హార్ట్ ఎటాక్‌కి ముందు ఎడమ భుజంలో నొప్పి ఎందుకు వస్తుంది.? కారణం ఏంటంటే..
Heart Health: హార్ట్ అటాక్ అంటే చాలా మంది ముందు ఛాతీ నొప్పి గురించి ఆలోచిస్తారు. కానీ చాలా సందర్భాల్లో ఆ నొప్పి మొదటగా ఎడమ భుజంలో మొదలవుతుంది. ఇంతకీ నొప్పి ఎందుకు వస్తుంది.? దాని వెనుక ఉన్న కారణం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

హార్ట్ అటాక్ సమయంలో ఎడమ చేతిలో నొప్పి ఎందుకు వస్తుంది?
హృదయానికి ఆక్సిజన్ సరఫరా చేసే కోరోనరీ ఆర్టరీలు (Coronary arteries) బ్లాక్ అవుతాయి. దీంతో హృదయ కండరాలు సరిపడా ఆక్సిజన్ పొందలేవు. ఆ సమయంలో హృదయం నొప్పి సంకేతాలను మెదడుకి పంపుతుంది. హృదయం, ఎడమ చేతి నరాలు ఒకే మార్గం (T1-T4 స్పైనల్ నర్వ్స్) ద్వారా మెదడుకి వెళ్తాయి. అందుకే మెదడు అసలు నొప్పి ఎక్కడి నుంచి వస్తుందో గుర్తించలేకపోతుంది. దాంతో నొప్పి ఎడమ చేతి నుంచి వస్తోందని మనం అనుకుంటాం. దీన్నే “రిఫర్డ్ పెయిన్” (Referred Pain) అంటారు.
ఎడమ వైపు నొప్పి ఎక్కువగా ఎందుకు అనిపిస్తుంది?
మన హృదయం శరీరంలో ఎడమ వైపు కొంచెం వంగి ఉంటుంది. కాబట్టి ఆర్టరీల్లో బ్లాక్ ఉంటే దాని ప్రభావం ఎడమ భాగంలో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా Left Anterior Descending (LAD) ఆర్టరీలో అవరోధం ఉంటే, ఆ నొప్పి నేరుగా ఎడమ చేతికి, భుజానికి, కొన్నిసార్లు దవడ వరకు వెళ్తుంది. డాక్టర్లు దీన్ని “విండో మేకర్ ఆర్టరీ” అంటారు, ఎందుకంటే ఈ ఆర్టరీ పూర్తిగా మూసుకుపోతే అది ప్రాణాపాయం అవుతుంది.
నొప్పి ఎలా ఉంటుంది?
హార్ట్ అటాక్ సమయంలో వచ్చే ఎడమ చేతి నొప్పి కనిపిస్తుంది. కొన్నిసార్లు భారీగా, బరువుగా, లేదా బిగుసుకున్నట్లు అనిపిస్తుంది. ఈ నొప్పి భుజం నుంచి చేతివేళ్ల వరకు లేదా దవడ, మెడ వరకు కూడా వ్యాపించవచ్చు. అది కొన్ని నిమిషాలపాటు కొనసాగితే, సాధారణ నొప్పి కాదని గమనించాలి.
హార్ట్ అటాక్‌కి ఇది సూచనా?
ప్రతిసారీ ఎడమ చేతిలో నొప్పి వస్తే అది హార్ట్ అటాక్ అని కాదు. కానీ ఈ నొప్పి కొన్ని నిమిషాల కంటే ఎక్కువగా ఉంటే, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం, ఛాతీలో బరువుగా అనిపించడం, చెమటలు పట్టడం, వాంతులు లేదా తలనొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ సహాయం తీసుకోవాలి. చాలా మందికి హార్ట్ అటాక్ సమయంలో ఛాతీ నొప్పి లేకుండా, ఎడమ చేతి నొప్పే ప్రధాన సంకేతంగా కనిపిస్తుంది.
సమయానికి గుర్తిస్తే ప్రాణం కాపాడుకోవచ్చు
హార్ట్ అటాక్ సంకేతాలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. ఎడమ చేతిలో తరచుగా నొప్పి, గడ్డ కట్టినట్లు అనిపించడం, శ్వాస ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయొద్దు. సమయానికి పరీక్షలు చేయించుకుంటే, చికిత్స తీసుకుంటే ప్రాణాలను రక్షించుకోవచ్చు.