- Home
- Life
- Health
- Health Tips : ఆరోగ్యానికి మేలు చేసే గింజలు.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..
Health Tips : ఆరోగ్యానికి మేలు చేసే గింజలు.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..
Seeds : మన ఆరోగ్యం విషయంలో ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. సరైన ఆహారాన్ని తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. మన డైట్ లో విత్తనాలను చేర్చుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఆరోగ్యానికి మేలు చేసే గింజలు ఏంటీ? వాటి ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

గుమ్మడికాయ విత్తనాలు
గుమ్మడికాయ విత్తనాలను మనం పారేస్తాం. కానీ, వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. గుమ్మడి విత్తనాలలో ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్, విటమిన్ E, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీర ఆరోగ్యానికి చాలా అవసరం. ఇందులోని మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడానికి, గుండె కొట్టుకునే వేగాన్ని సక్రమంగా ఉంచడానికి సహాయపడుతుంది. హెల్తీ ఫ్యాట్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం.. గుమ్మడికాయ విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి.
ఎలా ఉపయోగించాలి: గుమ్మడికాయ విత్తనాలను వేయించి చిరుతిళ్లుగా తినవచ్చు. సలాడ్‌లు, సూప్‌లు, ఓట్స్ మీల్ వంటి వాటితో కలిపి తినవచ్చు.
పొద్దుతిరుగుడు విత్తనాలు
సన్ ఫ్లవర్ సీడ్స్, లేదా పొద్దుతిరుగుడు విత్తనాలు.. మన శరీరానికి శక్తిని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇందులోని హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్, విటమిన్ E గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
ఎలా ఉపయోగించాలి: గుమ్మడికాయ విత్తనాల మాదిరిగానే పొద్దుతిరుగుడు విత్తనాలను వేయించి తినవచ్చు. సలాడ్‌లు, పెరుగు, తృణధాన్యాలతో కలిపి తినవచ్చు.
నువ్వులు :
నువ్వులు (Sesame seeds)లలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. నువ్వులు ఎముకలను బలంగా ఉంచడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడుతాయి. అలాగే.. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అంతేకాకుండా నువ్వులోని లిగ్నాన్స్ అనే ఫైటోకెమికల్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
ఎలా ఉపయోగించాలి: నువ్వులను వేయించి చట్నీ, పొడి చేయవచ్చు. తీపి పదార్థాలలో కూడా చేర్చవచ్చు. ప్రతిరోజూ ఒక చెంచా నువ్వులు తినడం మంచిది.
అవిసె విత్తనాలు :
ఇటీవలి కాలంలో అవిసె విత్తనాల గురించి అవగాహన పెరుగుతోంది. ఈ గింజల్లో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. వీటిలో కరిగే, కరగని ఫైబర్లు ఉంటాయి. అవిసె గింజలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.అలాగే కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించవచ్చు.
ఎలా ఉపయోగించాలి: అవిసె విత్తనాలను పొడి చేసుకోని తినడం మంచిది. సూప్‌లు, చట్నీ, దోశ పిండి, రొట్టె, ఓట్ మీల్, స్మూతీస్ వంటి వాటితో కలుపుకుని తినవచ్చు.
చియా విత్తనాలు :
చియా విత్తనాలను పోషకాల పవర్‌హౌస్ గా పరిగణిస్తారు. ఇందులో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, వివిధ రకాల యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, కడుపులో మంటను తగ్గించడానికి సహాయపడతాయి.
ఎలా ఉపయోగించాలి: చియా విత్తనాలను నీటిలో నానబెట్టి త్రాగవచ్చు. స్మూతీస్, పెరుగు, పుడ్డింగ్, ఓట్ మీల్ వంటి వాటితో కలపవచ్చు. సలాడ్‌లపై చల్లుకుని కూడా తినవచ్చు.
దోసకాయ గింజలు:
దోసకాయ విత్తనాలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడం, మలబద్ధకం నివారించడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, చర్మం, జుట్టు ఆరోగ్యానికి మంచివి, బరువు తగ్గడానికి సహాయపడతాయి. మానసిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.
ఎలా ఉపయోగించాలి: దోసకాయను విత్తనాలతో సహా తినవచ్చు. విత్తనాలను ఎండబెట్టి పొడి చేసి, సూప్‌లు, సలాడ్‌లు, పెరుగు, స్మూతీస్ వంటి వాటితో కలుపుకోవచ్చు. లేదా వేయించి చిరుతిళ్లుగా కూడా తినవచ్చు.