Beauty with Butter: ముఖానికి ఇలా వెన్న రాస్తే చర్మం మృదువుగా మారడమే కాదు, మెరిసే రంగు కూడా
Beauty with Butter: ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మార్చేందుకు బ్యూటీపార్లర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇందుకోసం వందల రూపాయలు ఖర్చుపెడతారు. అయితే ముఖానికి వెన్న రాయడం వల్ల కాంతివంతంగా మార్చుకోవచ్చని చెబుతున్నారు బ్యూటీషియన్లు.

ఇంట్లో ఉన్న వెన్నతోనే అందం
అందమైన ముఖం కావాలన్నది ప్రతి ఒక్కరి కల. ఇందుకోసం ఎన్నో రకాల కాస్మోటిక్ ఉత్పత్తులు వాడుతూ ఉంటారు. కానీ కొంతమందిలో చర్మం విపరీతంగా పొడిబారిపోతుంది. దీనివల్ల చర్మం అందంగా కనిపించదు. రంగు కూడా పేలవంగా మారుతుంది. దీనికి వెన్న అద్భుతంగా పనిచేస్తుంది. వెన్నలోని ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఎ చర్మాన్ని తేమగా మృదువుగా ఉంచుతాయి. దీన్ని ఎలా వాడాలో తెలుసుకోండి.
వెన్న, అరటిపండు
ప్రతి ఇంట్లో అరటి పండు ఉంటుంది. బాగా పండిన అరటి పండును ముక్కలుగా కోసి మిక్సీ జార్లో వేయండి. అలాగే కొద్దిగా వెన్న కూడా వేసి పేస్ట్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేయాలి. అరగంట పాటూ అలా వదిలేసి తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇది చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. మీరు తరచూ ఇలా అప్లై చేస్తే కొన్ని రోజుల్లోనే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
వెన్న, రోజ్ వాటర్
రోజ్ వాటర్ చాలా తక్కువ ధరకే లభిస్తుంది. దీనితో కొద్దిగా వెన్న కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం అందంగా మారుతుంది. ఈ కాంబినేషన్ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంటుంది. చర్మం తేమగా, హైడ్రేట్‌గా ఉంటే ముఖం కాంతివంతంగా, అందంగా కనిపిస్తుంది.
వెన్న, దోసకాయ
కీరా దోసకాయ ధరలు తక్కువగానే ఉంటాయి. దీన్ని వెన్నతో కలిపి ముఖానికి రాస్తే అద్భుతంగా పనిచేస్తుంది. కీరాదోసను ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసి, వెన్న కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇది చర్మం పొడిబారడం తగ్గి ముఖాన్ని కాంతివంతంగా మారేలా చేస్తుంది. చర్మం పొడి బారడాన్ని తగ్గిస్తుంది.
వెన్న, తేనె
తేనె, వెన్న… రెండింట్లో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. కొద్దిగా వెన్నలో తేనె కలిపి స్క్రబ్‌గా ముఖానికి ఉపయోగించితే ఎంతో మంచిది. తేనెకు బదులు పంచదార వాడిన మంచిదే. దీనిలోని పోషకాలు చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి సహాయపడతాయి.
రోజూ రాత్రి పడుకునే ముందు కేవలం వెన్న ఒక్కటి ముఖానికి రాసుకున్నా మంచిదే. వెన్నలో ఉండే పోషకాలు చర్మాన్ని మృదువుగా మార్చేస్తాయి.

