Healthy Tips: సంపూర్ణ ఆరోగ్యం కోసం.. ఈ అలవాట్లు తప్పని సరి!
Healthy Tips: ఆరోగ్యంగా జీవించాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ దానికి తగిన జీవనశైలిని పాటిస్తున్నామా అంటే ఖచ్చితంగా తెలియదు. మన ఆరోగ్యకరమైన అలవాట్లే.. మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి.అలాంటి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలనుకుంటే ఈ విషయాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోకూడదు. ఆ ఆరోగ్యకర అలవాటు ఏంటో తెలుసుకుందాం.

సరైన నిద్ర :
శరీర, మానసిక ప్రశాంతతకు సరైన నిద్ర చాలా అవసరం. మనం నిద్రపోతేనే రిఫ్రెష్ అవుతుంది. తగినంత నిద్రలేకపోతే, అలసట, ఏకాగ్రత లోపం, చిరాకు వంటి సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలంలో ఇది ఊబకాయం, డయాబెటిస్, గుండె జబ్బులు, మానసిక ఆరోగ్య సమస్యలు రావొచ్చు.
రోజుకు 7- 8 గంటలు నిద్రపోవాలి. పిల్లలు, యుక్తవయస్కులకు ఎక్కువ నిద్ర అవసరం కావచ్చు. ప్రతిరోజూ ఒక నిర్ణీత సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. పడకగది ఎల్లప్పుడూ ప్రశాంతంగా, చీకటిగా, చల్లగా ఉండాలి. పడుకునే ముందు మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ చూడటం మానుకుని పుస్తకం చదవడం, ధ్యానం వంటివి చేయాలి.
పోషకాహారం
మనం తినే ఆహారం కూడా శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది. పోషకాహారం శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది, వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. శరీర అవయవాలు సక్రమంగా పనిచేయడానికి పోషకాహారం సహాయపడుతుంది.
విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలైన పప్పులు, చిక్కుళ్ళు, చేపలు, చికెన్, గుడ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే చేపలు, అవిసె గింజలు, చియా గింజలు, అవకాడో వంటివి తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి.
వ్యాయామం
వ్యాయామం శారీరక ఆరోగ్యానికే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, కండరాలను బలపరుస్తుంది, ఎముకలను దృఢంగా చేస్తుంది, బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించి, నిద్రను మెరుగుపరుస్తుంది.
పెద్దలు క్రమం తప్పకుండా వారానికి కనీసం 150 నిమిషాల మితమైన వ్యాయామం (వేగంగా నడవడం) లేదా 75 నిమిషాల తీవ్రమైన వ్యాయామం (పరుగెత్తడం) చేయాలి. అదనంగా, వారానికి రెండుసార్లు కండరాలను బలపరిచే వ్యాయామాలు చేయాలి.
నీరు
నీరు మన శరీరంలోని అన్ని విధులకు అవసరం. ఇది పోషకాలను రవాణా చేయడానికి, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, వ్యర్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. తగినంత నీరు త్రాగకపోతే, డీహైడ్రేషన్ సంభవిస్తుంది. అలసట, తలనొప్పి, మలబద్ధకం, మూత్రపిండాల సమస్యలు తలెత్తుతాయి.
సాధారణంగా రోజుకు 8-10 గ్లాసుల నీరు త్రాగడం మంచిది. ఇది శారీరక శ్రమ, వాతావరణం, ఆరోగ్య పరిస్థితిని బట్టి మారవచ్చు. భోజనానికి ముందు, తర్వాత ఒక గ్లాసు నీరు త్రాగాలి.
ఒత్తిడి నిర్వహణ
ఆధునిక జీవితంలో ఒత్తిడి భాగమైంది. అయితే, అదుపులేని ఒత్తిడి శారీరక, మానసిక ఆరోగ్యానికి హానికరం. ఇది నిద్రలేమి, తలనొప్పి, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, నిరాశకు దారితీస్తుంది.
ధ్యానం, శ్వాస వ్యాయామాలు, యోగా వంటివి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇష్టమైన కార్యకలాపాల్లో పాల్గొనడం. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం వంటివి ఒత్తిడిని బాగా తగ్గించడంలో సహాయపడతాయి.