అమెరికాలో మరో తెలుగు రాష్ట్రం.. డల్లాస్, డల్లాస్పురంగా ఎలా మారిందో తెలుసా.?
USA: అమెరికాలోని డల్లాస్ నగరం తెలుగు ప్రజలకు ప్రధాన కేంద్రంగా మారింది. తెలుగు రెస్టారెంట్లు, దేవాలయాలు, తెలుగు సంఘాలు.. ఇలా చూస్తే అక్కడ మరో తెలుగు రాష్ట్రం ఏర్పడిందా అనిపిస్తుంది. డల్లాస్‌లో తెలుగువారు ఇంతలా పెరగడానికి కారణం ఏంటంటే.?

అమెరికాలోనే అత్యధిక తెలుగు మాట్లాడేవారు ఉన్న నగరంగా డల్లాస్
అమెరికాలో తెలుగు మాట్లాడేవారు న్యూజెర్సీ, కాలిఫోర్నియా, న్యూయార్క్, అట్లాంటా, చికాగో వంటి ప్రాంతాల్లోనూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే డల్లాస్-ఫోర్ట్ వర్త్ మెట్రో ప్రాంతం మాత్రం తెలుగు ప్రజల జనాభాలో అగ్రస్థానంలో నిలుస్తోంది. ఈ నగరాన్ని ఫన్నీగా డల్లాస్‌పురం అని పిలుచుకుంటారు. దీనిబట్టే ఇక్కడ ఎంతమంతి తెలుగు వారు ఉంటారో అర్థం చేసుకోవచ్చు. 2020–2024 అమెరికన్ కమ్యూనిటీ సర్వే (ACS) గణాంకాల ఆధారంగా రూపొందించిన ఒక విశ్లేషణ ప్రకారం.. డల్లాస్-ఫోర్ట్ వర్త్ ప్రాంతంలో సుమారు 50,359 మంది ఇంట్లో తెలుగులో మాట్లాడుతున్నారు.
న్యూయార్క్ మెట్రో ప్రాంతంలో ఈ సంఖ్య 41,864గా ఉంది. వాషింగ్టన్ ప్రాంతంలో 26,568 మంది తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. అంటే అమెరికాలోని ప్రధాన నగరాలతో పోలిస్తే డల్లాస్‌లో తెలుగు మాట్లాడే కుటుంబాల సంఖ్య గణనీయంగా ఎక్కువగా ఉంది. మరో విశేషం ఏమిటంటే.. అక్కడికి వెళ్లిన తెలుగు కుటుంబాలు ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా ప్లానో, ఇర్వింగ్, ఫ్రిస్కో, కాపెల్ వంటి శివారు ప్రాంతాల్లోనూ స్థిరపడుతున్నాయి. దీంతో డల్లాస్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ తెలుగు సంస్కృతి విస్తరిస్తోంది.
ఐటీ ఉద్యోగాలు.. డల్లాస్ వైపు తెలుగు యువత మొగ్గు
డల్లాస్‌లో తెలుగువారి సంఖ్య పెరగడానికి ప్రధాన కారణాల్లో ఐటీ రంగం ఒకటి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అమెరికాకు వెళ్లే విద్యార్థుల్లో చాలామంది కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్ వంటి కోర్సులను ఎంచుకుంటున్నారు. అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించి అక్కడే స్థిరపడుతున్నారు.
డల్లాస్-ఫోర్ట్ వర్త్ ప్రాంతంలో టెక్నాలజీతో పాటు బ్యాంకింగ్, ఫైనాన్స్, టెలికమ్యూనికేషన్స్, హెల్త్‌కేర్, లాజిస్టిక్స్ రంగాల్లోనూ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. పలు అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రాంతంలో తమ కార్యాలయాలు, కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా ఒకే కంపెనీలో పనిచేసే భారతీయులు తమ స్నేహితులు, పరిచయస్తులకు ఉద్యోగ సమాచారం అందించడం, ఉద్యోగ మార్పుల సమయంలో సహకరించడం వంటివి చేస్తుంటారు. ఈ పరిచయాలు కొత్తగా అమెరికాకు వెళ్లేవారికి ఉపయోగపడుతున్నాయి. అందుకే చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం డల్లాస్‌ను పరిశీలించే తెలుగు యువత సంఖ్య పెరుగుతోంది. ఈ వలసల ప్రభావంతో ఒకప్పుడు చదువు లేదా ఉద్యోగం కోసం ఒంటరిగా వెళ్లిన యువత.. ఇప్పుడు భార్యాభర్తలు, పిల్లలతో కలిసి అక్కడే స్థిరపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
న్యూయార్క్, కాలిఫోర్నియాతో పోలిస్తే జీవన వ్యయం తక్కువ
డల్లాస్ వైపు తెలుగు కుటుంబాలు మొగ్గు చూపడానికి మరో కారణం జీవన వ్యయం. అమెరికాలో న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో, శాన్‌జోస్ వంటి ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు, కొనుగోలు ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో డల్లాస్ పరిసర ప్రాంతాల్లో కుటుంబ అవసరాలకు సరిపోయే ఇళ్లు, పెద్ద అపార్ట్మెంట్లు, స్వతంత్ర ఇళ్లు వంటి ఎంపికలు అందుబాటులో ఉండటం చాలామందిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా చిన్న పిల్లలున్న కుటుంబాలు ఉద్యోగానికి దగ్గరగా ఉండటంతో పాటు మంచి నివాస ప్రాంతం, పాఠశాలలు, పార్కులు, సూపర్ మార్కెట్లు వంటి సౌకర్యాలను కూడా పరిశీలిస్తాయి. ప్లానో, ఫ్రిస్కో, ఇర్వింగ్, కాపెల్ వంటి ప్రాంతాలు ఈ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందాయి. అంతేకాదు.. టెక్సాస్‌లో వ్యక్తిగత ఆదాయంపై రాష్ట్ర ఆదాయపు పన్ను (State Personal Income Tax) లేదు.
దీంతో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పన్నుల విషయంలోనూ కొంత ప్రయోజనం ఉంటుందని భావించే ఉద్యోగులు డల్లాస్‌ను ఎంచుకుంటున్నారు. అయితే ఆస్తి పన్నులు, ఇంటి బీమా, ఆరోగ్య బీమా, రవాణా ఖర్చులు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. డల్లాస్‌లో జీవితం అన్ని విషయాల్లోనూ చౌకగా ఉంటుందని చెప్పలేం. అమెరికా జనాభా లెక్కల విభాగం ప్రకారం 2020 ఏప్రిల్ నుంచి 2025 మధ్య డల్లాస్-ఫోర్ట్ వర్త్ మెట్రో ప్రాంత జనాభా 11 శాతం పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వలస వస్తున్నారు. ఈ అభివృద్ధి కొత్త ఉద్యోగాలు, నివాస ప్రాంతాలు, వ్యాపార అవకాశాలకు దోహదం చేస్తోంది.
తెలుగు సంఘాలు, దేవాలయాలు, పండుగలు
కొత్త దేశానికి వెళ్లినప్పుడు ఎదురయ్యే అతిపెద్ద సమస్య భాష, సంస్కృతి, ఆహారపు అలవాట్లకు అలవాటు పడటం. ముఖ్యంగా కుటుంబంతో అమెరికాకు వెళ్లేవారికి పిల్లల చదువు, రోజువారీ అవసరాలు, కొత్త వాతావరణంలో కలిసిపోవడం వంటి అంశాలు సవాలుగా ఉంటాయి. ఇలాంటి సమయంలో ఇప్పటికే అక్కడ స్థిరపడిన తెలుగు కుటుంబాలు ఎంతో సహాయకరంగా ఉంటాయి. డల్లాస్‌లో తెలుగు సంఘాలు ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 1986లో ఏర్పాటైన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (TANTEX) వంటి సంస్థలు సంక్రాంతి, ఉగాది, దీపావళి వేడుకలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. తెలుగు సాహిత్యం, సంగీతం, కళలు, సామాజిక సేవకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాయి.
తెలంగాణకు చెందినవారి కోసం బతుకమ్మ, బోనాలు వంటి పండుగలు నిర్వహించే సంస్థలు కూడా ఉన్నాయి. డల్లాస్ తెలుగు అలై బలై సంఘం (D-TABS) దసరా, సంక్రాంతి, బోనాలు వంటి వేడుకల ద్వారా తెలుగు కుటుంబాలను ఒకచోట చేర్చుతోంది. మరోవైపు దేవాలయాలు, తెలుగు భాషా తరగతులు, క్రికెట్ క్లబ్‌లు, సాంస్కృతిక సంస్థలు కూడా తెలుగు ప్రజల మధ్య అనుబంధాన్ని పెంచుతున్నాయి.
డల్లాస్‌ను శాశ్వత నివాసంగా ఎంచుకుంటున్న కుటుంబాలు
డల్లాస్‌లో తెలుగువారి సంఖ్య పెరగడానికి విద్య కూడా ఒక ముఖ్యమైన కారణం. అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లే తెలుగు విద్యార్థులు చదువు పూర్తయ్యాక ఉద్యోగాలు సంపాదించి అక్కడే స్థిరపడుతున్నారు. కొందరు మొదట ఇతర రాష్ట్రాల్లో చదివినా, ఉద్యోగ అవకాశాల కోసం డల్లాస్‌కు మారుతున్నారు. మరికొందరు అక్కడ స్థిరపడిన బంధువులు, స్నేహితుల సలహాలతో ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు.
డల్లాస్ పరిసరాల్లో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్ (UT Dallas), యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ (UNT), యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అర్లింగ్టన్ (UT Arlington) వంటి విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో వివిధ దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు చదువుతున్నారు. తెలుగు విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో ఉండటంతో కొత్తగా వెళ్లేవారికి పరిచయాలు ఏర్పరుచుకోవడం సులభమవుతోంది.
డల్లాస్.. అమెరికాలో మరో తెలుగు రాష్ట్రం
మొత్తంగా చూస్తే డల్లాస్‌లో తెలుగువారి సంఖ్య పెరగడానికి ఒక్క కారణమే లేదు. ఐటీ, ఫైనాన్స్ రంగాల్లో ఉద్యోగాలు, ఉన్నత విద్య, ఇతర ప్రధాన అమెరికా నగరాలతో పోలిస్తే నివాసానికి ఉన్న అవకాశాలు, తెలుగు సంఘాల సహకారం, ఇప్పటికే స్థిరపడిన బంధువులు, స్నేహితుల పరిచయాలు.. ఇవన్నీ కలిసి డల్లాస్‌ను తెలుగు ప్రజలకు ఇష్టమైన గమ్యస్థానంగా మార్చాయి.
అక్కడ తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా ఉండటంతో కొత్తగా వెళ్లేవారికి సొంత ఊరిలో ఉన్న అనుభూతి కలుగుతోంది. పండుగలు, సంప్రదాయాలు, తెలుగు భోజనం, సినిమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ అందుబాటులో ఉంటున్నాయి. అందుకే అమెరికాలో స్థిరపడాలనుకునే తెలుగు కుటుంబాల చర్చల్లో డల్లాస్ పేరు తరచుగా వినిపిస్తోంది. సరదాగా చెప్పాలంటే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తర్వాత అమెరికాలో తెలుగువారికి మరో అడ్డాగా డల్లాస్ మారిపోయిందనడంలో సందేహం లేదు.











