Health tips: వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్ కంట్రోల్ కావడం పక్కా!
ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో షుగర్ వ్యాధి ఒకటి. షుగర్ పేషెంట్లు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. అయితే వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలతో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుకోవచ్చట. మరి అవేంటో చూద్దామా..

Kitchen Ingredients for Control Blood Sugar
షుగర్ వ్యాధి ప్రస్తుతం సాధారణ సమస్యగా మారింది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే మన వంటగదిలో ఉండే కొన్ని పదార్థాలతో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మెంతులు
మధుమేహాన్ని నియంత్రించడంలో మెంతులు కీలక పాత్ర పోషిస్తాయి. ఒకటి నుంచి రెండు స్పూన్ల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగి, మెంతులను నమిలి తినచ్చు. లేదా మొలకెత్తిన మెంతులను నూరి వేడి నీటిలో కలిపి తాగవచ్చు. మొలకెత్తిన మెంతులను ఎండలో ఆరబెట్టి పొడి చేసి రాత్రి భోజనం తర్వాత ఒక గ్లాసు తాగవచ్చు.
కాకరకాయ
కాకరకాయ.. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. వారానికి రెండు లేదా మూడు సార్లు కాకరకాయను ఆహారంలో చేర్చుకోవాలి. కాకరకాయను నూరి ఉదయం ఖాళీ కడుపుతో రసంలా తాగవచ్చు. చాలా చేదుగా అనిపిస్తే కాకరకాయను ఉడికించి ఆ నీటిని తాగవచ్చు. లేదా కాకరకాయతో సాంబార్, కూర, వేపుడు చేసుకొని తినచ్చు.
ఉసిరికాయ
ఉసిరికాయ విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది క్లోమం పనితీరును మెరుగుపరచడానికి.. ఇన్సులిన్ స్రావాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది. రెండు పెద్ద ఉసిరికాయలు, కరివేపాకు, కొద్దిగా పెరుగు వేసి మిక్సీ పట్టి.. దాని రసం వడగట్టి ప్రతిరోజూ ఉదయం తాగవచ్చు. ముఖ్యంగా ఉసిరికాయ గింజలను తీయకుండా వాటిని కూడా కలిపి నూరడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కొద్దిగా దాల్చిన చెక్క పొడిని టీలో కలిపి తాగవచ్చు. లేదా దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించి టీలా తాగవచ్చు. దాల్చిన చెక్కలాగే పసుపు కూడా ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి మీ ఆహారంలో పసుపును తప్పకుండా చేర్చుకోవాలి. రాత్రి పడుకునే ముందు పాలల్లో పసుపు వేసుకొని తాగచ్చు.
వేపాకు
వేప, తులసి ఆకులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఉదయం ఖాళీ కడుపుతో పది వేప ఆకులు, పది తులసి ఆకులను నమిలి తినచ్చు. అలాగే కరివేపాకు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఆహారంలో కరివేపాకును ఎక్కువగా చేర్చుకోవాలి. కరివేపాకు, మెంతులు, అల్లం, దాల్చిన చెక్క కలిపి కషాయంలా చేసి తాగవచ్చు. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే అవిసె గింజలను కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇవి చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతాయి.
దోసకాయ, బెండకాయ..
దోసకాయ, బెండకాయ, ముల్లంగి, ఉల్లిపాయ వంటి వాటిని ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలి. ఆకుకూరలు, రాగులు, ఓట్స్, బ్రౌన్ రైస్ వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు సహాయపడతాయి. చక్కెర, బెల్లం, పిండి పదార్థాలు, తీపి పదార్థాలను తినకూడదు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు.. నడక, యోగా, ఈత, సైక్లింగ్ వంటివి చేయాలి. శరీరంలో నీటి శాతం సరిగ్గా ఉండటం వల్ల కూడా మధుమేహాన్ని నియంత్రించవచ్చు. కాబట్టి తగినంత నీరు తాగాలి.
ఇది గుర్తుంచుకోండి!
ఆహారంలో మార్పులు చేసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.