Mineral Water: మినరల్ వాటర్‌ను వేడిచేసి తాగడం మంచిదా? కాదా? తాగితే ఏమవుతుంది?
ఆరోగ్యంగా ఉండడానికి నీరు తాగడం చాలా అవసరం. ప్రస్తుతం చాలామంది మినరల్ వాటర్ కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే మినరల్ వాటర్‌ను వేడి చేసి తాగొచ్చా లేక అలాగే తాగాలా? వేడి చేసుకొని తాగితే ఏమవుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

మినరల్ వాటర్ వేడిచేసి తాగొచ్చా?
మినరల్ వాటర్‌ను వేడి చేసుకొని తాగడం మంచిదా? కాదా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. కానీ అది వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి, మినరల్ వాటర్ రకం, దాన్ని వేడి చేసే విధానం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. మినరల్ వాటర్ అంటే సహజంగా లేదా ప్రాసెస్ చేసిన నీరు. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు నిర్దిష్ట స్థాయిలో ఉంటాయి. ఈ నీరు తాగడానికి సురక్షితమే. అయితే వేడి చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం అని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.
మినరల్ వాటర్ వేడి చేసి తాగడం వల్ల కలిగే లాభాలు
ఆయుర్వేదం, నిపుణుల అభిప్రాయం ప్రకారం గోరువెచ్చని నీరు జీర్ణ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగితే జీర్ణక్రియ మెరుగుపడటం, మలబద్ధకం తగ్గడం, శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలు బయటకు వెళ్లడం వంటి ప్రయోజనాలు ఉంటాయి.
మినరల్ వాటర్‌ను గోరువెచ్చగా తాగినప్పుడు కూడా ఈ ప్రయోజనాలు కొంతవరకు లభిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో లేదా జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఉన్నప్పుడు వేడి నీరు ఉపశమనం కలిగిస్తుంది. అలాగే శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడటానికి కూడా గోరువెచ్చని నీరు సహకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రతికూలతలు
మినరల్ వాటర్‌ను వేడి చేసి తాగడం వల్ల కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. మినరల్ వాటర్‌లో ఉన్న ముఖ్యమైన ఖనిజాలు అధిక వేడి వల్ల కొంతవరకు మార్పులకు లోనవుతాయి. ముఖ్యంగా నీటిని ఎక్కువసేపు మరిగిస్తే, అందులోని ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతుంది. ఖనిజాల సమతుల్యత మారే అవకాశం ఉంటుంది. దానివల్ల మినరల్ వాటర్ అసలు ఉద్దేశం, అంటే ఖనిజాల ద్వారా శరీరానికి పోషణ అందించడం, కొంత తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
మినరల్ వాటర్‌ను వేడి చేయాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. వాటర్ ని స్టీల్ పాత్రలో వేడి చేయాలి. నీటిని పూర్తిగా మరిగించకుండా గోరువెచ్చని స్థాయిలోనే ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఖనిజాల నష్టం తక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ మినరల్ వాటర్‌ను వేడి చేసి తాగడం కంటే, అవసరమైనప్పుడు మాత్రమే అలా చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ సమస్యలు ఉన్నవారు జాగ్రత్త
ప్రతి ఒక్కరికీ వేడి నీరు అనుకూలంగా ఉండకపోవచ్చు. గ్యాస్, అల్సర్ వంటి సమస్యలు ఉన్నవారు ఎక్కువగా వేడి నీరు తాగడం అసౌకర్యాన్ని కలిగించవచ్చు. అలాంటి వారు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. అలాగే పిల్లలు, వృద్ధులు కూడా నీటి ఉష్ణోగ్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ వేడిగా ఉన్న నీరు గొంతు లేదా నోటి లోపలి భాగాలను దెబ్బతీయవచ్చు.
సరైన విధానంలో..
మినరల్ వాటర్‌ని సరైన విధానంలో, సరైన ఉష్ణోగ్రతలో, అవసరాన్ని బట్టి తాగితే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. నీటిని ఎక్కువసేపు మరిగించడం లేదా ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకుండా అలవాటుగా తాగడం వంటివి ఆరోగ్యానికి హానికరంగా మారవచ్చు.
