- Home
- Astrology
- Numerology: ఈ తేదీల్లో పుట్టినవారు మాంసం, ఆల్కహాల్ ముట్టుకుంటే రాహు కేతువుల చెడు ప్రభావం తప్పదు
Numerology: ఈ తేదీల్లో పుట్టినవారు మాంసం, ఆల్కహాల్ ముట్టుకుంటే రాహు కేతువుల చెడు ప్రభావం తప్పదు
Numerology: మీరు పుట్టిన తేదీని బట్టి గ్రహాల ప్రభావం ఆధారపడి ఉంటుంది. కొన్ని తేదీల్లో పుట్టినవారు కచ్చితంగా ఆల్కహాల్, మాంసానికి దూరంగా ఉండాలట. లేకుంటే కొన్ని గ్రహాలు చెడు ప్రభావాన్ని చూపిస్తాయని న్యూమరాలజీ చెబుతోంది.

పుట్టిన తేదీని బట్టి ఆహారపు అలవాట్లు
జ్యోతిష శాస్త్రంలో సంఖ్యా శాస్త్రం కూడా ఒకటి. దీని ప్రకారం మనం పుట్టిన తేదీ మన జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుందని అంటారు. జన్మతేదీ ఆధారంగా ఒక వ్యక్తి స్వభావం, ఆరోగ్యం, అదృష్టం వంటివి ఆధారపడి ఉంటాయి. అలాగే కొన్ని తేదీల్లో పుట్టినవారు మాంసాహారం, ఆల్కహాల్ సేవించడానికి దూరంగా ఉండాలని సంఖ్యా శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా శని, రాహు వంటి గ్రహాల ప్రభావం ఉన్నవారు ఈ అలవాట్లకు దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. ఏ తేదీల్లో పుట్టిన వారు ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలి? లేకుండా ఏ గ్రహానికి కోపం వస్తుందో తెలుసుకోండి.
వీరు మాంసానికి నో చెప్పాల్సిందే
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఒక నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినవారు సూర్య గ్రహ ప్రభావంలో ఉంటారు. వీరు శరీర శుద్ధి, క్రమశిక్షణ పాటించాలి. అప్పుడే జీవితంలో మంచి ఫలితాలు పొందుతారు. ఇక 7, 16, 25 తేదీల్లో పుట్టినవారిపై కేతు ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు మాంసాహారం, ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. వాటిని తీసుకుంటే వీరి జీవితంలో మానసిక అశాంతి, ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అంటారు. అలాగే 8, 17, 26 తేదీల్లో పుట్టినవారిపై శని ప్రభావం అధికంగా ఉంటుంది. శని కర్మ గ్రహం కావడంతో, తామసిక ఆహారం తీసుకుంటే పనుల్లో ఆలస్యం, ఆటంకాలు, అనవసర ఒత్తిడి పెరుగుతుందని జ్యోతిషుల అభిప్రాయం. అందుకే ఈ తేదీల్లో పుట్టినవారు సాధ్యమైనంత వరకు శాకాహారాన్ని అలవాటు చేసుకోవాలని సూచిస్తారు.
వీరు ఆల్కహాల్ తాగకూడదు
ప్రతి నెలలో 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినవారిపై చంద్ర గ్రహ ప్రభావం అధికంగా ఉంటుందని సంఖ్యాశాస్త్రం. చంద్రుడు మనసుకు, భావోద్వేగాలకు అధిపతి. ఈ తేదీల్లో పుట్టినవారు ఆల్కహాల్ తాగితే భావోద్వేగ అస్థిరత, ఆందోళన, కుటుంబ సమస్యలు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అలాగే 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినవారిపై గురు గ్రహ ప్రభావం అధికంగా ఉంటారు. గురువు జ్ఞానం, ధర్మానికి సూచిక కావడంతో, వీరు మాంసాహారం, ఆల్కహాల్ తీసుకుంటే అదృష్టం తగ్గుతుందని చెప్పుకుంటారు. ఈ కారణాల వల్లే ఈ తేదీల్లో పుట్టినవారికి మాంసాహారం, ఆల్కహాల్ వద్దని సూచనలు వస్తున్నాయి.
ఆల్కహాల్ హానికరం
సంఖ్యా శాస్త్రాల ఆధారంగా వచ్చిన విశ్వాసాలు ఇవన్నీ. వైద్య శాస్త్రపరంగా చూస్తే ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం. అలాగే అధికంగా మాంసాహారం తీసుకోవడం వల్ల కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సమతుల్యమైన ఆహారం, మంచి జీవనశైలి పాటించడం మాత్రం అందరికీ అవసరం. జ్యోతిష శాస్త్రం చెబుతున్నా, చెప్పకపోయినా మంచి అలవాట్లు జీవితాన్ని మెరుగుపరుస్తాయనే విషయం మాత్రం ఎప్పటికీ నిజమే.

