శరీరంలో ఈ భాగాల్లో నొప్పి థైరాయిడ్ వల్లే కావొచ్చు
Thyroid Pain: ఈ షుగర్ పేషెంట్లతో పాటుగా థైరాయిడ్ పేషెంట్లు కూడా పెరిగిపోతున్నారు. అయితే చాలా మందికి థైరాయిడ్ వల్ల వచ్చే నొప్పి గురించి మాత్రం తెలియదు. ఈ సమస్య వల్ల మన శరీరంలో కొన్ని భాగాల్లో బాగా నొప్పి వస్తుంది.

థైరాయిడ్ నొప్పి
థైరాయిడ్ దీర్ఘాకాలిక సమస్య. ఇది వచ్చిందంటే ఇక మెడిసిన్స్ ను ప్రతిరోజూ వాడాల్సిందే. ప్రస్తుత కాలంలో చాలా మందికి ఈ సమస్య వస్తుంది. నిజం చెప్పాలంటే చాలా మందికి ఈ థైరాయిడ్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలియదు.
కేవలం దీనివల్ల బరువు పెరుగుతామని మాత్రమే తెలుసు. కానీ ఈ సమస్య వస్తే శరీరంలో కొన్ని భాగాల్లో నొప్పి కలుగుతుంది. దీన్ని బట్టి కూడా మీకు థైరాయిడ్ ఉందని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఉన్నవారికి థైరాయిడ్ ఇంకా ఎక్కువైందని తెలుసుకోవచ్చు. అసలు థైరాయిడ్ తో మన శరీరంలో ఏయే భాగాల్లో నొప్పి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మెడ ముందు భాగంలో
థైరాయిడ్ సమస్య వల్ల మన శరీరంలో ముందుగా వచ్చే నొప్పి మెడ ముందు భాగంలోనే అంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఇది థైరాయిడ్ ఉందనడానికి మంచి సంకేతం. థైరాయిడ్ గ్రంథి దగ్గర వాపు, నొప్పి, గొంతు నొప్పి ఉన్నా మీకు థైరాయిడ్ సమస్య ఉన్నట్టు అర్థం.
ఈ సమస్య వల్ల తినడానికి, మింగడానికి, నీళ్లు తాగడానికి ఇబ్బంది కలుగుతుంది. అయితే ఈ నొప్పి, వాపులు హషిమోటోస్, సబాక్యూట్ థైరాయిడిటీస్ వంటి సమస్యల వల్ల వస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
దవడ నొప్పి
థైరాయిడ్ వల్ల దవడ నొప్పి కూడా వస్తుంది. ఈ నొప్పి సబాక్యూట్ ధైరాయిడిటీస్ నుంచి దవడకు వ్యాపిస్తుంది. ఎందుకంటే దవడకు, థైరాయిడ్ కు నరాల అనుసంధానం ఉంటుంది.
చెవి నొప్పి
థైరాయిడ్ వల్ల కొన్ని కొన్ని సార్లు చెవి నొప్పి కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా థైరాయిడ్ వల్ల చెవి దిగువ భాగంలో నొప్పి వస్తుంది. ఇది సేమ్ చెవి నొప్పిలానే ఉంటుంది. కానీ ఎలాంటి చెవి ఇన్ఫెక్షన్ ఉండదు.
మెడ వెనుక భాగంలో నొప్పి
థైరాయిడ్ వల్ల మెడ వెనుక భాగంలో కూడా నొప్పి రావొచ్చు. కానీ ఇలాంటి నొప్పి చాలా తక్కువగా వస్తుంది. ఈ నొప్పి మెడ ముందు భాగం నుంచి వెనుక భాగానికి వ్యాపించడం వల్ల వస్తుంది. అలాగే పై వీపు, భుజాల్లో కూడా నొప్పి లేదా అసౌకర్యంగా ఉంటుంది.
అంతేకాదు వీపు చుట్టూరా కూడా నొప్పిగా అనిపిస్తుంది. దీనికి థైరాయిడ్ వ్యాధులే కారణమని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు. అంతేకాదు దీనివల్ల మీరు బలహీనంగా, నీరసంగా ఉంటారు. బాగా అలసిపోయినట్టుగా కూడా అనిపిస్తుంది. బాగా ఒత్తిడికి కూడా గురవుతారు.