వీళ్లు పొరపాటున కూడా ఎండు చేపల కూర తినకూడదు!
ఎండు చేపల కూరను చాలామంది ఇష్టంగా తింటారు. ఇవి అనేక పోషక గుణాలను కలిగి ఉంటాయి. ఎండు చేపలు ఆరోగ్యానికి ఎంత మంచివైనా కొన్ని సమస్యలున్నవారు వీటి జోలికి పోకపోవడమే మంచిది. మరి ఎండు చేపలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

ఎండు చేపలు ఎవరు తినకూడదు?
మనలో చాలామంది తరచుగా చేపల కూరను తింటుంటారు. అయితే పచ్చి చేపలు తినేవారు కూడా కొందరు ఎండు చేపలను తినడానికి ఇష్టపడరు. వీటి నుంచి వచ్చే వాసన అందరికీ నచ్చకపోవచ్చు. నిజానికి ఎండుచేపల్లో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి ఆరోగ్యానికి చాలామంచిది. అయితే.. వీటిని కొన్ని సమస్యలున్నవారు అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు? తింటే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
ఎండు చేపలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
ఎండు చేపల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు ఉన్నవారు ఎండు చేపల కూర తినడం ద్వారా ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు ఎండు చేపలు తినడం వల్ల ఎముకలు బలపడుతాయి. వాతం, పిత్తం లాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఏ సమస్యలున్నవారు ఎండు చేపలు తినకూడదు?
నిపుణుల ప్రకారం కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు, చర్మ, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఎండు చేపలను తినకూడదు. ముఖ్యంగా షుగర్, బీపి ఉన్నవాళ్లు ఎండుచేపల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎండు చేపల్లో సోడియం అధికంగా ఉంటుంది. ఇది బీపిని మరింత పెంచుతుంది. అంతేకాదు చర్మ సమస్యలున్నవారు ఎండు చేపలను తింటే దద్దుర్లు, దురద వంటి సమస్యలు రావచ్చు.
ఎండు చేపలతో పాటు తినకూడని ఫుడ్స్
నిపుణుల ప్రకారం.. పెరుగు, మజ్జిగ, ఆకుకూరలను ఎండు చేపలతో కలిపి తినకూడదు. దానివల్ల చాలా సమస్యలు వస్తాయి. సైనస్, జలుబు, దగ్గు, ఆస్తమా వంటి సమస్యలున్న వారు తలకు నూనె రాసుకుని స్నానం చేసిన తర్వాత ఎండు చేపలు తింటే ఆ సమస్య మరింత తీవ్రమవుతుంది.