బంగ్లాదేశ్‌లో పేట్రేగిన మతోన్మాదులు.. మరో హిందూ నేత హత్య: రంగంలోకి దిగిన అమెరికా!
బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందులపై దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ హిందూ నేత భాబేష్ చంద్ర రాయ్‌ను అతివాద ముస్లింలు కొందరు కొట్టి చంపారు. దీనిపై భారీగా నిరసనలు వెల్లువెత్తాయి. అగ్రరాజ్యం అమెరికా సైతం దీన్ని తీవ్రంగా ఖండించింది. ఆ దేశానికి వెళ్లవద్దంటూ తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది.

మతోన్మాదుల దాడి
బంగ్లాదేశ్‌లో గత గురువారం 58 ఏళ్ల హిందూ నేత భాబేష్ రాయ్‌ను ఇస్లామిక్ మతతత్వవాదుల గుంపు కొట్టి చంపింది. భాబేష్ రాయ్ బంగ్లాదేశ్ పూజా ఉద్యపన్ పరిషత్ బీరల్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్. హిందూ సమాజంలో ఆయనకు మంచి పలుకుబడి ఉంది. ఢాకా నుండి 330 కి.మీ దూరంలో ఉన్న దినాజ్‌పూర్‌లోని బసుదేవ్‌పూర్ గ్రామానికి చెందిన భాబేష్ చంద్ర రాయ్ భార్య శాంతన ప్రకారం, గురువారం నలుగురు వ్యక్తులు బైక్‌పై వచ్చి తన భర్తను ఎత్తుకెళ్లారు. భాబేష్ చంద్ర రాయ్‌ను నరబాడి గ్రామానికి తీసుకెళ్లి అక్కడ క్రూరంగా కొట్టారు. అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించారు.
అమెరికా ఆగ్రహం
బంగ్లాదేశ్‌లో హిందూ నేత హత్యపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనారిటీలపై ఇలాంటి దాడులను అరికట్టాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. తన పౌరుల భద్రత దృష్ట్యా హెచ్చరిక జారీ చేసింది. బంగ్లాదేశ్ పర్యటనకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించింది. బంగ్లాదేశ్‌లో మత ఘర్షణలు, ఉగ్రవాదం, అపహరణ వంటి నేరాలు తారస్థాయిలో ఉన్నాయని అమెరికా తన పౌరులకు ప్రయాణ హెచ్చరిక జారీ చేసింది. వీలైనంత వరకు అక్కడికి వెళ్లవద్దని సూచించింది.
32 మంది హిందువుల హత్య
బంగ్లాదేశ్‌లో హిందూ నేత హత్యపై భారత్ తీవ్రంగా స్పందించింది. తాత్కాలిక ప్రభుత్వ హయాంలో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులు అణచివేతకు నిదర్శనమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. హత్య తర్వాత కూడా నిందితులు శిక్ష లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆక్షేపించింది. గత ఏడాది ఆగస్టు నుండి డిసెంబర్ 2024 వరకు అక్కడ 32 మంది హిందువులు హత్యకు గురయ్యారు.
ఈ సంఘటన అనంతరం నిరసనలు వెల్లువెత్తడంతో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ ప్రెస్ కార్యదర్శి ఒక ప్రకటన చేశారు. బెంగాల్‌లో మైనారిటీ ముస్లింలను రక్షించాలని భారత్‌కు సూచించారు. పశ్చిమ బెంగాల్‌లో హింసను రెచ్చగొట్టడంలో బంగ్లాదేశ్ పాత్ర ఉందన్న వాదనను యూనస్ ప్రెస్ కార్యదర్శి ఖండించారు.