Heart Attack: ఆ వస్తువులతో గుండెకు ముప్పు.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం..
Heart Attack: రోజూ వాడే పాస్టిక్ వల్ల గుండెకు ముప్పు వాటిల్లుతుందట. వాటిలో ఉండే రసాయనాలు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయని తేలింది. అంతేకాకుండా ఇవి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఇంతకీ ఆ వస్తువులేంటీ? వాటి వల్ల వచ్చే ప్రమాదమేంటీ?

పాస్టిక్ తో గుండెకు ముప్పు:
గుండె జబ్బుల ప్రమాదం రోజురోజుకు పెరుగుతోంది. వయస్సుతో సంబంధం లేకుండా యువత కూడా గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. జీవనశైలి, ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తున్నా, తాజాగా మరో ఆందోళనకర అంశం వెలుగులోకి వచ్చింది. షాంపూ, మేకప్, వంటసామగ్రి వంటి నిత్యవసర వస్తువుల్లో ఉండే రసాయనాల వల్ల గుండెపోటు ప్రమాదం పెరుగుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్లాస్టిక్‌లో ఉండే ఫ్తాలేట్స్ అనే రసాయనం మరణాలకు కారణమవుతోందని eBioMedicine పత్రికలో ప్రచురితమైన నివేదిక పేర్కొంది.
ప్లాస్టిక్ తో ఇంత నష్టమా?
ప్లాస్టిక్ పర్యావరణానికి హానికరమని ఎంతకాలంగా ప్రచారం జరుగుతున్నా, వినియోగం మాత్రం అస్సలు తగ్గడం లేదు. ప్లాస్టిక్‌లో ఉండే ఫ్తాలేట్స్ అనే రసాయనం ఆరోగ్యానికి హానికరం. ఇది పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని, వీర్యకణాల సంఖ్యను, టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గించడమే కాక, ఆస్తమా, ఊబకాయం, క్యాన్సర్‌లకు కూడా కారణమవుతుంది. దీనివల్లే ప్రభుత్వం ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటోంది.
ఫ్తాలేట్స్ తో గుండెపోటు
ఫ్తాలేట్స్ గుండెపోటుకు కారణమవుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. 2018లో 55–64 ఏళ్ల వయసులో 13.5% గుండెపోటులకి ఇవే కారణమని తేలింది. అదే ఏడాది 200 దేశాల్లో 3.5 లక్షల మరణాలకు ఫ్తాలేట్స్ కారణం. అలాగే.. ఆఫ్రికాలో గుండెపోటులలో 30% కేసులు ఫ్తాలేట్స్ వల్లే వచ్చినట్టు తేలింది.
షాకింగ్ విషయాలు
న్యూయార్క్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 98% మరణాలకు ప్లాస్టిక్‌లో ఉండే హానికారక రసాయనాలతో సంబంధమున్నాయని వెల్లడించింది. భారతదేశంలో ప్లాస్టిక్ వినియోగం వేగంగా పెరుగుతోంది. అయితే ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణలో తీవ్ర లోపాలున్నాయి. ఈ కారణంగా ఫ్తాలేట్స్, BPA వంటి రసాయనాలు నీరు, భూమి, ఆహార పదార్థాల్లో కలుస్తుండటంతో ప్రజలు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీర్ఘకాలికంగా ఇవి గుండెజబ్బులు, సంతానోత్పత్తి లోపాలు, క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉంది.
ప్లాస్టిక్ వల్ల ఆరోగ్యానికి ముప్పు
ఫ్తాలేట్స్ అనే రసాయనాలు ప్లాస్టిక్ బాటిల్స్, డబ్బాలు, టైల్స్, వైర్లు, షాంపూ బాటిల్స్‌లలో సాధారణంగా ఉంటాయి. ఇవి శ్వాసకోశం, నోరు, చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశించి హార్మోన్లను దెబ్బతీయవచ్చు. ఎలుకలపై జరిగిన పరిశోధనల్లో, ఫ్తాలేట్స్ వల్ల సంతానోత్పత్తి సమస్యలు కలుగుతాయని తేలింది. దీర్ఘకాలికంగా ఇవి మన ఆరోగ్యానికి ముప్పుగా మారవచ్చు.
తీసుకోవలసిన జాగ్రత్తలు:
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ద్వారా ఫ్తాలేట్స్‌ని నివారించవచ్చు. ప్లాస్టిక్ బాటిల్స్ బదులుగా BPA-Free అని లేబుల్ ఉన్న బాటిల్స్‌నే వాడండి. గాజు (glass) లేదా స్టీల్ బాటిల్స్ వాడడం అత్యుత్తమం. ఒకే ప్లాస్టిక్ బాటిల్‌ను పదే పదే ఉపయోగించకండి. ప్లాస్టిక్ బాటిల్‌ను వేడి నీరు లేదా వేడి పదార్థాల కోసం వాడకండి. సూర్యరశ్మిలో పాస్టిక్ బాటిల్స్ ను పెట్టకూడదు.