ఏంటీ TCSలో ఇంత దారుణమా.? రాజీనామా చేయమంటూ ఉద్యోగిపై ఒత్తిడి
TCS: ప్రముఖ మల్టీ నేషన్ కంపెనీ టీసీఎస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. ఈ కంపెనీలో ఉద్యోగం వస్తే లైఫ్ బిందాస్ అనుకుంటారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన అందరినీ షాక్‌కి గురయ్యేలా చేసింది.

రాజీనామా చేయలంటూ ఒత్తిడి
ముంబైకు చెందిన ఒక TCS ఉద్యోగి, అత్యవసర పరిస్థితుల్లో తండ్రిని ఐసియూలో చూసుకుంటూ ఉండగా కంపెనీ అతనిపై రాజీనామా చేయాలంటూ ఒత్తిడి తీసుకొచ్చింది. ఉద్యోగికి తగినన్ని సెలవులు ఉన్నప్పటికీ, అతడిని రాజీనామా చేయించారు. తర్వాత గ్రాట్యుటీ కూడా ఇవ్వలేదు. ఈ ఘటన గత సంవత్సరంలో జరిగింది, కానీ ఉద్యోగి తాజాగా దీనిని లేబర్ ఆఫీస్ దగ్గర ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
లేబర్ కమిషనర్ జోక్యం
ఉద్యోగి TCSలో మొత్తం ఏడు సంవత్సరాలు పనిచేశాడు. FITE (Forum for IT Employees) తెలిపిన వివరాల ప్రకారం.. “లీవ్ ఉన్నా కూడా కంపెనీ అతడిని రాజీనామా చేయించింది, గ్రాట్యుటీ కూడా నిరాకరించింది” అని తెలిపారు. ఉద్యోగి ఫిర్యాదు చేసిన వెంటనే ముంబై లేబర్ ఆఫీస్ TCS మేనేజ్‌మెంట్‌ని సమన్లు పంపింది. కంపెనీ ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకుందో వివరణ అడిగింది. అన్యాయ కార్మిక విధానాలు అమలు చేస్తున్నారంటూ TCSకి లేబర్ కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు.
పెద్ద కంపెనీలకూ ఇది హెచ్చరిక
లేబర్ కమిషనర్ ఆదేశాల ప్రకారం, TCS చివరకు ఉద్యోగికి ఏడు సంవత్సరాల పూర్తి గ్రాట్యుటీ చెల్లించింది. ఈ వ్యవహారంపై FITE స్పందిస్తూ.. “ఎలాంటి కంపెనీ అయినా, దాని పాలసీల పేరుతో ఉద్యోగుల హక్కులను హరించలేరు. బలవంతపు రాజీనామాలు, అన్యాయ తొలగింపులు, డ్యూస్ నిలిపివేయడం వంటి వాటిపై వారు చర్య తీసుకోవచ్చు.” అని లేబర్ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.
ఉద్యోగులకు కీలక సందేశం
ఈ వ్యవహారం ఉద్యోగులకు కీలక సందేశాన్ని చెబుతోంది. అడిగితేనే మన హక్కులను సాధించుకోగలం. పెద్ద కంపెనీలకైనా లేబర్ లాస్ తప్పవు. ఒకవేళ ఏదైనా అన్యాయం జరిగితే.. లేబర్ ఆఫీస్, లేబర్ కమిషనర్, IT ఉద్యోగుల సంఘాల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు.
టాటా డిజిటల్‌లో భారీగా ఉద్యోగాల కోత
ఇదిలా ఉంటే మరోవైపు టాటా డిజిటల్ భారీగా ఉద్యోగాలను తొలగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టాటా గ్రూప్‌కు చెందిన Tata Digital, తన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ Tata Neuలో 50% ఉద్యోగులను తగ్గించే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. Tata Neu, BigBasket, Croma వంటి కంపెనీల రెవెన్యూ, లాస్ డేటా క్లియర్‌గా బయటకు రాకపోవడంతో అసలు ఉద్యోగుల సంఖ్య, కోత ఎంత అన్న దానిపై క్లారిటీ లేదు. BigBasket, Tata 1mg, Croma వంటి ప్లాట్‌ఫాంలలో భారీ నష్టాలు వస్తున్నాయి. టాటా గ్రూప్ లాభాల కన్నా దీర్ఘకాల పెట్టుబడుల మోడల్‌ను అనుసరిస్తుంది. అందుకే 2025 ఆర్థిక సంవత్సరంలో మరో రూ. 4,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది.

