War: ఇరాన్ యుద్ధంతో అందరికీ నష్టం జరిగితే... ఆ దేశానికి మాత్రం భారీ లాభాలు
War: మధ్యప్రాచ్చంలో జరుగుతోన్న యుద్ధంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతోంది. కొన్ని దేశాలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. అయితే ఈ యుద్ధం కొన్ని దేశాలకు మాత్రం లాభాలను తెచ్చి పెడుతోంది. యుద్ధంతో లాభం ఏంటని ఆలోచిస్తున్నారా.?

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రభావం
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగినప్పటి నుంచి గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. చమురు సరఫరా మార్గాలు మూతపడుతుండడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. బ్యారెల్‌కు 100–115 డాలర్లకు పైగా ధరలు పెరగడంతో ఎనర్జీ మార్కెట్‌లో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితి కొంతమంది చమురు ఎగుమతి దేశాలకు లాభాన్ని తెచ్చి పెట్టింది.
రష్యాకు భారీ ఆర్థిక లాభాలు
ఈ పరిస్థితి నుంచి అత్యధిక లాభం పొందుతున్న దేశాల్లో రష్యా ఒకటి. చమురు, గ్యాస్ ధరలు పెరగడం వల్ల రష్యా ఎనర్జీ ఎగుమతుల ద్వారా అధిక ఆదాయం పొందుతోంది. ముఖ్యంగా భారత్, చైనా వంటి పెద్ద దేశాలు కూడా ఎక్కువ మొత్తంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ సరఫరా మార్గాలపై అనిశ్చితి ఉండటంతో ఈ మార్పు చోటుచేసుకుంది. దీనివల్ల రష్యా ఎనర్జీ ఆదాయం మరింత పెరిగింది. మరోవైపు ప్రపంచ దృష్టి కొంతవరకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నుంచి మళ్లడం కూడా రష్యాకు వ్యూహాత్మక లాభంగా మారింది.
అమెరికా రక్షణ కంపెనీలకు భారీ ఆర్డర్లు
యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్న అమెరికా కూడా కొన్ని రంగాల్లో లాభం పొందుతోంది. ముఖ్యంగా రక్షణ రంగానికి చెందిన కంపెనీలకు భారీ ఆర్డర్లు వస్తున్నాయి. యుద్ధం కారణంగా ఆయుధాలు, రక్షణ పరికరాలపై డిమాండ్ పెరిగింది. అలాగే అమెరికా నుంచి ఎగుమతి అయ్యే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG)కు కూడా డిమాండ్ పెరిగింది. యూరప్ దేశాలు రష్యా గ్యాస్‌కు ప్రత్యామ్నాయాలు వెతుకుతుండటంతో అమెరికా ఎనర్జీ కంపెనీల ఆదాయం పెరుగుతోంది.
ఇతర ఎనర్జీ ఎగుమతి దేశాలకు అవకాశాలు
మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతల వల్ల గల్ఫ్ ప్రాంతం నుంచి వెళ్లే సరఫరా మార్గాలపై అనిశ్చితి పెరిగింది. దీంతో ఇతర దేశాలు ఎనర్జీ సరఫరాదారులుగా ముందుకు వస్తున్నాయి. ఉదాహరణకు నార్వే యూరప్‌కు గ్యాస్ ఎగుమతులను పెంచింది. అలాగే కెనడా కూడా చమురు, గ్యాస్ ఎగుమతుల్లో పెరుగుదల చూసింది. మరోవైపు బ్రెజిల్, గుయానా వంటి దేశాలు కొత్తగా విశ్వసనీయ చమురు సరఫరాదారులుగా గుర్తింపు పొందుతున్నాయి.
యుద్ధం వల్ల లాభాలు ఎందుకు.?
ఈ యుద్ధ పరిస్థితుల్లో కొన్ని దేశాలు లాభపడటానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. చమురు ధరలు భారీగా పెరగడం. ఎనర్జీ సరఫరా మార్గాలు మారడం. ఆయుధాలు, రక్షణ పరికరాలపై పెరిగిన డిమాండ్. ఈ మూడు అంశాలు కలిసి ఎనర్జీ ఎగుమతి దేశాలు, రక్షణ రంగ కంపెనీలకు భారీ ఆదాయాన్ని తెస్తున్నాయి.

