- Home
- International
- Viral News: ఉద్యోగుల ఖాతాల్లోకి కోట్ల రూపాయలు డిపాజిట్.. నువ్వు బాస్ కాదు సామీ దేవుడివి
Viral News: ఉద్యోగుల ఖాతాల్లోకి కోట్ల రూపాయలు డిపాజిట్.. నువ్వు బాస్ కాదు సామీ దేవుడివి
Viral News: కంపెనీలు పండగలకు బోనస్‌లు ఇస్తుండడం సర్వసాధారణం. బోనస్ అంటే మహా అయితే ఓ పది వేలు ఇంకా ఎక్కువంటే ఒక నెల జీతం ఇస్తారు. అయితే ఓ బాస్ మాత్రం ఉద్యోగులకు కోట్లలో బోనస్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

ఉద్యోగులకు వరం
సాధారణంగా ఏదైనా కంపెనీని అమ్మితే ఆ లాభం మొత్తం యజమాని తీసుకుంటాడు. అప్పటి వరకు పనిచేసిన ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. అయితే అమెరికాలో ఒక కంపెనీ సీఈవో ఈ సంప్రదాయానికి పూర్తిగా భిన్నంగా ఆలోచించాడు. లూసియానాకు చెందిన ఫైబర్‌బాండ్ (Fiberbond) కంపెనీ సీఈవో గ్రాహం వాకర్ తన వ్యాపారం అమ్మిన తరువాత ఉద్యోగులందరినీ కోటీశ్వరులుగా మార్చాడు. అతడి ఉదారత చూసి “ఇలాంటి యజమాని అందరికీ ఉండాలి” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కంపెనీ అమ్మకం… ఉద్యోగులకు రూ.2,000 కోట్ల పంపకం
ఫైబర్‌బాండ్ కంపెనీని అమెరికా దిగ్గజ సంస్థ ఈటన్ (Eaton) కొనుగోలు చేసింది. ఈ డీల్ ద్వారా వచ్చిన మొత్తంలో పెద్ద భాగాన్ని గ్రాహం వాకర్ తన 540 మంది ఉద్యోగులకు పంచాడు. మొత్తంగా దాదాపు రూ.2,000 కోట్లు ఉద్యోగుల ఖాతాల్లోకి వెళ్లాయి. సగటున ఒక్కో ఉద్యోగికి రూ.3.7 కోట్లు అందాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… ఉద్యోగుల దగ్గర కంపెనీ షేర్లు లేవు. ఎలాంటి ఈక్విటీ హక్కులు లేవు. కేవలం వారి నిబద్ధతకు గుర్తింపుగా ఈ డబ్బు ఇచ్చారు.
ఉద్యోగుల కోసం ముందే షరతు
వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం, కంపెనీ అమ్మకానికి ముందు గ్రాహం వాకర్ ఒక స్పష్టమైన షరతు పెట్టాడు. కంపెనీ ఎదుగుదల వెనుక కష్టపడిన ఉద్యోగులకు అమ్మకం లాభంలో తప్పకుండా భాగం ఇవ్వాలని ఆయన కోరాడు. ఈ మొత్తాన్ని ఒకేసారి ఇవ్వకుండా ఐదు సంవత్సరాల వ్యవధిలో విడతలుగా చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు సంస్థలో కొనసాగితేనే ఈ బోనస్ లభిస్తుంది. 2025 జూన్ నుంచే మొదటి విడత ఉద్యోగులకు అందడం మొదలైంది.
ఒక్క నిర్ణయంతో మారిన వందల కుటుంబాల జీవితం
ఈ నిర్ణయం వందల కుటుంబాల జీవితాలను ఒక్కసారిగా మార్చేసింది. 1995 నుంచి ఫైబర్‌బాండ్‌లో పనిచేస్తున్న ఒక మహిళ జీవితాన్ని ఈ నిర్ణయం మార్చేసింది. ఆమె ఉద్యోగం మొదలుపెట్టినప్పుడు గంటకు కేవలం 5 డాలర్లు జీతం మాత్రమే ఉండేది. ఈ బోనస్‌తో ఆమె ఇంటి లోన్ పూర్తిగా తీర్చేసింది. అంతేకాదు, తన సొంతంగా ఒక దుస్తుల బొటిక్ కూడా ప్రారంభించింది. ఇతర ఉద్యోగులు తమ పిల్లల చదువుల ఖర్చులు చెల్లించారు. కొందరు రిటైర్మెంట్ భద్రత పెంచుకున్నారు. ఇంకొందరు తమ కలల కార్లు కొనుగోలు చేశారు. అయితే ఉద్యోగులు డబ్బులు ఖర్చు చేస్తుండడంపై వాకర్‌ను ప్రశ్నిస్తే.. “అది వారి డబ్బు. ఎలా ఉపయోగించుకోవాలన్నది వారి ఇష్టం.” అని నవ్వుతు బదులిచ్చాడు.
సంక్షోభాల నుంచి విజయ శిఖరాల వరకు ఫైబర్‌బాండ్ ప్రయాణం
ఫైబర్‌బాండ్ విజయం ఒక్కరోజులో రాలేదు. ఈ కంపెనీని 1982లో క్లాడ్ వాకర్ ప్రారంభించాడు. 1998లో ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో కంపెనీ పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. అయినా ఉద్యోగుల జీతాలు ఆపలేదు. డాట్‌కామ్ బబుల్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. కొంతమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆ తర్వాత గ్రాహం వాకర్ తన సోదరుడితో కలిసి కంపెనీ బాధ్యతలు చేపట్టాడు. పాత అప్పులు తీర్చాడు. వ్యాపారాన్ని మళ్లీ నిలబెట్టాడు. ఫలితంగా అమ్మకాలు 400 శాతం పెరిగాయి. చివరకు కంపెనీ అమ్మిన సమయంలో, ఈ విజయానికి కారణమైన ఉద్యోగులు ఖాళీ చేతులతో వెళ్లకుండా చూశాడు. ఇదే గ్రాహం వాకర్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది.

