- Home
- Andhra Pradesh
- ఆంధ్రప్రదేశ్‌లో మూడు హైదరాబాద్‌లాంటి సిటీలు.. రూ. లక్ష కోట్ల పెట్టుబడులు, 85 వేల ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్‌లో మూడు హైదరాబాద్‌లాంటి సిటీలు.. రూ. లక్ష కోట్ల పెట్టుబడులు, 85 వేల ఉద్యోగాలు
Andhra pradesh: ఏపీని అభివృద్ధిలో పరుగులు పెట్టేంచుందుకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలను ప్రకటించారు. ఏపీలో మూడు మెగా సిటీలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

SIPB బోర్డు సమావేశం
రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి గట్టి పునాది వేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన దిశానిర్దేశాలు జారీ చేశారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన సంస్థల ప్రతిపాదనలను వెంటనే ఆమోదించడమే కాక, అవి త్వరగా ఏర్పాటు దిశగా అడుగులు వేయాలంటూ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సచివాలయంలో జరిగిన 12వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో భారీ పెట్టుబడులు ఆమోదం పొందాయి.
26 కొత్త ప్రాజెక్టులకు ఆమోదం
ఈ సమావేశంలో మొత్తం 26 పరిశ్రమల ప్రతిపాదనలు ఎస్ఐపీబీ ఆమోదించింది. వీటి ద్వారా రాష్ట్రానికి రూ.1.01 లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు రానున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా 85,570 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 16 నెలల్లోనే 12 ఎస్ఐపీబీ సమావేశాలు నిర్వహించగా, ఇప్పటి వరకు రూ.8.08 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి ఆకర్షించడంలో విజయవంతమైంది. ఈ పెట్టుబడుల ద్వారా మొత్తం 7.05 లక్షలకుపైగా ఉద్యోగాలు సృష్టించనున్నట్లు అధికారులు తెలిపారు.
పెట్టుబడుల అమలులో వేగం
సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. “పెట్టుబడిదారుల ప్రతిపాదనలు సమయానికి పరిశీలించి, ఆలస్యం లేకుండా ఆమోదం ఇవ్వాలి. ఇప్పటికే అనుమతి పొందిన ప్రాజెక్టులు భూమి, విద్యుత్ వంటి సౌకర్యాల విషయంలో ఇబ్బందులు లేకుండా ప్రారంభం కావాలి. కొన్ని సంవత్సరాల క్రితం భూమి కేటాయించినా ఇంకా పనులు ప్రారంభం కాని ప్రాజెక్టులను సమీక్షించి, అవసరమైతే అనుమతులు రద్దు చేయాలి,” అని అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. అలాగే ఎలక్ట్రానిక్ పార్కులు, సెమీ కండక్టర్, చిప్, డ్రోన్ పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 15 పారిశ్రామిక జోన్లు ఏర్పాటు చేసి, క్లస్టర్ విధానంలో అభివృద్ధి చేయాలని చెప్పుకొచ్చారు.
మూడు మెగా సిటీలు
చంద్రబాబు నాయుడు ఇంకా మాట్లాడుతూ.. “రాష్ట్రంలో మూడు మెగా సిటీలను అభివృద్ధి చేయడం ప్రాధాన్యంగా తీసుకోవాలి. విశాఖపట్నం, తిరుపతి, అమరావతిలను మెగా సిటీలుగా తీర్చిదిద్ది, టూరిజం, ఐటీ, మౌలిక వసతులు, హాస్పిటాలిటీ రంగాలు సమన్వయంగా ఎదిగేలా చూడాలి” అని పేర్కొన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ప్రారంభం అవ్వడం వల్ల భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు, పరిశ్రమలు అక్కడ స్థాపించడానికి ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. భూమి లభ్యతతో పాటు మాస్టర్ ప్లాన్ ప్రకారం స్మార్ట్ టౌన్‌షిప్‌లు, నివాసయోగ్య నగరాలు అభివృద్ధి చేయాలన్నారు.
విశాఖ పెట్టుబడుల సదస్సుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు
ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సు విజయవంతం కావడానికి అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే ఆమోదం పొందిన పరిశ్రమల్లో వేగంగా శంకుస్థాపనలు జరగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ తదితరులు జిల్లాలవారీగా పరిశ్రమలకు శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు. విదేశీ పర్యటనల్లో ఆహ్వానించిన కంపెనీలు కూడా సదస్సులో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.
ఎస్ఐపీబీ ఆమోదం పొందిన ముఖ్య పరిశ్రమలు
కొత్త పెట్టుబడుల్లో కొందరు ప్రధాన కంపెనీలు – ఇండిచిప్ సెమీ కండక్టర్స్ (రూ. 22,976 కోట్లు), ఏఎమ్‌జీ మెటల్స్ (రూ. 44,000 కోట్లు), నవయుగ ఇంజినీరింగ్ (రూ. 7,972 కోట్లు), సూపర్ స్మెల్టర్స్ (రూ. 8,570 కోట్లు) – వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, సాఫ్ట్‌వేర్, పవర్, మాన్యుఫాక్చరింగ్ రంగాలకు చెందిన కంపెనీల పెట్టుబడులు రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి నూతన ఊపిరి పోయనున్నాయి.