వీళ్లు పసుపును అస్సలు తినకూడదు.. ఎందుకో తెలుసా?
పసుపు వంటలకు రుచిని పెంచడమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పసుపు ఎన్నో ఔషధ గుణాలను కలిగిఉంది. కానీ కొన్ని సమస్యలు ఉన్నవారు పసుపు తినడం అస్సలు మంచిది కాదు. ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదో.. ఇక్కడ తెలుసుకుందాం.

పసుపు ఎవరు తినకూడదు?
పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వాపు, నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా పసుపు చాలా మంచిది. అయితే పసుపు ఎంత మేలు చేసినా.. కొన్ని సమస్యలున్నవారు దాన్ని తినకపోవడమే మంచిది. దానివల్ల వారికి నష్టమే జరుగుతుంది. మరి ఏ సమస్యలున్నవారు పసుపు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
కాలేయ సమస్యలు
కాలేయం మన శరీరంలో ముఖ్యమైన భాగం. ఇది రక్తం నుంచి వ్యర్థాలు, విష పదార్థాలను తొలగిస్తుంది. కాలేయ సమస్యలు ఉన్నవారు పసుపు తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పసుపులో ఉండే కర్క్యుమిన్ కాలేయాన్ని మరింత డ్యామేజ్ చేసే అవకాశం ఉందంటున్నారు.
కిడ్నీలో రాళ్లు
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు కూడా పసుపు తినకపోవడమే మంచిది. పసుపును అధికంగా తీసుకోవడం వల్ల మూత్రంలో ఆక్సలేట్ స్థాయిలు పెరిగి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం మరింత పెరుగుతుంది.
పిత్తాశయ సమస్య
పసుపులో ఉండే కర్క్యుమిన్ పిత్తాశయం మీద చెడు ప్రభావం చూపుతుంది. ఇది పిత్తాశయాన్ని కుంచించుకు పోయేలా చేస్తుంది. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు పసుపు తక్కువగా తినడం మంచిది.
గర్భిణీలు, పాలిచ్చే తల్లులు
గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కూడా పసుపు తినకూడదు. ఇది హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. గర్భసంచికి కూడా హాని చేస్తుంది. పాలిచ్చే తల్లులు అధికంగా పసుపు తీసుకుంటే బిడ్డకు కూడా హాని జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.