AC : ఎండలోంచి నేరుగా ఏసీ రూమ్ లోకి వెళ్తున్నారా..? ఆ చల్లదనం ఎంత డేంజరో తెలుసా..?
వేసవికాలం మండుటెండల నుంచి తప్పించుకోవడానికి చాలామంది ఇళ్లలో, ఆఫీసులతో ఏసీలు పెట్టించుకుంటారు. బయట ఎండలో తిరిగిరాగానే వెంటనే ఏసీ రూంలో చల్లని గాలికి కూర్చోవడం చాలా హాయిగా ఉంటుంది. కానీ ఈ చల్లదనం వెనక ప్రమాదం దాగివుంది... అదేంటో తెలుసా..?
వేసవిలో ఏసి ఎంత ప్రమాదకరమో తెలుసా..?
వేసవి కాలంలో ఎండలు మండిపోతున్నాయి... బయట 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలులు, ఉక్కపోత తెలుగు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి... ఇక మధ్యాహ్నం సమయంలో బయటకు వెళితే అంతే సంగతి... ఈ మండుటెండలు మాడు పగలగొట్టడం ఖాయం.
అయితే చాలామంది అవసరముండి ఈ ఎండల్లో బయటకు వెళ్లినా తిరిగిరాగానే ఏసి గదిలోకి దూరిపోతారు. మండే ఎండలో బయట తిరిగి వెంటనే ఏసీ గదిలోకి వెళ్తే దొరికే ఉపశమనం మాటల్లో చెప్పలేనిది. కానీ ఆ హాయి వెనుక కొన్ని ఆరోగ్య సమస్యలు దాగి ఉన్నాయని మీకు తెలుసా..? ఎండల నుంచి రాగానే చల్లటి ఏసీ గదిలోకి వెళ్లడం వల్ల కలిగే నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఎండలోంచి నేరుగా ఏసీ గదిలోకి వెళ్లకండి..
వేసవి కాలం వచ్చిందంటే చాలు, ఎండ వేడిమి తట్టుకోలేక చాలామంది ఏసీలను ఆశ్రయిస్తారు. బయటి నుంచి రాగానే ఏసీ స్విచ్ ఆన్ చేసి దాని ముందు కూర్చుంటే చాలా రిలీఫ్‌గా అనిపిస్తుంది. కానీ ఈ చిన్న అలవాటే మీ ఆరోగ్యాన్ని పాడుచేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండలోంచి తిరిగివచ్చి నేరుగా ఏసి చల్లని గాలితో శరీరాన్ని కూల్ చేయడానికి అస్సలు ప్రయత్నించకూడదని సూచిస్తున్నారు.
మండుటెండలను మన శరీరం ఎలా తట్టుకుంటుంది..?
సాధారణంగా మన శరీరం బయటి ఉష్ణోగ్రతకు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకునే శక్తిని కలిగి ఉంటుంది. మనం ఎండలో ఉన్నప్పుడు ఆ వేడిని తట్టుకునేలా చెమట పట్టడం, రక్తనాళాలు వ్యాకోచించడం వంటి ప్రక్రియల జరుగుతాయి... తద్వారా శరీరం తన ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుకుంటుంది. ఇది మన శరీరంలో సహజంగా ఉండే ఒక రక్షణ వ్యవస్థ.
ఎండలో నుండి నేరుగా ఏసి గదిలోకి వెళితే ఏం జరుగుతుంది...?
అయితే ఎండలోంచి వచ్చిన వెంటనే అకస్మాత్తుగా తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ఏసీ గదిలోకి వెళ్లినప్పుడు మన శరీర సహజ రక్షణ వ్యవస్థకు ఆటంకం కలుగుతుంది. ఉష్ణోగ్రతలో వచ్చే ఈ ఆకస్మిక మార్పుల వల్ల బాడీలోని రక్షణ వ్యవస్థ కన్ఫ్యూజ్ అవుతుంది. దీంతో జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలతో పాటు తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ఇది మన రోగనిరోధక శక్తిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఎండలో తిరిగి ఇంటికి రాగానే ఏం చేయాలి..?
ఎండలో నుంచి ఇంటికి లేదా ఆఫీస్‌కు వచ్చిన వెంటనే కాసేపు నీడలో లేదా ఫ్యాన్ కింద కూర్చోవాలి. శరీర ఉష్ణోగ్రత కాస్త సాధారణ స్థితికి వచ్చాకే ఏసీ గదిలోకి వెళ్లడం సురక్షితం. అలాగే ఎండలో తిరిగివచ్చిన వెంటనే బాగా చల్లగా ఉన్న నీళ్లు తాగడం కూడా మంచిది కాదు. ఇలా తీవ్ర ఎండ, తీవ్ర చల్లని పరిస్థితులు వెంటవెంటనే మారడం శరీరానికి మంచిది కాదు. కాబట్టి కాస్త విరామం ఇవ్వడం ద్వారా మీరు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండొచ్చు.

