- Home
- International
- నన్ను అరెస్ట్ చేస్తే, మా ప్రత్యేక దళాలు రంగంలోకి దిగుతాయి.. ఇజ్రాయెల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
నన్ను అరెస్ట్ చేస్తే, మా ప్రత్యేక దళాలు రంగంలోకి దిగుతాయి.. ఇజ్రాయెల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన అరెస్టుకు సంబంధించిన చర్చలపై ఘాటుగా స్పందించారు. అమెరికా పర్యటన సందర్భంగా తనను అదుపులోకి తీసుకునే ప్రయత్నం జరిగితే ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలు జోక్యం చేసుకుంటాయని హెచ్చరించారు.

న్యూయార్క్ మేయర్ వ్యాఖ్యలపై నెతన్యాహు ఆగ్రహం
ఇటీవల న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) జారీ చేసిన వారెంట్‌ను ప్రస్తావిస్తూ నెతన్యాహు అమెరికాకు వస్తే ఆయనను అరెస్టు చేయాలని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన నెతన్యాహు, తనపై ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ ఉద్దేశాలతోనే చేస్తున్నారని విమర్శించారు. యూదులపై విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు తన పేరును ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.
అమెరికా పర్యటన, ట్రంప్ స్పందన
నెతన్యాహు త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మమ్దానీ ఆయనను యుద్ధ నేరాలకు బాధ్యుడిగా పేర్కొంటూ, అమెరికాలో ఉన్న సమయంలో అరెస్టు చేయాలని ట్రంప్ ప్రభుత్వాన్ని కోరారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ డిమాండ్‌ను తిరస్కరిస్తూ, నెతన్యాహును అరెస్టు చేసే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు.
ICC అరెస్టు వారెంట్‌కు కారణమేంటి?
గాజా యుద్ధానికి సంబంధించి యుద్ధ నేరాలు, మానవతా చట్టాల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో 2024 నవంబర్‌లో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నెతన్యాహుతో పాటు అప్పటి ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌పై అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో ఐసీసీ సభ్యదేశాలకు వారు వెళ్లినప్పుడు చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే నెతన్యాహు మాత్రం ఐసీసీని విశ్వసనీయత లేని సంస్థగా అభివర్ణిస్తూ, తనపై జారీ చేసిన వారెంట్‌కు ఎలాంటి చట్టబద్ధత లేదని కొట్టిపారేశారు.

