వీళ్లు రోజుకు 10 గుమ్మడి గింజలు తింటే ఎన్ని లాభాలో తెలుసా?
గుమ్మడి గింజల్లో ఫైబర్, విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం ద్వారా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళలకు ఈ గింజలు చాలా మేలు చేస్తాయి. రోజూ 10 గింజలు తిన్నా మంచి ఫలితాలు చూడవచ్చు.

Pumpkin Seeds Benefits
గుమ్మడికాయే కాదు.. దాని గింజలు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. గుమ్మడి గింజల్లో అనేక పోషకాలు ఉన్నాయి. రెగ్యులర్ గా వేయించిన గుమ్మడి గింజలను తింటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మహిళలు ప్రతిరోజు కనీసం 10 గుమ్మడి గింజలను తప్పనిసరిగా తినాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
టైప్ 2 డయాబెటిస్
ప్రస్తుతం టైప్ 2 డయాబెటిస్‌తో చాలామంది మహిళలు బాధపడుతున్నారు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఎక్కువ మంది మహిళలు ఈ వ్యాధిబారిన పడుతున్నారు. అయితే పసుపు గుమ్మడికాయ టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రించే లక్షణాన్ని కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్ గా ఈ గుమ్మడికాయ గింజలను తింటే డయాబెటిస్ అదుపులో ఉంటుందని చెబుతున్నారు.
ఎముకల బలోపేతానికి..
వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడతాయి. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన మహిళలకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. గుమ్మడి గింజల్లో ఉండే అమైనో ఆమ్లాలు, విటమిన్ సి శరీరంలో కాల్షియం శోషణకు సహాయపడతాయి. దీనివల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతిరోజు గుమ్మడి గింజలను తింటే ఎముకలు దృఢంగా ఉంటాయి.
అధిక రక్తపోటు
గుమ్మడి గింజలు.. శరీరంలోని మెగ్నీషియం స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతాయి. అంతేకాకుండా వాటిలో ఉండే కొవ్వు ఆమ్లాలు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించి, నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతాయి. బీపి నియంత్రణకు సహాయపడుతాయి.
మూత్ర నాళాల ఇన్ఫెక్షన్
గుమ్మడి గింజల్లో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు శరీర వేడిని తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. అంతేకాకుండా మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌ను కూడా నయం చేస్తాయి. వేసవికాలంలో గుమ్మడి గింజలను ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది.
PCOS
మహిళల్లో ఎక్కువగా వచ్చే సమస్య PCOS. దీనివల్ల అండాశయంపై చిన్న చిన్న నీటి తిత్తులు ఏర్పడుతాయి. ఈ సమస్య వల్ల మహిళలకు థైరాయిడ్, ఊబకాయం, పిల్లలు పుట్టకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అయితే PCOS ఉన్న మహిళలు తమ ఆహారంలో గుమ్మడి గింజలను చేర్చుకోవడం ద్వారా మంచి ఫలితాలు చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గుండె ఆరోగ్యానికి..
గుమ్మడి గింజలు శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాల పనితీరును ప్రోత్సహించి, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడతాయి. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.