.
విత్తనాలకు తక్కువ టైం చాలు
చియా, అవిసె వంటి విత్తనాలకు ఎక్కువ సమయం అవసరం లేదు. 20-30 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. నువ్వులు, గుమ్మడి, సన్ ఫ్లవర్ సీడ్స్ విత్తనాల్లాంటివి 4-6 గంటలు సోక్ చేసుకోవాలి. వాటిలో ఉండే చేదు తగ్గి, పోషకాలు బాగా అందుతాయి. జీడిపప్పు, నువ్వులు, గుమ్మడి, సన్ ఫ్లవర్ సీడ్స్....శరీరానికి సరిపడా కాల్షియం, పోషకాలు అందిస్తాయి.
ధాన్యాలు, పప్పుల విషయంలో నానబెట్టడం మరీ ముఖ్యం. బియ్యం కూడా అరగంట నుంచి 2 గంటలు నానబెట్టాలి. బ్రౌన్ రైస్‌కు అయితే ఇంకా మంచిది. ఓట్స్, క్వినోవా లాంటివి కచ్చితంగా 6-8 గంటలు నానబెట్టాలి, అప్పుడే వాటిని తినాలి. లేకపోతే కడుపు భారంగా అనిపిస్తుంది. పెసరపప్పు, శనగలు, రాజ్మా వంటి పప్పులను నానబెట్టడం తప్పనిసరి. ముఖ్యంగా రాజ్మా లాంటివి 10-12 గంటలు నానబెట్టకుండా వండితే జీర్ణ సమస్యలు రావచ్చు. నానబెట్టిన నీటిని పారబోసి వండితే కడుపులో గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.

