సోమవారం నాడు ఇలా చేస్తే.. వారం మొత్తం మీకు తిరుగే ఉండదు!
సోమవారం చాలా ప్రత్యేకమైంది. ఆ రోజు కొత్త వారం స్టార్ట్ కావడమే కాదు.. కొత్త అవకాశాలు, కొత్త లక్ష్యాలు కూడా మన ముందుంటాయి. సోమవారం నాడు లక్ష్యాలను నిర్దేశించుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చట. ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.

సోమవారం లక్ష్యాలను ఎందుకు నిర్ధేశించుకోవాలి?
సోమవారం కొత్త వారం ప్రారంభం. మీరు ఏం సాధించాలి అనుకుంటున్నారో నిర్ణయించుకోవడానికి ఇది గొప్ప సమయం. వారం ప్రారంభంలో మీ లక్ష్యాలను నిర్దేశించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. సోమవారం నాడు గోల్స్ సెట్ చేసుకోవడం ద్వారా మిగతా రోజుల్లో మీరు ఏ పని చేయాలి? దేనిపై దృష్టి పెట్టాలో మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు ఉత్సాహంగా ఉండటానికి, మంచి వ్యక్తిగా మారడానికి ఇది చక్కగా సహాయపడుతుంది.
ముఖ్యమైన పనులు గుర్తించవచ్చు!
వారం ప్రారంభంలో మీ లక్ష్యాలను నిర్దేశించుకోవడం వల్ల మీరు ఏం చేయాలో, ముఖ్యమైన పనులు ఏంటో మీరు ఈజీగా గుర్తించవచ్చు. అంతేకాదు మీరు పరధ్యానాలకు లోనుకాకుండా ఉంటారు. ఒత్తిడి తగ్గుతుంది. ప్రతిరోజూ మీకు ఏదో ఒక పని ఉంటుంది. ఇది మీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.
ప్రధాన లక్ష్యాలు..
ఈ వారం మీరు చాలా పనులు పూర్తి చేయాల్సి ఉంటే.. అందులో మూడు లేదా నాలుగు ప్రధాన లక్ష్యాలను ఎంచుకోండి. లక్ష్యాలు ఎక్కువగా ఉంటే.. భారంగా అనిపించవచ్చు. కాబట్టి చిన్న జాబితాను తయారు చేసుకోండి. దానికి అనుగుణంగా ముందుకు వెళ్లవచ్చు.
లక్ష్యాలను రాసుకోవడం ద్వారా..
మీ లక్ష్యాలను లేదా మీరు చేయాల్సిన పనులను రాసుకోవడం చాలా అవసరం. ఇందుకోసం మీరు చిన్న డైరీని లేదా మీ ఫోన్‌లో ప్లానర్‌ని ఉపయోగించవచ్చు. మీరు ఏ పని చేయాలో వాటిని రాసుకోండి. దానివల్ల అవి ఎంత ముఖ్యమో.. ఎప్పుడు చేయాలో మీకు స్పష్టత వస్తుంది. ఈ చిన్న ప్రయత్నం మీకు సరైన దిశను సూచిస్తుంది.
రోజుకో పని..
మీరు చేయాల్సిన అన్ని పనులను ప్రాధాన్యత ఆధారంగా రాసుకున్న తర్వాత.. ఒక్కో రోజును ఒక్కో పనికి కేటాయించండి. కొన్ని ఊహించని వాటి కోసం అదనపు సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నించండి. కొన్ని విషయాలు ప్రణాళిక ప్రకారం జరగకపోవచ్చు. కాబట్టి చిన్న చిన్న అసౌకర్యాలను సర్దుబాటు చేయడానికి అనువుగా మీ షెడ్యూల్‌ను రూపొందించండి.
ఆరోగ్యంగా ఉండడానికి..
పని ప్రణాళికలతో పాటు ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన కొన్నింటిని మీ షెడ్యూల్‌లో జోడించడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు వారానికి మూడు సార్లు వ్యాయామం చేయడం, రోజుకు 20 నిమిషాలు చదవడం, మీ గదిని శుభ్రం చేసుకోవడం వంటివి.
వారంతంలో ఇలా చేయండి
మీరు ఈ వారమంతా ఎలా పని చేశారో తనిఖీ చేయడానికి వారంతంలో కొన్ని నిమిషాలు కేటాయించండి. ఈ వారం మీరు మీ పనులను కరెక్ట్ గా చేశారా? ఏవైనా వదిలేశారా? ఏ పని బాగా చేశారు? వంటివి చెక్ చేసుకోవడం ద్వారా నెక్స్ట్ వీక్ మంచిగా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.