Microsoft Layoffs ఆరంభమేనా..? ఈ ఏడాది ఎన్ని సాప్ట్ వేర్ జాబ్స్ ఊడబోతున్నాయో తెలుసా?
మైక్రోసాఫ్ట్, ఇంటెల్, గూగుల్, అమెజాన్ వంటి ప్రముఖ టెక్ కంపెనీలు 2025లో వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఆర్థిక సవాళ్లు, ఏఐ వినియోగం, వ్యాపార ప్రాధాన్యతలలో మార్పులు వంటి అంశాలు ఉద్యోగ కోతలకు దారితీస్తున్నాయి.

సాప్ట్ వేర్లకు ఉద్యోగ భద్రతేది...
Microsoft Layoffs : సాప్ట్ వేర్ ఉద్యోగాలకు ఈతరం యువతలో మామూలు క్రేజ్ లేదు... ఇందుకు నిదర్శనం పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్న ఇంజనీర్ కాలేజీలే. చాలామంది సాప్ట్ వేర్ కలతోనే ఇంజనీరింగ్ చదువుతున్నారు... దీన్ని విద్యాసంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. అయితే ఇంజనీరింగ్ చేసి జాబ్ సాధించడం ఒకెత్తయితే... ఆ జాబ్ ను కాపాడుకోవడం మరో ఎత్తు. చిన్నచిన్న సంస్థలే కాదు టెక్ దిగ్గజాలు సైతం ఇటీవలకాలంలో భారీగా లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. తాజాగా మైక్రోసాప్ట్ సంస్థ ఇదేపని చేసింది… భారీ లేఆఫ్స్ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ లేఆప్స్ ప్రకటన సాప్ట్ వేర్ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.
అమెరికన్ టెక్ దిగ్గజం మైక్రోసాప్ట్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇలా భారతదేశంలో కూడా మైక్రోసాప్ట్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద సాప్ట్ వేర్ కంపనీల్లో ఒకటైన మైక్రోసాప్ట్ లో ప్రస్తుతం 2 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే ఈ సంస్థ వివిధ కారణాలతో ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది... దీంతో వేలాదిగా ఉద్యోగులకు ఇంటికి పంపిస్తోంది.
మైక్రోసాఫ్ట్ లో భారీగా ఉద్యోగుల తొలగింపు... ఎంతో తెలుసా?
ఈ ఏడాది ఇప్పటికే ఓసారి భారీ లేఆఫ్స్ ప్రకటించిన మైక్రోసాప్ట్ తాజాగా మరోసారి అదే చేస్తోంది. దాదాపు 9 వేల మందిని ఉద్యోగులకు తొలగించేందుకు ఈ టెక్ దిగ్గజం సిద్దమయ్యింది. ఇప్పటికే వీరికి లేఆఫ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ చర్యలద్వారా దాదాపు 4 శాతంమంది మైక్రోసాప్ట్ ఉద్యోగులు ప్రభావితం కానున్నారు.
గత మేలో 6 వేలమందిని తొలగించిన మైక్రోసాప్ట్ రెండునెలలు కూడా గడవకముందే మరోసారి లేఆఫ్స్ ప్రకటించడం సాప్ట్ వేర్ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందోనని టెకీలు భయపడిపోతున్నారు. ఇది కేవలం ఒక్క మైక్రోసాప్ట్ లోనే కాదు దాదాపు అన్ని కంపెనీల్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. జాబ్ సెక్యూరిటీ లేక టెకీలు తలలు పట్టుకుంటున్నారు.
లక్ష ఉద్యోగాలు ఊస్ట్?
2025లో ప్రపంచవ్యాప్తంగా సాప్ట్ వేర్ రంగం దాదాపు 1,00,000 ఉద్యోగాలను కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే టెక్ పరిశ్రమకు ఈ 2025 దారుణమైన సంవత్సరం అవుతుంది… సాప్ట్వేర్లకు పీడకలను మిగిలిస్తుంది.
ఆర్థిక సవాళ్లు, పునర్నిర్మాణ చర్యలు, ఖర్చులు తగ్గించుకోవడం వంటివి ఈ ఉద్యోగాల కోతకు ఓ కారణమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి రావడం ప్రధానకారణం. Google, Intel, Meta వంటి ప్రధాన టెక్ సంస్థలు AI బాట పట్టాయి... అందుకే తమ ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి.
intel layoff
Intel కూడా భారీగా లేఆఫ్స్ కు సిద్దమయ్యింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో గల ఇంటెల్ ప్రధాన కార్యాలయంలో ఈ జులైలో 107 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. జర్మన్ లోని ఆటోమోటివ్ చిప్ విభాగంలో కూడా ఉద్యోగులను తొలగిస్తోంది.
జులై మధ్యలో ఇంటెల్ లో మరిన్ని లేఆఫ్స్ ఉండనున్నాయని తెలుస్తోంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంటెల్ లో పనిచేసే ఉద్యోగులలో 20% మందిని ప్రభావితం అవుతారని అంచనా. వీరిలో ఉన్నత హోదాల్లోని ఉద్యోగులు, ఇంజనీర్లు, చిప్ డిజైన్, క్లౌడ్ ఆర్కిటెక్చర్ ఉన్నారు. చిప్‌ల తయారీ విభాగంలోని ఉద్యోగులు ఈ లేఆఫ్స్ తో ఎక్కువగా ప్రభావితమవుతారు.
IBM Layoff
పలు నివేదికల ప్రకారం IBM దాదాపు 8,000 మంది ఉద్యోగులను తొలగించింది... వీరిలో ఎక్కువమంది మానవ వనరుల విభాగానికి చెందినవారే. ఇక్కడ ఉద్యోగుల తొలగింపుకు AI ప్రధాన కారణం. గతంలో మనిషి చేసిన అనేక కార్యకలాపాలను ఇది నిర్వహిస్తోంది... కాబట్టి దీన్ని ఉపయోగించడం ప్రారంభించి ఉద్యోగులకు తొలగిస్తున్నాయి కంపెనీలు.
IBM ఈ నెల ప్రారంభంలో 200 HR స్థానాలను AI వ్యవస్థలతో భర్తీ చేసింది.. ఇవి డేటాను నిర్వహించడం, అంతర్గత పత్రాలను నిర్వహించడం, ఉద్యోగుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం వంటి పనులను చేయగలవు. మానవ ప్రమేయం అవసరం లేని పనులను నిర్వహించడానికి ఈ ఏఐని వాడుతున్నారు. IBM ఏఐని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నందున ఉద్యోగాలపై ప్రభావం వేగంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.
Amazon Layoff
గత నెలలో అమెజాన్ తన పుస్తకాల విభాగంలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కిండిల్, గుడ్‌రీడ్స్ విభాగాల్లో ఉద్యోగులు లేఆఫ్‌ల ద్వారా ప్రభావితమయ్యారు. 100 కంటే తక్కువ మంది ఉద్యోగులు ప్రభావితమైనప్పటికీ ఈ టెక్ దిగ్గజం చర్యలు దశలవారీగా లేఆఫ్ అమలకు ఆరంభంగా తెలస్తోంది. అమెజాన్ దాని కమ్యూనికేషన్స్ విభాగం, వండరీ పాడ్‌కాస్ట్, పరికరాలు, సేవల విభాగంతో సహా అనేక విభాగాలలో ఉద్యోగులకు తొలగించింది.
Google Layoff
ఉద్యోగులకు తొలగించిన మరో పెద్ద కంపెనీ Google. ఆండ్రాయిడ్, ఫిక్సెల్, క్రోమ్ వంటి ప్లాట్‌ఫారంలలో పనిచేసే వందలాది ఉద్యోగాలను ఈ సంస్థ తగ్గించింది. ఇది ఈ సంవత్సరం ప్రారంభంలో HR, క్లౌడ్ విభాగాలలో జరిగిన లేఆఫ్‌ల తర్వాత మరింత పెరిగాయి.
Infosys Layoff
ఇన్ఫోసిస్ కంపెనీ 240 మంది ఎంట్రీ లెవల్ ఉద్యోగులను తొలగించినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల ఈ రకమైన రెండు లేఆఫ్‌లు జరిగాయట. ఫిబ్రవరి 2025లో 300 కంటే ఎక్కువ మందిని తొలగించారు.
ఇటీవల డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్లు (DSE), సిస్టమ్ ఇంజనీర్లు (SE)గా ఆఫర్ లెటర్‌లను అందుకున్న తర్వాత చాలామంది దాదాపు రెండు సంవత్సరాలు వేచి ఉన్నారు. 2024 చివర్లో ఆన్‌బోర్డ్ చేయబడ్డారు.
టెక్ కంపెనీలు ఉద్యోగాలను ఎందుకు తొలగిస్తున్నాయి?
సాప్ట్ వేర్ రంగం 2023, 2024లో లేఆఫ్స్ పెరుగుదలను చూసింది... 2025లోనూ ఇవి తగ్గలేదు. ఇందుకు అనేక కారణాలున్నాయి. కానీ చాలా కంపనీల లేఆఫ్స్ కు AI ప్రధాన కారణమవుతోంది.
ఇక అధిక ద్రవ్యోల్బణం, క్షీణిస్తున్న వినియోగదారుల డిమాండ్, పెరుగుతున్న రుణ రేట్లు, తగ్గిన కంపెనీ పెట్టుబడితో సహా అనేక అంశాల కారణంగా కంపెనీలు తమ వ్యూహాన్ని మార్చుకుంటున్నాయి. బడ్జెట్ ను తగ్గించుకోవాల్సి వచ్చి లేఆఫ్స్ చేపడుతున్నాయి. ఇప్పట్లో ఈ ఉద్యోగాల కోత ఆగేలా లేదు.

