Home Garden: పెరట్లో ఈ కూరగాయలు పెంచుకుంటే.. ఆరోగ్యం, ఆహ్లాదం మీ సొంతం..
Home Gardening: మొక్కలంటే ప్రాణామా? మొక్కలు పెంచడానికి సమయం లేక మీరు ఇబ్బంది పడుతున్నారా? అయితే.. కొన్నిరకాల కూరగాయలను పెరటిలో లేదా టెర్రస్ పై చిన్న కుండీలలో సులభంగా పెంచుకోవచ్చు. పెరటిలో పెంచుకునే కూరగాయ మొక్కల సమాచారం మీ కోసం..

పెరటిలో పెంచుకునే కూరగాయలు
మొక్కలు పెంచడమంటే ఇష్టమా? కేటాయించే సమయం లేక మీరు ఇబ్బంది పడుతున్నారా? అలాంటప్పుడు త్వరగా, తక్కువ సమయంలో పెరిగే కూరగాయలను సాగు చేయడం ఉత్తమం. మీ ఇంట్లోనే తాజా కూరగాయలను పండించుకోండి. ఎంజాయ్ చేస్తూ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి. పెరటిలో పెంచుకునే కూరగాయల సమాచారం మీ కోసం..
టమాటా
టమాటా మొక్కలను ఇంటి పెరట్లో లేదా బాల్కనీలోని కుండీల్లో చాలా సులభంగా పెంచుకోవచ్చు. టమాటా సాగుకోసం కనీసం 12 అంగుళాల లోతు, 10 అంగుళాల వెడల్పు గల కుండను తీసుకోవాలి. అందులో సారవంతమైన మట్టితో పాటు కంపోస్ట్ ఎరువును ఉపయోగించాలి. ప్రతి 2-3 వారాలకు సేంద్రియ ఎరువులు ఇవ్వాలి. టమోటా పెరగడానికి 20-25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం.
పాలకూర
పాలకూర ను చిన్న స్థలంలో కూడా పెంచవచ్చు. తగినంత సూర్యరశ్మి, నీరు, సారవంతమైన నేల ఉండేలా చూసుకోవాలి. పాలకూర పెరగడానికి, వెడల్పుగా, నిస్సారంగా ఉండే కంటైనర్లను ఎంచుకోండి. తెగుళ్ళను నివారించడానికి లేదా నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి.
ముల్లంగి
ముల్లంగిని కుండీలో కూడా పెంచొచ్చు. ముల్లంగి పెంచడానికి 10 లేదా 6 ఇంచుల కుండీ తీసుకోవాలి. సేంద్రియ మట్టి వేసి తక్కువ నీరు పోస్తూ వీటిని పెంచొచ్చు. దీనికి నాణ్యమైన ఎరువు వేస్తే ఎక్కువ దుంపలు వస్తాయి.
క్యారెట్
క్యారెట్ వంటి కూరగాయలను నెల రోజుల వ్యవధిలోనే ఇంటి పెరట్లో సులభంగా పండించుకోవచ్చు. వీటిని చిన్న కంటైనర్ లో పెంచుకోవచ్చు. ఇవి పెరగడానికి వదులైన నేల అవసరం. దిగుబడి కోసం ఎరువులు వాడాలి. వీటికి 2, 3 రోజులు ఒకసారి నీరు పోస్తే సరిపోతుంది. క్యారెట్లు 30 -45 రోజుల్లో కోతకు వస్తాయి.
లెట్యూస్
లెట్యూస్... ఇటీవల బాగా వినిపిస్తోన్న ఆకుకూర. సలాడ్లు, శాండ్‌విచ్‌లు, గ్రిల్డ్ ఐటెమ్స్‌తోపాటు కూరల్లోనూ వినియోగించే ఈ లెట్యూస్ ను మన ఇంటి పెరటిలో కూడా సులువుగా పెంచుకోవచ్చు. లెట్యూస్ చాలా వేగంగా పెరుగుతుంది. దీనికి చల్లని వాతావరణం అనుకూలం, ఏడాది పొడవునా పెంచవచ్చు.
దోసకాయలు
ఇంట్లో దోసకాయలను సాగు చేయడం సులభం. వీటిని కుండీలలో కూడా పెంచుకోవచ్చు. వీటి పెరుగుదలకు వెచ్చని వాతావరణం అవసరం. అంటే రోజంతా కనీసం ఆరు గంటల పాటు సూర్యరశ్మి అందాలి. దోసకాయ మొక్కలు తీగలా పాకుతాయి, కాబట్టి వాటికి పెరగడానికి స్థలం, కర్రలు, తీగల సపోర్టు అవసరం.
గ్రీన్ బీన్స్
గ్రీన్ బీన్స్.. వీటిని స్ట్రింగ్ బీన్స్, స్నాప్ బీన్స్ అని కూడా పిలుస్తుంటారు. పోషకాలు సమృద్ధిగా ఉండే గ్రీన్ బీన్స్ ను ఇంటి పెరట్లో సులభంగా పెంచుకోవచ్చు. వీటికి ఎక్కువ సూర్యరశ్మి అవసరం. కాబట్టి, ఇంటి ఆవరణలో ఎండ బాగా తగిలే ప్రదేశంలో పెట్టాలి. ఇవి పెరగడానికి సపోర్టుగా కంచె లేదా కర్రాలను ఏర్పాటు చేయాలి. బుష్ బీన్స్ అయితే.. ఎలాంటి సపోర్టు అవసరం లేదు.