అమెరికాలో ఓట్లను ఎలా లెక్కిస్తారో తెలుసా.? బ్యాలెట్ పేపర్ అయినా అంత వేగం ఎలా.?
US Midterm Elections Counting: అమెరికాలో బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్ జరుగుతుంది. అయినా ఫలితాలు త్వరగా వెల్లడవుతున్నాయి. ఇంత వేగం ఎలా సాధ్యమని డౌట్ రావడం ఖాయం. అసలు ఈ ప్రక్రియ ఎలా సాగుతుందో తెలుసుకుందాం.

బ్యాలెట్ పేపర్లతోనే ఓటింగ్.. లెక్కింపునకు ఆధునిక యంత్రాలు
అమెరికాలో ఎన్నికల సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో ఓటర్లు పేపర్ బ్యాలెట్ల ద్వారానే తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయితే ఈ బ్యాలెట్ పత్రాలను ఒక్కొక్కటిగా చేతితో లెక్కించే విధానం అక్కడ ప్రధానంగా అమల్లో లేదు. ఓటింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఎలక్ట్రానిక్ స్కానింగ్ యంత్రాలను ఉపయోగిస్తారు.
బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల పేర్లు ఉంటాయి. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థి పేరు పక్కన ఉన్న బాక్సులో గుర్తు పెడతారు. అనంతరం ఆ పత్రాన్ని స్కానింగ్ యంత్రంలో వేస్తారు. యంత్రం బ్యాలెట్‌పై ఉన్న గుర్తును గుర్తించి, సంబంధిత అభ్యర్థికి వచ్చిన ఓట్ల సంఖ్యలో కలుపుతుంది. ఈ విధంగా పెద్ద సంఖ్యలో బ్యాలెట్లను తక్కువ సమయంలోనే ప్రాసెస్ చేయవచ్చు.
గంటల్లో వేలాది బ్యాలెట్ల పరిశీలన.. అసలు పత్రాలూ భద్రం
అమెరికాలోని పెద్ద పోలింగ్ కేంద్రాల్లో అధిక సామర్థ్యం కలిగిన స్కానింగ్ యంత్రాలను ఏర్పాటు చేస్తారు. ఇవి గంటకు వేల సంఖ్యలో బ్యాలెట్ పత్రాలను చదివి ఓట్ల వివరాలను నమోదు చేయగలవు. దీంతో లక్షలాది ఓట్లను కూడా తక్కువ సమయంలోనే లెక్కించే అవకాశం ఉంటుంది. అయితే యంత్రాల ద్వారా ఓట్లు లెక్కించినంత మాత్రాన అసలు బ్యాలెట్ పత్రాలను తొలగించరు. ఎన్నికల అధికారులు వాటిని భద్రపరుస్తారు. ఎలక్ట్రానిక్ లెక్కింపులో ఏదైనా అనుమానం వచ్చినా, అభ్యర్థుల మధ్య ఓట్ల తేడాపై వివాదం తలెత్తినా అసలు పత్రాలను ఆధారంగా చేసుకుని మళ్లీ చేతితో లెక్కించే అవకాశం ఉంటుంది. అంటే సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా లెక్కింపు చేపడుతూనే, అవసరమైనప్పుడు పేపర్ బ్యాలెట్ల ద్వారా ఫలితాలను ధ్రువీకరించవచ్చు.
ముందస్తు ఓటింగ్‌తో తగ్గుతున్న పోలింగ్ రోజు భారం
అమెరికా ఎన్నికల్లో మరో ప్రత్యేకత ముందస్తు ఓటింగ్ విధానం. ఎన్నికల రోజు మాత్రమే కాకుండా అంతకుముందే ఓటు వేసే అవకాశం కూడా అక్కడి ఓటర్లకు ఉంటుంది. ఇందుకోసం నిర్దేశించిన కేంద్రాలకు వెళ్లి ఓటు వేయవచ్చు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా తమ ఓటును పంపించవచ్చు. ఈ సదుపాయం 47 రాష్ట్రాలతో పాటు వాషింగ్టన్ డీసీలోనూ అందుబాటులో ఉంది. తాజా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో 5.7 కోట్ల మందికి పైగా ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ముందస్తుగా వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను పరిశీలించేందుకు 43 రాష్ట్రాల్లో ఎన్నికల అధికారులకు అనుమతి ఉంది. ఈ ప్రక్రియలో ఓటరు వివరాలు, సంతకం తదితర అంశాలను ముందుగానే తనిఖీ చేస్తారు. అనంతరం బ్యాలెట్లను స్కానింగ్‌కు సిద్ధం చేసి ఉంచుతారు. కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ రోజుకు ముందే వాటిని స్కాన్ చేసే వెసులుబాటు కూడా ఉంది. అయితే ఓటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఫలితాలను మాత్రం బయటకు వెల్లడించరు. ఇలా ముందస్తు ఏర్పాట్లు చేయడం వల్ల పోలింగ్ ముగిసిన తర్వాత లెక్కింపు వేగంగా సాగుతుంది.
అధికారిక ఫలితాల కంటే ముందే విజేతల పేర్లు ఎలా తెలుస్తాయి.?
అమెరికా ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన వెంటనే మీడియా సంస్థలు విజేతల పేర్లను ప్రకటించడం వెనుక ప్రత్యేకమైన విశ్లేషణ ఉంటుంది. కొన్ని గంటల్లోనే ఎవరు గెలిచే అవకాశం ఉందో మీడియా సంస్థలు అంచనా వేస్తాయి. ఈ విషయంలో అసోసియేటెడ్ ప్రెస్ (AP)కు సుదీర్ఘ అనుభవం ఉంది. 1848 నుంచి ఆ సంస్థ అమెరికా ఎన్నికల ఫలితాలను ప్రచురిస్తోంది. ఇతర మీడియా సంస్థలు కూడా పోలింగ్ కేంద్రాల నుంచి అందిన ఓట్ల వివరాలను సేకరించి, వాటిని విశ్లేషిస్తాయి.
ఉదాహరణకు ఒక అభ్యర్థికి లక్ష ఓట్ల ఆధిక్యం ఉందనుకుందాం. ఇంకా లెక్కించాల్సిన బ్యాలెట్లు 20 వేలు మాత్రమే ఉంటే, మిగిలిన ఓట్లన్నీ ప్రత్యర్థికి పడినా ఆధిక్యంలో ఉన్న అభ్యర్థిని ఓడించడం సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న గణాంకాలను పరిశీలించి మీడియా సంస్థలు ఆ అభ్యర్థి విజయాన్ని ప్రకటిస్తాయి. అందువల్ల పూర్తి కౌంటింగ్ ముగియకముందే విజేత ఎవరో తెలిసిపోతుంది.
మీడియా ప్రకటించేది తుది ఫలితం కాదు.. అధికారిక ప్రక్రియ వేరు
ఎన్నికల రాత్రి మీడియా సంస్థలు ప్రకటించే విజయాలు, అధికారిక ఎన్నికల ఫలితాలు రెండూ ఒకటి కావు. మీడియా సంస్థలు తమకు అందిన సమాచారం, ఓట్ల సరళి, మిగిలిన బ్యాలెట్ల సంఖ్య ఆధారంగా విజేతలను అంచనా వేస్తాయి. వీటిని ప్రాథమిక ఫలితాలుగా మాత్రమే పరిగణించాలి. మరోవైపు ఎన్నికల అధికారులు మాత్రం ప్రతి ఓటును లెక్కించి, అవసరమైన పరిశీలనలు పూర్తి చేసిన తర్వాతే అధికారిక ఫలితాలను ఖరారు చేస్తారు. మొత్తం కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యాక విజేతలను అధికారికంగా ప్రకటిస్తారు. అంటే అమెరికాలో ఎన్నికల ఫలితాలు వేగంగా వెలువడుతున్నాయంటే కోట్లాది బ్యాలెట్లను కొన్ని గంటల్లోనే పూర్తిగా లెక్కించేస్తున్నారని అర్థం కాదు. స్కానింగ్ యంత్రాల సాయంతో ఓట్ల లెక్కింపు వేగంగా సాగడం, ముందస్తు ఓటింగ్ వల్ల బ్యాలెట్లు ముందుగానే సిద్ధంగా ఉండటం, మీడియా సంస్థలు గణాంకాలను విశ్లేషించి విజయాలను అంచనా వేయడం.. ఈ మూడు అంశాలే ఫలితాలు త్వరగా వెలువడటానికి ప్రధాన కారణాలు.





