Green Tea: గ్రీన్ టీలో దాల్చిన చెక్క పొడి వేసుకొని తాగితే ఏమవుతుందో తెలుసా?
గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదని చాలమంది చెబుతుంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు గ్రీన్ టీ తో రోజును ప్రారంభిస్తారు. అయితే ఈ టీ లో చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయట. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Green Tea with Cinnamon for Weight Loss
గ్రీన్ టీ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చక్కెర కలిపిన సాధారణ టీ కంటే, షుగర్ లేని గ్రీన్ టీ చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. ఈ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనికి దాల్చిన చెక్కను కలపడం వల్ల మరింత ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా గ్రీన్ టీలో దాల్చిన చెక్క కలిపి తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి..
దాల్చిన చెక్కలో ఉండే సిన్నమల్డిహైడ్, పాలీఫెనాల్స్.. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దాల్చిన చెక్కను మితంగా తీసుకుంటే మంచి కొలెస్ట్రాల్‌ను ప్రభావితం చేయకుండా మొత్తం కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
గ్రీన్ టీ, దాల్చిన చెక్క
గ్రీన్ టీలో ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలిపి ప్రతిరోజూ తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గ్రీన్ టీలోని క్యాటెచిన్లు యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతాయి. గ్రీన్ టీలో దాల్చిన చెక్కను కలిపితే క్యాటెచిన్‌తో కలిసి బాగా పనిచేస్తుంది. దీనివల్ల ధమనులు శుభ్రంగా ఉంటాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
మెదడు ఆరోగ్యానికి..
గ్రీన్ టీలో దాల్చిన చెక్క వేసుకొని తాగడం ద్వారా మెదడు చురుకుగా పనిచేస్తుంది. గ్రీన్ టీ లోని కెఫిన్, L-థియానైన్ వంటి పదార్థాలు మానసిక ఉత్సాహానికి తోడ్పడతాయి. అంతేకాదు దాల్చిన చెక్కలో ఉన్న ఔషధ గుణాలు శ్వాసనాళాలను శుభ్రం చేస్తాయి. గోరువెచ్చని గ్రీన్ టీ తాగడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
షుగర్ లెవెల్స్..
దాల్చిన చెక్క కలిపిన గ్రీన్ టీ తాగడం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బులు, డయాబెటిస్ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు ఈ పద్ధతిని పాటించవచ్చు.
గమనిక
గర్భిణీలు, పిల్లలు, షుగర్ వ్యాధికి మందులు వాడేవారు ఈ టీ తాగే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.