- Home
- Entertainment
- ఈ జీవితం కళకే అంకితం.. అవమానాలన్నింటికీ డ్యాన్స్‌తోనే సమాధానం చెప్పిన మాధురి రాథోడ్
ఈ జీవితం కళకే అంకితం.. అవమానాలన్నింటికీ డ్యాన్స్‌తోనే సమాధానం చెప్పిన మాధురి రాథోడ్
Folk Song: అవమానాలు, విమర్శలను అధిగమించి తనకిష్టమైన డ్యాన్స్‌తోనే సమాధానం చెబుతోంది తెలంగాణ ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్. వ్యక్తిగత జీవితంలో ఎదురైన వివాదాల తర్వాత తాజాగా 'భామ సుందరా' పాటతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

వ్యక్తిగత జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు.. ఆత్మహత్యాయత్నంతో కలకలం
తెలంగాణ ఫోక్ డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మాధురి రాథోడ్ ఇటీవల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదంతో వార్తల్లో నిలిచారు. మరో ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయితో ఆమెకు ఉన్న సంబంధం చర్చనీయాంశంగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈశ్వర్ సాయి తనను మోసం చేశారని మాధురి ఆరోపించారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఒక గదిలో ఉండగా ఈశ్వర్ సాయి భార్య గుర్తించిన ఘటన కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ వ్యవహారంపై మాధురి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ తనకు న్యాయం జరగడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఈశ్వర్ సాయిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకునేందుకు ప్రయత్నించగా.. కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి ఆమెను కాపాడినట్లు సమాచారం. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ వివాదానికి సంబంధించి ఇరువైపుల వాదనలు, పోలీసుల దర్యాప్తు అంశాలు వేరుగా ఉన్నాయి.
బాధను దిగమింగి మళ్లీ కళ వైపు.. డ్యాన్స్‌తోనే రీ ఎంట్రీ
వ్యక్తిగత జీవితంలో ఎదురైన పరిణామాలు ఒకవైపు.. సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు మరోవైపు.. ఇవన్నీ మాధురి జీవితంలో తీవ్ర ప్రభావం చూపిన అంశాలుగా నిలిచాయి. అయినప్పటికీ ఆమె తనకు గుర్తింపు తెచ్చిన కళను వదులుకోలేదు. తన జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా డ్యాన్స్‌పై ఉన్న ఇష్టాన్ని మాత్రం కొనసాగించింది. ఎందుకంటే మాధురికి డ్యాన్స్ కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు. అదే ఆమెకు గుర్తింపు, అదే ఆమె ప్రపంచం. ఎన్నో పాటలకు తనదైన శైలిలో నృత్యం చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఆమె.. ఇప్పుడు మరోసారి తన ప్రతిభను చాటుకుంటోంది. విమర్శలకు ప్రతిస్పందించడానికి మాటల యుద్ధం చేయకుండా.. తన కళతోనే సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తోంది. తాజాగా విడుదలైన 'భామ సుందరా' పాట ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'భామ సుందరా'.. మాధురి డ్యాన్స్‌కు ఫిదా
మాధురి రాథోడ్ నటించిన 'భామ సుందరా' పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నాలుగు వారాల క్రితం విడుదలైన ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటివరకు ఈ పాటను 21,48,1924 మంది వీక్షించారు. ముఖ్యంగా ఇందులో మాధురి చేసిన డ్యాన్స్, ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటలో మాధురి ఊరూరూ తిరుగుతూ ప్రదర్శనలు ఇచ్చే ఒక డ్యాన్సర్ పాత్రలో కనిపిస్తుంది. గ్రామీణ వాతావరణం, జానపద కళాకారుల జీవనశైలి నేపథ్యంలో పాటను రూపొందించారు. పాటలోని కొరియోగ్రఫీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అయితే ఈ పాటలో కేవలం డ్యాన్స్ మాత్రమే కాదు.. ఒక కళాకారిణి జీవితంలో ఎదురయ్యే అవమానం, ఆ తర్వాత ఆమె తిరిగి నిలబడే తీరు కూడా చూపించారు. ముఖ్యంగా గజ్జె చుట్టూ అల్లుకున్న సన్నివేశం పాటకు భావోద్వేగాన్ని జోడించింది.
అవమానించిన చోటే తిరిగి నిలబడి..
ఈ పాటలో ఒక సన్నివేశం ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ఊరూరూ తిరుగుతూ డ్యాన్స్ చేసే మాధురి.. ఒక ప్రదర్శనలో భాగంగా అబ్బాయికి దగ్గరవుతుంది. ఆ సమయంలో అతడిని గట్టిగా హత్తుకుంటుంది. దీంతో అక్కడున్న వారంతా ఆమెను చూసి ఎగతాళి చేస్తారు. ఒక్కసారిగా అక్కడి పరిస్థితి మారిపోవడంతో మాధురి ఉలిక్కిపడుతుంది. ఆ అబ్బాయిని పక్కకు తోసి అక్కడి నుంచి పరుగులు తీస్తుంది.
తనకు జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ గుక్కపెట్టి ఏడుస్తుంది. కానీ ఆ బాధలోనే ఉండిపోకుండా కొద్దిసేపటికే తనను తాను సముదాయించుకుంటుంది. కిందపడిపోయిన గజ్జెను తీసుకుని మళ్లీ తన కాలికి కట్టుకుంటుంది. ఆ తర్వాత మళ్లీ అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది. తనను ఎగతాళి చేసిన వారందరి ముందు తన ప్రతిభను నిరూపించుకుంటుంది.
చివర్లో మాధురి డ్యాన్స్ చేస్తూ కిందపడినప్పుడు వెనుక నాటరాజ స్వామి ప్రతిబింబం కనిపిస్తుంది. ఈ సన్నివేశం ద్వారా ఆమె జీవితం కళకే అంకితమనే భావనను దర్శకుడు చూపించినట్లు అనిపిస్తుంది. అవమానాలు ఎదురైనా కళాకారిణిగా తన ప్రయాణాన్ని ఆపకూడదనే సందేశం ఈ పాటలో అంతర్లీనంగా కనిపిస్తుంది.
మాటలతో కాదు.. కళతోనే సమాధానం.. మాధురికి నెటిజన్ల సపోర్ట్
ఈ పాట విడుదలైన తర్వాత మాధురి రాథోడ్‌కు సోషల్ మీడియాలో మద్ధతు పెరుగుతోంది. ముఖ్యంగా పాటలోని సన్నివేశాలను ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలతో పోలుస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తనకు జరిగిన అవమానాలకు డ్యాన్స్ రూపంలో సమాధానం చెప్పిందంటూ ప్రశంసిస్తున్నారు. ఒక నెటిజన్ స్పందిస్తూ.. “ఏ చోట మోసిన నిందను.. అదే చోట అంతం చేశావు. నీ కళతోనే ఖండించావు మాధురి” అంటూ కామెంట్ చేశారు.
మరో నెటిజన్.. “పాటతోనే ఎదిగిన నువ్వు.. పాటతోనే నవ్వులపాలైన నువ్వు.. పాటతోనే సమాధానం చెప్పినవే నా చెల్లెలా. గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్” అంటూ మద్ధతు తెలిపారు. ఇంకొందరు “నీ బాధను ఈ పాట రూపంలో చెప్పావు”, “ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి” అంటూ స్పందిస్తున్నారు.
మొత్తానికి మాధురి రాథోడ్ ప్రయాణం ఒక విషయం గుర్తుచేస్తోంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి అవమానం మన ప్రయాణానికి ముగింపు కాదు. కొన్నిసార్లు అదే మనలోని పట్టుదలను బయటకు తీసుకొస్తుంది. వ్యక్తిగత జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తనకిష్టమైన కళను కొనసాగిస్తూ ప్రేక్షకుల ముందుకు రావడం మాధురి విషయంలో ప్రత్యేకంగా కనిపిస్తోంది. గజ్జె కిందపడితే మళ్లీ కట్టుకోవచ్చు.. అడుగులు తడబడితే తిరిగి వేయొచ్చు. కానీ మనలోని కళపై నమ్మకం కోల్పోకూడదనే సందేశాన్ని 'భామ సుందరా' పాట అందిస్తోంది. తన జీవితాన్ని కళకే అంకితం చేసిన మాధురి.. తన డ్యాన్స్‌తోనే మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.











